అప్పులు చేయొద్దని తల్లి మందలించిందని.. | Son and daughter in law hang themselves | Sakshi
Sakshi News home page

అప్పులు చేయొద్దని తల్లి మందలించిందని..

Mar 6 2026 4:18 AM | Updated on Mar 6 2026 4:18 AM

Son and daughter in law hang themselves

మనస్తాపంతో ఉరి వేసుకున్న కొడుకు, కోడలు  

కోడలు మృతి.. ప్రాణాపాయ స్థితిలో కొడుకు  

నవాబుపేట: అప్పులు ఎక్కువగా చేస్తున్నారని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు తన భార్యతో కలిసి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఈ ఘటనలో భార్య మృతిచెందగా.. ఆ యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం జంగమయ్యపల్లిలో ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. జంగమయ్యపల్లికి చెందిన మురగని రవి (25), లావణ్య (23) భార్యాభర్తలు. 

రవి కొంతకాలంగా ఎక్కువగా అప్పులు చేస్తుండటంతో బుధవారం రాత్రి అతడి తల్లి పద్మమ్మ మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన రవి భార్య లావణ్యతో పాటు 11 నెలల కూతురిని తీసుకుని పొలానికి వెళ్లాడు. రాత్రి పొలంలోనే వారు నిద్రించారు. గురువారం ఉదయం రవి తన సోదరుడు ఆనంద్‌కు వీడియో కాల్‌ చేసి.. చెట్టుపై తాను, తన భార్య కూర్చున్నామని, తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. 

వెంటనే అప్రమత్తమైన ఆనంద్‌ గ్రామస్తులతో కలిసి పొలానికి వెళ్లి చూడగా.. దంపతులిద్దరూ చెట్టుకు వేలాడుతూ కనిపించారు. వారిని కిందికి దింపి ఆస్పత్రికి తరలించగా అప్పటికే లావణ్య మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రవి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై లావణ్య తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement