padmamma
-
అప్పులు చేయొద్దని తల్లి మందలించిందని..
నవాబుపేట: అప్పులు ఎక్కువగా చేస్తున్నారని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు తన భార్యతో కలిసి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఈ ఘటనలో భార్య మృతిచెందగా.. ఆ యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం జంగమయ్యపల్లిలో ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. జంగమయ్యపల్లికి చెందిన మురగని రవి (25), లావణ్య (23) భార్యాభర్తలు. రవి కొంతకాలంగా ఎక్కువగా అప్పులు చేస్తుండటంతో బుధవారం రాత్రి అతడి తల్లి పద్మమ్మ మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన రవి భార్య లావణ్యతో పాటు 11 నెలల కూతురిని తీసుకుని పొలానికి వెళ్లాడు. రాత్రి పొలంలోనే వారు నిద్రించారు. గురువారం ఉదయం రవి తన సోదరుడు ఆనంద్‌కు వీడియో కాల్ చేసి.. చెట్టుపై తాను, తన భార్య కూర్చున్నామని, తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పి ఫోన్ కట్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన ఆనంద్ గ్రామస్తులతో కలిసి పొలానికి వెళ్లి చూడగా.. దంపతులిద్దరూ చెట్టుకు వేలాడుతూ కనిపించారు. వారిని కిందికి దింపి ఆస్పత్రికి తరలించగా అప్పటికే లావణ్య మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రవి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై లావణ్య తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
మరిది చేతిలో వదిన దారుణ హత్య
నవాబుపేట మండలం చిట్టిగిడ్డ గ్రామంలో పద్మమ్మ(35) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి తన సొంత వదినను గొడ్డలితో నరికి చంపాడు. హత్య అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పత్తి రైతు బలవన్మరణం
యాలాల, న్యూస్‌లైన్: ఆరుగాలం కుటుంబమంతా కలిసి చెమటోడ్చి నా ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాలేదు. పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు కుప్పలవుతున్నాయి. వాటి ని తీర్చే మార్గం కానరాకపోవడంతో మనోవేదనకు గురైన ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన మండల పరిధిలోని ఎన్కెపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ కిష్టప్ప, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నట్టల చిన్న నర్సప్ప(35)కు స్థానికంగా పదెకరాల పొలం ఉంది. ఆయన నాలుగు ఎకరాల్లో పత్తి పంట సాగు చేసి మిగతాది బీడుగా ఉంచాడు. పెట్టుబడి కోసం నర్సప్ప తెలిసిన వారి వద్ద రూ.85 వేలు అప్పు చేశాడు. జంటుపల్లిలోని ఆంధ్రా బ్యాంకులో రూ.70 వేలు తీసుకున్నాడు. ఆరుగాలం అంతా కుటుంబంతో కలిసి కష్టపడినా ఫలితం లేకుండా పోయింది. వరుస తుపానులు పంటను దెబ్బతీశాయి. దీంతో మూడు క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. అది కూలీల ఖర్చులకు కూడా సరిపోలేదు. రోజురోజుకు అప్పునకు వడ్డీలు పెరుగుతున్నాయి. రుణం తీర్చే మార్గం కానరావడం లేదని నర్సప్ప ఇటీవల భార్య పద్మమ్మతో వాపోతూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈక్రమంలో పొలానికి వెళ్తున్నానని శుక్రవారం ఉదయం ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఉదయం 11గంటల సమయంలో స్థానికులు చూడగా నర్సప్ప తన పొలంలో ఓ చెట్టుకు విగత జీవిగా వేలాడుతూ కనిపించాడు. కిందికి దించి పరిశీలించగా అప్పటికే ప్రా ణం పోవడంతో కుటుంబసభ్యులకు విషయం తెలి పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య పద్మమ్మతో పాటు కొడుకు భానుప్రసాద్, కూతురు భారతి ఉన్నారు. నర్సప్ప మృతితో కుటుంబీ కులు గుండెలుబాదుకుంటూ రోదించారు. నర్సప్ప ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం వీధినపడిందని గ్రామస్తులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం నర్సప్ప మృతదేహాన్ని తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


