సింఘ్వీ, వేం ఎన్నిక ఏకగ్రీవమే! | Singhvi and Vem Narender Reddy to be elected unanimously for Rajya Sabha | Sakshi
Sakshi News home page

సింఘ్వీ, వేం ఎన్నిక ఏకగ్రీవమే!

Mar 6 2026 1:09 AM | Updated on Mar 6 2026 1:09 AM

Singhvi and Vem Narender Reddy to be elected unanimously for Rajya Sabha

సీఎం రేవంత్, పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌తో కలిసి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పిస్తున్న సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి. చిత్రంలో శ్రీధర్‌బాబు, ఆది శ్రీనివాస్, జుల్ఫీకర్‌ అలీ తదితరులు

సంఖ్యాబలం లేక రాజ్యసభ పోటీలో నిలవని ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ 

ఎమ్మెల్యేలెవరూ బలపరచకుండానే స్వతంత్ర అభ్యర్థిగా ఒకరి నామినేషన్‌ 

నేడు స్క్రూటినీలో తిరస్కరణకు గురవుతుందన్న అసెంబ్లీ వర్గాలు 

సీఎం సమక్షంలో నామినేషన్లు వేసిన సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి.. ఎన్నిక లాంఛనమే

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్‌ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్‌ పార్టీ వారిద్దరినీ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేయగా గురువారం శాసనసభ ప్రాంగణంలో ఎన్నికల అధికారి ఉపేందర్‌రెడ్డికి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. తగినంత సంఖ్యాబలం లేనందున బీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎన్నికల బరిలో ఎవరినీ పోటీకి నిలపలేదు. సాయి అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసినప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలు బలపరచాలనే నిబంధనను పాటించని కారణంగా ఆయన అభ్యర్థిత్వం శుక్రవారం స్రూ్కటినీలో తిరస్కరణకు గురవుతుందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్రం నుంచి రాజ్యసభకు పార్టీ హైకమాండ్‌ ప్రతిపాదించిన సింఘ్వీ రెండోసారి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్నేహితుడు వేం నరేందర్‌రెడ్డి రాజ్యసభలో అడుగుపెట్టడం లాంఛనం కానుంది. 

సీఎం, మంత్రులు వెంట రాగా నామినేషన్లు దాఖలు 
కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన అభిషేక్‌ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి ఉదయం 10:30 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభకు వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీకి రాగా ఆయనతో కలిసి వెళ్లి మరో సెట్‌ నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారి ఉపేందర్‌రెడ్డికి అందజేశారు.

సింఘ్వీ మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా వేం నరేందర్‌రెడ్డి నాలుగు సెట్లు దాఖలు చేశారు. మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం నుంచి నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి హాజరైన ఎంఐఎం ఎమ్మెల్యేలు అహ్మద్‌ బిన్‌ బలాలా, జుల్పికర్‌ అలీ ఒక సెట్‌ నామిషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. ఊహించినట్లుగానే బీఆర్‌ఎస్‌ రాజ్యసభ బరిలో అభ్యర్థిని దించలేదు. రాజ్యసభ సభ్యత్వాన్ని పొందేందుకు అవసరమైన 40 మంది శాసనసభ్యుల బలం లేకపోవడంతో పోటీ చేయలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 

రెండోసారి రాజ్యసభకు అదృష్టం: సింఘ్వీ 
నామినేషన్‌ దాఖలు అనంతరం వేం నరేందర్‌రెడ్డితో కలిసి గాంధీ భవన్‌కు వచ్చిన అభిషేక్‌ మను సింఘ్వీకి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిశారు. అనంతరం సింఘ్వీ తెలంగాణ తరఫున రాజ్యసభకు రెండోసారి వెళ్లనుండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. రెండోసారి తెలంగాణ నుంచి ఎంపీగా తనను ఎంపిక చేసిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాం«దీ, కేసీ వేణుగోపాల్‌కు ధన్యవాదాలు తెలిపారు.

వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ నుంచి రాజ్యసభకు వెళ్లడం ఆనందంగా ఉందని.. ఇప్పటివరకు ఎలా పనిచేశానో, భవిష్యత్తులోనూ అలాగే పనిచేస్తానన్నారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధుల కోసం పోరాడుతానని పేర్కొన్నారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసిన రేవంత్‌రెడ్డి, మహేశ్‌గౌడ్‌కు ధన్యవాదాలు తెలిపారు. కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి పెళ్లికి హాజరయ్యేందుకు హైదరాబాద్‌ వచ్చిన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డిలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement