Shiv Pratap Shukla
-
జైళ్ల శాఖ మంత్రిగా చేశా.. మీ సమస్యలు నాకు తెలుసు!
కుషాయిగూడ (హైదరాబాద్): మత్తు పదార్థాల దుర్వినియోగం తీవ్రమైన సామాజిక, ప్రజా ఆరోగ్య సమస్యగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా చెప్పారు. తన రాజకీయ జీవితంలో అనేకసార్లు జైళ్లను సందర్శించిన అనుభవం ఉందని ఖైదీలు, జైలు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. గతంలో యూపీలో జైళ్ల శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో జైళ్లలో పరిస్థితుల మెరుగుదలకు, సి బ్బంది సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసు కానిస్టేబుళ్లకు, జైలు వార్డర్లకు సమాన వేతనాలు కల్పించేందుకు కృషి చేసినట్లు చెప్పారు. ఖైదీలకు మానవీయ వాతావరణం కల్పించేందుకు జైళ్లలో ఫ్యాన్లు, టీవీ వంటి సౌకర్యాలు ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. భవిష్యత్‌లో కూడా సంస్కరణాత్మక కారాగార వ్యవస్థను బలోపతం చేయడంలో తన మద్దతు కొనసాగుతుందని స్పష్టంచేశారు. సోమవారం చర్లపల్లి కేంద్ర కారాగారంలో ‘నివృత్తి’మత్తు విముక్తి కేంద్రాన్ని శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్తు విముక్తి కేంద్రాల వంటి కార్యక్రమాలు నషా ముక్త్ భారత్ అభియాన్ వంటి జాతీయ పథకాల లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయన్నారు. తెలంగాణ కారాగార శాఖ సంస్కరణాత్మక, మానవీయ దృక్పథంతో ముందుకు సాగుతుండటం అభినందనీయమని చెప్పారు. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఏరియా 77 నేచర్ క్యాంప్, అడ్వెంచర్ పార్క్ ప్రాజెక్టు ఓపెన్ ఎయిర్ జైలు ఖైదీలు, విడుదలైన ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. వినోదాత్మక, శిక్షణాత్మక కార్యకలాపాల ద్వారా పునరావాసానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని పేర్కొన్నారు. జీవనోపాధి కార్యక్రమాల ద్వారా ఖైదీల్లో నైపుణ్యాభివృద్ధి మెరుగుపరచడంతోపాటు బాధ్యతాభావాన్ని పెంపొందించవచ్చని చెప్పారు. కీలక మైలురాయిగా నివృత్తి: డీజీ సౌమ్యా మిశ్రా చర్లపల్లి జైల్లో ‘నివృత్తి’మత్తు విముక్తి కేంద్రం జైలు సంస్కరణల దిశగా ఓ కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని తెలంగాణ జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా మిశ్రా అన్నారు. ఈ కేంద్రాలు చంచల్‌గూడ, చర్లపల్లి, సంగారెడ్డి, నిజామాబాద్ సెంట్రల్ జైలుతోపాటు హైదరాబాద్ మహిళా ప్రత్యేక జైలులో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఖైదీలు గౌరవప్రదంగా తమ జీవితాలను పునర్నిర్మించుకునే అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, వికలాంగుల, వృద్ధుల సంక్షేమశాఖ డైరెక్టర్ శైలజ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘దేశ వికాసంలో రాజస్థాన్ ప్రజల పాత్ర ఎనలేనిది’
హైదరాబాద్ దేశ వికాసంలో రాజస్థాన్ ప్రజల పాత్ర ఎనలేనిదన్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా. హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో సోమవారం(మార్చి 30వ తేదీ )ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ లో భాగంగా రాజస్థాన్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లో ఉంటున్న రాజస్థాన్ వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సతీమణితో పాటు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో సంస్కృతి, సాంప్రదాయాల పరంగా రాజస్థాన్‌కు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. భగవాన్ శ్రీ రాముడు, జన్మభూమి స్వర్గం కంటే మిన్న అని చెప్పారని.. వారి స్ఫూర్తితోనే రాజస్థాన్ ప్రజలు దేశ అభివృద్ధి, సాంస్కృతిక వికాసంకు గొప్ప సేవ చేస్తున్నారని గవర్నర్ కొనియాడారు. గవర్నర్ సందేశం అనంతరం ఏర్పాటు చేసిన రాజస్థాన్ సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షకులను కట్టిపడేశాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ సంయుక్త కార్యదర్శి శశికిరణాచారి, ఇతర లోక్ భవన్ ఉన్నతాధికారులు, రాజస్థాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఘనంగా ‘యువ భారత్ రన్ 2026’
హైదరాబాద్, మార్చి 29: హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం “యువ భారత్ రన్ 2026” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి స్కూల్స్ సంయుక్త ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య తనయుడు యశస్వి మల్కా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవం దేశంలోనే అతిపెద్ద యువత ఆధారిత ఫిట్నెస్ ఉద్యమంగా నిలిచింది. 10,000 మందికి పైగా విద్యార్థులు, కుటుంబ సభ్యులు, యువ ప్రొఫెషనల్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన ఈ రన్‌కు ఫిట్ ఇండియా, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మద్దతు అందించగా, రెడ్ ఎఫ్ఎమ్ అధికారిక రేడియో భాగస్వామిగా వ్యవహరించింది. ఈ రన్లో 5 కిలోమీటర్ల “ది ఛాలెంజ్” (టైమ్డ్ రన్), 2 కిలోమీటర్ల “రన్ అండ్ బాండ్” (కుటుంబ సభ్యులు, ప్రారంభికుల కోసం), 500 మీటర్ల “యంగ్ రన్నర్స్” (చిన్నారుల కోసం) వంటి విభాగాలు ఏర్పాటు చేశారు. అన్ని వయసుల వారికి అనుకూలంగా ఈ విభాగాలు ఉండటం విశేషం.రన్‌తో పాటు జుంబా, యోగా వార్మప్ సెషన్స్, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్, ప్లే జోన్స్, ఫుడ్ స్టాల్స్, గేమ్స్ వంటి వినోద కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. టైమ్డ్ కేటగిరీల్లో విజేతలకు మొత్తం రూ.1 లక్ష నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , రాష్ట్ర ఐటీ మంత్రి దుదెల శ్రీధర్ బాబు , సినీ నటుడు శర్వానంద్ హాజరయ్యారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ,వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు కలిసి జెండా ఊపి 2కే, 5కే రన్‌ను ప్రారంభించారు. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఈ పరుగును జెండా ఊపి ప్రారంభించి, యువతకు దిశానిర్దేశం చేశారు. వేల సంఖ్యలో విద్యార్థులు, పాల్గొన్న ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువత ఆరోగ్యకరమైన అలవాట్లపైనే ఆధారపడి ఉందన్నారు. కేవలం పరుగుగానే కాకుండా, ఇదొక శక్తివంతమైన ప్రజా ఉద్యమం అని ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు ప్రతి కుటుంబం క్రియాశీల జీవనశైలిని అలవర్చుకోవాలన్నారు. మాదకద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టి, ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం అవసరమని పేర్కొన్నారు.యువతలో విదేశీ అలవాట్లు పెరుగుతున్నాయని, అందరూ తమ మాతృభాషలో మాట్లాడాలని కోరారు. తల్లిదండ్రులతో సమయం గడపడం, ఉదయం త్వరగా లేవడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి మంచి అలవాట్లు అలవరుచుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. -
భద్రాచలం శ్రీరాముని పట్టాభిషేకం.. పాల్గొన్న గవర్నర్ దంపతులు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా సాగింది. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, వారి సతీమణి జానకి శుక్లా ఈ వేడుకకు హాజరై సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే వెంకట్రావు, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఈ ఉత్సవాన్ని తిలకించారు.భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనేందుకు తొలిసారి వచ్చిన తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ హెలీప్యాడ్ వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు శాలువా, పుష్పగుచ్ఛం అందజేసి గవర్నర్ స్వాగతం పలికారు.భద్రగిరి మార్ట్‌ను ప్రారంభించిన గవర్నర్గవర్నర్ ఐటీడీఏ ఆధ్వర్యంలో భద్రాచలంలో భద్రగిరి మార్ట్‌ను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. మార్ట్‌లో విక్రయానికి ఉంచిన గిరిజన ఉత్పత్తుల గురించి భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్, సహాయ ప్రాజెక్ట్ అధికారి (జనరల్) డేవిడ్‌లు గవర్నర్‌కు వివరించారు. గిరిజన ఉత్పత్తులను పరిశీలించి, పలు ఉత్పత్తులను గవర్నర్ దంపతులు కొనుగోలు చేశారు. -
తెలుగువారందరికీ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉగాది శుభాకాంక్షలు
హైదరాబాద్: ప్రపంచంలోని తెలుగువారందరికీ తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘పరాభవ నామ ఉగాది శుభ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు మాట్లాడే సోదరులు, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ తెలుగు నూతన సంవత్సరం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆశీర్వాదాలు, సమృద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.‘ఉగాది ఆనందం, ఆశల పండుగ. ఈ నూతన సంవత్సరం కొత్త ఉత్సాహం, ప్రకాశవంతమైన భవిష్యత్తును తీసుకురావాలి. ఉగాది స్ఫూర్తిని, సంప్రదాయ ఉగాది పచ్చడిలోని విభిన్న రుచులు సూచించే భావాన్ని ఆమోదించి, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆశావాద దృక్పథంతో ఎదుర్కొందాం. ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రతి ఒక్కరికీ, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి, సమృద్ధి, ఐక్యత, ఆరోగ్యం, ఆనందం తీసుకురావాలి’ అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన సందేశంలో పేర్కొన్నారు. -
ప్రగతి తెలంగాణే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతంగా తెలంగాణకు గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఈ దిశగా బలమైన పునాదులు వేసేందుకు ఎన్నో సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. ఇదే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్–2047 విజన్‌కు శ్రీకారం చుట్టింది. దేశ పురోగతిలో ప్రధాన భూమిక పోషించే స్థాయికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పెరిగేలా చర్యలు చేపట్టింది..’అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా చెప్పారు.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని సోమ వారం ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ప్రజా పాలన స్ఫూర్తి కొనసాగింపు రాష్ట్రం ఏర్పాటుకు ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలను స్మరిస్తూ, వారిని గౌరవిస్తూ ప్రభుత్వం ప్ర జా పాలన స్ఫూర్తిని కొనసాగిస్తోంది. అమలు చేసే ప్రతి పథకం, ప్రతి విధానం, ప్రతి కార్యాచరణలో ప్రజల ఆత్మగౌరవం, సంక్షేమం, సామాజిక సమానత్వాన్ని ప్రభుత్వం పాటిస్తుందని విశ్వసిస్తున్నా. అదే ప్రజా పాలనకు గీటురాయి. రాష్ట్ర అభివృద్ధి అంటే కేవలం హైదరాబాద్ కేంద్రంగా జరగాలనే పాత మోడల్‌కు ప్రజా ప్రభుత్వం ముగింపు పలికింది.రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమగ్రంగా, సమతుల్యంగా, సమ్మిళితంగా అభివృద్ధి చేసేందుకు ముందడుగు వేసింది. క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్, ప్యూర్ (పెరీ అర్బన్ రీజియన్), రేర్ (రూరల్ అగ్రి రీజియన్)తో వికేంద్రీకత వ్యూహాన్ని అనుసరిస్తోంది. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేసి భవిష్యత్తు తెలంగాణను నిర్మిస్తోంది. ఆర్థిక వ్యవస్థ సుస్థిర వృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ’తెలంగాణ రైజింగ్ విజన్–2047’డాక్యుమెంట్‌ను ఆవిష్కరించింది. ’వికసిత్ భారత్– 2047 విజన్’కు అనుగుణంగా, నీతి ఆయోగ్, ఐఎస్బీ, నల్సార్ వర్సిటీని సంప్రదించి దీన్ని రూపొందించింది. ప్రస్తుతం తెలంగాణ ఆర్థికంగా సుస్థిర స్థానంలో ఉంది. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సుస్థిర వృద్ధి నమోదు చేస్తోంది. 2025–26లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) రూ.17.82 లక్షల కోట్లు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.99 శాతం. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కి చేరుకుంది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని 0.2 శాతానికి ప్రభుత్వం నియంత్రించింది. ధరల స్థిరత్వం కొనసాగించింది. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చర్యలు గత రెండేళుŠాల్గ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎన్నో చర్యలు చేపట్టింది. రాష్ట్రం వేగంగా పట్టణీకరణ చెందుతోంది. 2031 నాటికి రాష్ట్రంలో పట్టణ జనాభా 53.8 శాతానికి చేరుకుంటుందని అంచనా. పట్టణాల భవిష్యత్తు అవసరాల దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించింది.ఇది నగర పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తుంది. మహా నగరంలో పరిపాలనా సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు హైదరాబాద్ పోలీసు అధికార పరిధిని విస్తరించింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, కొత్తగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్లుగా పునర్వవ్యస్థీకరించింది. నీటి వనరుల పునరుద్ధరణకు హైడ్రా క్యూర్ పరిధిలోని ప్రాంతాన్ని పారిశ్రామిక కాలుష్యం నుంచి విముక్తి కల్పించేందుకు కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించాలని నిర్ణయించింది. దీంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. క్యూర్ ప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించింది. క్యూర్ పరిధిలోని నీటి వనరులను పునరుద్ధరించేందుకు హైడ్రాను ఏర్పాటు చేసి దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన 1,045 ఎకరాలకు పైగా ఆక్రమణకు, కబ్జాలకు గురైన చెరువు భూములు, ప్రభుత్వ భూములను తిరిగి స్వా«దీనం చేసుకుంది.ఫలితంగా బతుకమ్మ కుంట, నల్ల చెరువు, బమ్ రుక్ ఉద్దౌలా చెరువులు పూర్వ వైభవం సంతరించుకున్నాయి. ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య ఉన్న ప్యూర్ ప్రాంతాన్ని ఇ¯న్ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. తెలంగాణ పశి్చమ ప్రాంతంలో ఉన్న కొడంగల్ ఏరియా ఇండ్రస్టియల్ హబ్ గా మారనుంది. జహీరాబాద్‌లో 3,245 ఎకరాల్లో నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ స్మార్ట్ సిటీ అభివృద్ధి జరుగుతోంది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు హైదరాబాద్‌లో 55 కిలోమీటర్ల మూసీ రివర్ ఫ్రంట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల నుంచి గాంధీ సరోవర్ వరకు ఫేజ్–1 ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభమవుతుంది. గోదావరి నీటిని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు అనుసంధానించడం ద్వారా 2.5 టీఎంసీల నీటిని మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు అందిస్తారు. దీంతో క్యూర్ ప్రాంతానికి రోజుకి 300 మిలియన్ గ్యాలన్ల తాగునీరు అందుతుంది.హైదరాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ, అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీ¯న్‌ఫీల్డ్ హైదరాబాద్–అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల కేంద్రం హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణెలకు మూడు హైస్పీడ్ బుల్లెట్ రైళ్లను ప్రకటించింది. ఈ నేపథ్యంలో శంషాబాద్‌ను బుల్లెట్ రైలు కేంద్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. 56 గ్రామాలు, ఏడు మండలాలతో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటైంది. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ఏర్పాటు కానుంది. భారీగా పెట్టుబడుల ఆకర్షణ తెలంగాణను గ్లోబల్ హబ్‌గా మార్చేలా ఆవిష్కరణలకు, పెట్టుబడుల సాధనకు, సుస్థిర అభివద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇటీవల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించింది. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక రంగంలోని ప్రముఖులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. ఇటీవలి 23వ బయో ఏషియా సదస్సులో దాదాపు రూ.1,700 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. సాగునీటికి, రైతు సంక్షేమానికి ప్రాధాన్యత రాష్ట్రంలో సాగునీటి రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, పునరావాస ప్రక్రియను కొన్ని నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయ ఉత్పాదకత పెంచేందుకు అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించటంతో పాటు రైతు సంక్షేమ పథకాలు అమలు చేసింది.రైతు భరోసా పెట్టుబడి సహాయ పథకం కింద ప్రభుత్వం కేవలం 9 రోజుల్లోనే రూ.8,744 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. రూ.2 లక్షల లోపు రైతుల పంట రుణాలను మాఫీ చేసింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 236.87 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. 3.38 కోట్ల మందికి ఆహార భద్రత రాష్ట్రంలో 3.38 కోట్ల మందికి ఆహార భద్రతను కల్పిస్తోంది. రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. 42.90 లక్షల కుటుంబాలకు రూ.500కే ఎల్పీజీ సిలిండర్లను అందిస్తోంది. 53.09 లక్షల కుటుంబాలు గృహజ్యోతి ఉచిత కరెంటు సరఫరాతో ప్రయోజనం పొందుతున్నాయి. విద్యార్థులకు డైట్ చార్జీలు 40 శాతం, కాస్మెటిక్ చార్జీలను 212 శాతం పెంచింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. డ్రగ్స్ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎ¯న్ఫోర్స్మెంట్)ను ఏర్పాటు చేసింది. రూ.3.13 లక్షల కోట్లకు ఐటీ ఎగుమతులు తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దాదాపు 9.39 లక్షల మంది యువతీ యువకులు ఐటీ ఉద్యోగాల్లో ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత ప్రోత్సహించడానికి, రూ.15 వేల కోట్లతో ప్రజా ప్రభుత్వం తెలంగాణ టూరిజం పాలసీ 2025–2030 ప్రకటించింది. దీంతో దాదాపు 3 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. చారిత్రక మార్పు దశలో రాష్ట్రం రాష్ట్రం ఒక చారిత్రక మార్పు దశలో నిలబడింది. ఈ బడ్జెట్ కేవలం ఆర్థిక కేటాయింపులకే పరిమితం కాదు. ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో, అధునాతనమైన భవిష్యత్ తెలంగాణ నిర్మాణానికి మార్గదర్శనం. రాష్ట్రంలోని ప్రతి పౌరుడి ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలను తీర్చేందుకు, తెలంగాణ సమగ్ర అభివద్ధికి ఉపయోగపడే రోడ్ మ్యాప్. రాష్ట్ర సమగ్ర, సమ్మిళిత, సంపూర్ణ అభివృద్ధిపై ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉంది.అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో ప్రభుత్వాన్ని ఎవరూ ఆపలేరు. అభివృద్ధి చెందిన దేశాలు, నగరాలతో పోటీపడే స్థాయికి తెలంగాణ చేరుకుంటుంది. ప్రజా ప్రభుత్వ స్వప్నాన్ని సాకారం చేయడానికి ఐకమత్యంతో, ఆత్మవిశ్వాసంతో నిలువెత్తు నిబద్ధతతో మనమందరం కలిసి పని చేద్దాం. తెలంగాణాను ప్రపంచంలోనే అగ్రభాగాన నిలుపుదాం. -
టెన్త్ విద్యార్థులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను ఒత్తిడిగా భావించకుండా, తమ జ్ఞానం, ప్రతిభను చూపించే మంచి అవకాశంగా భావించాలని.. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని గవర్నర్ పిలుపునిచ్చారు.పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఉండి, సమయాన్ని సక్రమంగా వినియోగించుకొని తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాలన్న శివ ప్రతాప్ శుక్లా.. ఆత్మ విశ్వాసం విజయానికి ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆయన ప్రశంసించారు. పరీక్షలకు హాజరవుతున్న ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. -
సుసంపన్న తెలంగాణ నిర్మిద్దాం
సాక్షి, హైదరాబాద్: ‘సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రివర్గ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు. మనమందరం కలిసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ లక్ష్యాలను గౌరవిస్తూ ముందుకు సాగుదాం. రాష్ట్ర గవర్నర్‌గా సమగ్రత, సమైక్యత, సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంటా. నా విధులను న్యాయబద్ధంగా, నిజాయితీగా, భారత రాజ్యాంగానికి లోబడి అంకితభావంతో నిర్వహిస్తా. మనమందరం సుసంపన్నమైన తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడానికి కలిసి పని చేద్దాం..’అని రాష్ట్ర నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు లోక్‌భవన్‌లో ఆయన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి తన సందేశాన్ని విడుదల చేశారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడం అదృష్టం ‘తెలంగాణ ప్రజలకు సేవ చేయడం గర్వంగా, అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం అంటే సాంస్కృతిక సంపద, గొప్ప సంప్రదాయాలు, అసాధారణ పురోగతికి నిదర్శనం. ఈ ప్రాంతం ఆశలు, ఆవిష్కరణలు, సహన శక్తికి చిహ్నంగా నిలుస్తుంది. ప్రజల అకుంఠిత దీక్ష, రాష్ట్రంలోని సమృద్ధ వనరులు, వ్యూహాత్మక దృష్టి.. సమగ్ర అభివృద్ధికి, స్థిరమైన ప్రగతికి బలమైన ప్రాతిపదికను అందిస్తాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా పని చేసిన నా అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. తెలంగాణ జై తెలంగాణ..’అని గవర్నర్ శుక్లా తన సందేశంలో పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలను అప్పగించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, డీజీపీ శివధర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం, ఆయన మంత్రివర్గ బృందంతో గవర్నర్ గ్రూపు ఫొటో దిగారు. తెలుగులో ప్రమాణం గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలుగులో ప్రమాణస్వీకారం చేయడం విశేషం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయనకు తెలుగు భాషతో ఇప్పటివరకు ఎలాంటి పరిచయం లేకపోయినా తెలుగులో ప్రమాణస్వీకారం చేయడానికి బాగా ప్రాక్టీస్ చేసినట్టు లోక్‌భవన్ వర్గాలు తెలిపాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం తెలుగులోనే ‘అనే నేను..’అనే పదాలతో ప్రమాణాన్ని ప్రారంభించగా, శివపత్రాప్ శుక్లా అనే నేను.. అంటూ గవర్నర్ పూర్తిగా తెలుగులో ప్రమాణం చేశారు. భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు చార్మినార్: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన కుటుంబ సభ్యులతో కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ కుమార్తె, అల్లుడు, కుమారుడు, కోడలు, మనవళ్ళు, మనవరాళ్లతో కలిపి దాదాపు 19 మంది వరకు ఆయన వెంట ఉన్నారు. ఆలయ ట్రస్టీ శశికళ వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పూర్ణకుంభంతో వారికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం వారిని ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
నేడు కొత్త గవర్నర్ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా బుధవారం ఉదయం 11.30 గంటలకు లోక్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు రాష్ట్ర మంత్రులు, అధికార, విపక్ష పార్టీల నేతలు, అధికారులు పాల్గొంటారు. గవర్నర్‌గా నియమితులైన శివప్రతాప్ శుక్లా మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. -
తెలంగాణ గవర్నర్ గా శివప్రతాప్ శుక్ల
-
విద్యార్థి నేత నుంచి తెలంగాణ గవర్నర్ దాకా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయన దశాబ్దాలపాటు బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా, రాష్ట్రాల గవర్నర్ స్థాయికి ఎదిగారు. 1952 ఏప్రిల్ 1న యూపీలోని గోరఖ్‌పూర్‌లో జని్మంచిన ఆయన.. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో (ఎల్ఎల్బీ) పట్టా పొందారు. ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి 19 నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. 1989లో తొలిసారి గోరఖ్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఆ తర్వాత 1991, 1993, 1996లలోనూ వరుస విజయాలు సాధించారు. యూపీ ప్రభుత్వంలో కళ్యాణ్ సింగ్, రాజ్‌నాథ్ సింగ్, రామ్ ప్రకాష్ గుప్తాల కేబినెట్లలో జైళ్లు, గ్రామాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. 2016లో యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.2017లో ప్రధాని మోదీ కేబినెట్లో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. పాలనాపరమైన అనుభవం, వివాదరహితుడిగా ఆయనకు పేరు ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 2023 ఫిబ్రవరిలో హిమాచల్ ప్రదేశ్ 29వ గవర్నర్‌గా నియమించింది. అక్కడ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించిన ఆయన్ను తాజాగా తెలంగాణ గవర్నర్‌గా బదిలీ చేసింది. -
తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా (73) నియమితులయ్యారు. ప్రస్తుతం హిమాచల్‌ప్ర దేశ్ గవర్నర్‌గా ఉన్న ఆయన్ను తెలంగాణకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన జిష్ణుదేవ్ వర్మను పొరుగున ఉన్న మహారాష్ట్రకు బదిలీ చేసింది. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ల (ఎల్జీ)ను మారుస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పాలనాపరమైన మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఒకేసారి పెద్ద సంఖ్యలో గవర్నర్లను, లెఫ్టినెంట్ గవర్నర్లను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనా అనుభవం ఉన్న పలువురిని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయగా, మరికొందరికి కొత్తగా అవకాశం కలి్పంచింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్లకు సైతం స్థానచలనం కలిగింది. లద్దాఖ్ ఎల్జీకి ప్రమోషన్ ఇచ్చి రాష్ట్ర గవర్నర్‌గా పంపడం గమనార్హం. కాగా, పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనందబోస్ తన పదవికి రాజీనామా చేయగా దాన్ని రాష్ట్రపతి ఆమోదించారు. ఇప్పటివరకు తమిళనాడు గవర్నర్‌గా ఉన్న ఆర్.ఎన్. రవిని బెంగాల్ గవర్నర్‌గా బదిలీ చేశారు.కొత్త నియామకాలు, బదిలీలు..⇒ తెలంగాణ: శివ ప్రతాప్ శుక్లా (హిమాచల్‌ప్రదేశ్ నుంచి బదిలీ) ⇒ మహారాష్ట్ర: జిష్ణుదేవ్ వర్మ (తెలంగాణ నుంచి బదిలీ) ⇒ పశ్చిమ బెంగాల్: ఆర్.ఎన్. రవి (తమిళనాడు నుంచి బదిలీ) ⇒ బిహార్: లెఫ్టినెంట్జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ ⇒ నాగాలాండ్: నంద్ కిశోర్ యాదవ్ ⇒ హిమాచల్ ప్రదేశ్: కవీందర్ గుప్తా (లద్దాఖ్ ఎల్జీకి ప్రమోషన్) ⇒ తమిళనాడు: రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (ప్రస్తుత కేరళ గవర్నర్‌కు తమిళనాడు అదనపు బాధ్యతలు) ⇒ లద్దాఖ్ ఎల్జీ: వినయ్ కుమార్ సక్సేనా (ఢిల్లీ నుంచి బదిలీ) ⇒ ఢిల్లీ ఎల్జీ: తరణ్‌జీత్ సింగ్ సంధూ -
భారీగా బదిలీలు.. తెలంగాణ గవర్నర్‌గా ఎవరంటే?
దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. తెలంగాణ గవర్నర్‌గా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను నియమించారు. తెలంగాణలో ఉన్న జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను.. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు.ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తరంజిత్ సింగ్ సంధును ఎంపిక చేయగా.. నాగాలాండ్ గవర్నర్‌గా నంద్ కిషోర్ యాదవ్ నియమితులయ్యారు. బీహార్ గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ నియమించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవిని బదిలీ చేశారు. తమిళనాడు గవర్నర్‌గా కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను నియమించగా.. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా నియమితులయ్యారు.


