ఘనంగా ‘యువ భారత్ రన్ 2026’ | Yuva Bharat Run 2026 In Hyderabad Sees Massive Youth Participation, Focus On Fitness And Wellness | Sakshi
Sakshi News home page

ఘనంగా ‘యువ భారత్ రన్ 2026’

Mar 29 2026 1:50 PM | Updated on Mar 29 2026 2:15 PM

Yuva Bharath Run 2026 At Neclace Road Peoples Plaza Hyderabad

యువతలో ఫిట్‌నెస్, విలువలకు నూతన దిశ

యువత ఫిట్ గా ఉండాలి: గవర్నర్ శివప్రతాప్‌ శుక్లా

హైదరాబాద్, మార్చి 29: హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం “యువ భారత్ రన్ 2026” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి స్కూల్స్ సంయుక్త ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య తనయుడు యశస్వి మల్కా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవం దేశంలోనే అతిపెద్ద యువత ఆధారిత ఫిట్‌నెస్ ఉద్యమంగా నిలిచింది. 10,000 మందికి పైగా విద్యార్థులు, కుటుంబ సభ్యులు, యువ ప్రొఫెషనల్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన ఈ రన్‌కు ఫిట్ ఇండియా, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మద్దతు అందించగా, రెడ్ ఎఫ్‌ఎమ్ అధికారిక రేడియో భాగస్వామిగా వ్యవహరించింది. ఈ రన్‌లో 5 కిలోమీటర్ల “ది ఛాలెంజ్” (టైమ్‌డ్ రన్), 2 కిలోమీటర్ల “రన్ అండ్ బాండ్” (కుటుంబ సభ్యులు, ప్రారంభికుల కోసం), 500 మీటర్ల “యంగ్ రన్నర్స్” (చిన్నారుల కోసం) వంటి విభాగాలు ఏర్పాటు చేశారు. అన్ని వయసుల వారికి అనుకూలంగా ఈ విభాగాలు ఉండటం విశేషం.

రన్‌తో పాటు జుంబా, యోగా వార్మప్ సెషన్స్, హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్, ప్లే జోన్స్, ఫుడ్ స్టాల్స్, గేమ్స్ వంటి వినోద కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. టైమ్‌డ్ కేటగిరీల్లో విజేతలకు మొత్తం రూ.1 లక్ష నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , రాష్ట్ర ఐటీ మంత్రి దుదెల శ్రీధర్ బాబు , సినీ నటుడు శర్వానంద్ హాజరయ్యారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ,వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు కలిసి జెండా ఊపి 2కే, 5కే రన్‌ను ప్రారంభించారు. 

తెలంగాణ  గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఈ పరుగును జెండా ఊపి ప్రారంభించి, యువతకు దిశానిర్దేశం చేశారు. వేల సంఖ్యలో విద్యార్థులు, పాల్గొన్న ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువత ఆరోగ్యకరమైన అలవాట్లపైనే ఆధారపడి ఉందన్నారు. కేవలం పరుగుగానే కాకుండా, ఇదొక శక్తివంతమైన ప్రజా ఉద్యమం అని ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి  పిలుపు మేరకు ప్రతి కుటుంబం క్రియాశీల జీవనశైలిని అలవర్చుకోవాలన్నారు. మాదకద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టి, ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం అవసరమని పేర్కొన్నారు.

యువతలో విదేశీ అలవాట్లు పెరుగుతున్నాయని, అందరూ తమ మాతృభాషలో మాట్లాడాలని కోరారు. తల్లిదండ్రులతో సమయం గడపడం, ఉదయం త్వరగా లేవడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి మంచి అలవాట్లు అలవరుచుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement