రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్య వారసత్వం యోగా అని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం నిర్వహించిన యోగా దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ కృషి ఫలితంగా ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించడంతో దేశాల సరిహద్దులు, భాష, సంస్కృతులను దాటి మానవాళిని ఏకం చేసే శక్తిగా యోగా నిలిచిందన్నారు. వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు మార్గం చూపిన భారతదేశపు సనాతన జ్ఞాన సంప్రదాయం యోగా అని అన్నారు.
ఆధునిక జీవితంలోని సవాళ్లు, ఒత్తిళ్లు, అసమతుల్యతల మధ్య యోగా ఆత్మ విశ్వాసం, క్రమశిక్షణ, సానుకూల శక్తిని ప్రసాదిస్తుందన్నారు. కాగా, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ యోగా మతానికి పరిమితం కాదని, అలా చూడటం మూర్ఖత్వమే అవుతుందని.. యోగా ప్రపంచానికి మనం ఇచ్చిన వరమని అన్నారు. భారత్ ప్రపంచానికి విశ్వగురువుగా నిలవడానికి మన సంస్కృతి, సంప్రదాయాలే కారణమని చెప్పారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో గత 7 సంవత్సరాలుగా అద్భుతంగా యోగా దినోత్సవాన్ని 24 కౌంట్‌డౌన్ పేరుతో నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు పెద్దఎత్తున పాల్గొనడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, పాయల్ శంకర్, కొమురయ్య, అంజిరెడ్డి, సినీనటులు నవీన్ పొలిశెట్టి, డింపుల్ హయతి, పాయల్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


