పోలీసుల అధీనంలో 2,193 వాహనాలు
ఆరు నెలల్లో క్లెయిమ్ చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: వివిధ కేసుల్లో జప్తు చేసిన, వివిధ ప్రాంతాల నుంచి స్వాధీనం చేసుకున్న 2,193 వాహనాలు ప్రస్తుతం పోలీసుల అధీనంలో ఉన్నాయని నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ గురువారం పేర్కొన్నారు. వీటిని బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించామని తెలిపారు. ఆయా వాహనాల వేలంపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా, లేదా వాహన యాజమాన్య హక్కులు, ఫైనాన్స్/హైపోథికేషన్ క్లెయిమ్‌లు ఉన్నవారు సంబంధిత ఆధారాలతో ఆరు నెలల్లోగా దరఖాస్తు చేసుకోవాలని కొత్వాల్ సూచించారు.
ఆ సమయంలోపు బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ భవనంలో ఉన్న సిటీ పోలీసు కమిషనరేట్‌లో దరఖాస్తు సమర్పించి తమ వాహనాలను క్లెయిమ్ చేసుకోవచ్చని తెలిపారు. వేలానికి సిద్ధంగా ఉన్న వాహనాల పూర్తి వివరాలు అంబర్‌పేట్ పోలీసు ఆసుపత్రి వెనుక ఉన్న ఎస్‌ఏఆర్ సీపీఎల్ పోలీసు గ్రౌండ్స్‌లోని ‘ఆక్షన్ టీమ్’ వద్ద అందుబాటులో ఉన్నాయి. సిటీ పోలీసు అధికారిక వెబ్‌సైట్ (www.hyderabadpolice.gov.in) ద్వారానూ ఈ వాహనాల వివరాలను పరిశీలించవచ్చని సీపీ ఒక ప్రకటనలో తెలిపారు.


