పుష్కర తెలంగాణ రాష్ట్రం జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం లాంటి ఆర్థికాభివృద్ధి సూచికలలో దూసుకుపోతోంది. దేశంలో పారిశ్రామికంగా బలమైన మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు లాంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి 5,407 డాలర్ల తలసరి జి.ఎన్.ఐ.తో తెలంగాణ ఎగువ మధ్య స్థాయి ఆదాయ రాష్ట్రంగా (యు.ఎం.ఐ.ఎస్.) ఢిల్లీ, కర్ణాటక తరువాత మూడవ రాష్ట్రంగా ఆవిర్భవించిందని ప్రపంచ బ్యాంక్ తన ‘కంట్రీ ఇన్‌కమ్ క్లాసిఫికేషన్ – 2026’ నివేదికలో వెల్లడించింది. ఇది రాష్ట్రానికి దక్కిన గౌరవంగానే చూడాలి. కానీ దీన్ని రాష్ట్ర అభివృద్ధికి గీటురాయిగా చెప్పలేం. రాష్ట్రంలో ఆదాయం సమకూరే మార్గాలు, ఆదాయ పంపిణీ తీరు రాష్ట్ర వాస్తవిక అభి
వృద్ధికి అద్దం పట్టడం లేదు.
తెలంగాణలో జిల్లాల మధ్య తీవ్ర అంతరాలు ఉన్నట్లుగా ‘తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్ సర్వే – 2026’ గుర్తించింది. రాష్ట్ర ఆదాయంలో 51 శాతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి లాంటి జిల్లాల నుండి వస్తుంటే... మిగతా 49 శాతం ఆదాయం 29 జిల్లాల నుండి వస్తోంది. రాష్ట్ర ఆదాయ పంపిణీ తీరులో కూడా తీవ్ర అసమానతలు కనిపిస్తున్నాయి.
ఐటీ, ఫార్మా రంగాలు; రియల్ ఎస్టేట్, గ్లోబల్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ నుండి రాష్ట్రానికి ఆదాయం సమకూరటం వలన రాష్ట్ర సంపద కొద్ది మంది వ్యక్తుల చేతిలో కేంద్రీకృతం అయ్యింది. తలసరి జి.ఎన్.ఐ. ఎక్కువగా కనపడుతున్నా అభివృద్ధి ఫలాలు, పెరిగిన ఆదాయం కింది వర్గాలకు చేరడంలేదు. కాబట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, గ్రామీణ వృత్తుల బలోపేతం ద్వారా గ్రామీణ ప్రజల ఆదాయాలను పెంచాలి. అంతే కాక ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలు పరచడం, గ్రామీణ అవస్థాపన నిర్మాణాన్ని చేపట్టడం వంటి చర్యలు చేపట్టాలి. అలాగే విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వ పెట్టుబడులు పెరిగినప్పుడే కింది వర్గాల ఆదాయాలు, కొనుగోలు శక్తి కూడా పెరిగి ఆర్థిక అంతరాలు తగ్గుతాయి.
రాష్ట్రంలో 1.14 కోట్ల కుటుంబాలు ఉంటే 89 లక్షలకు పైగా కుటుంబాలు పేదరికంలో ఉన్నాయని ప్రభుత్వ సామాజిక, ఆర్థిక సర్వేలు తేటతెల్లం చేస్తు న్నాయి. తెలంగాణ పేదలు ఉన్న సంపన్న రాష్ట్రంగా తెలంగాణ కనిపిస్తుంటే రాష్ట్ర ఏర్పాటుకు చేసిన త్యాగాలకూ, ఉద్యమాలకూ అర్థం ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సంపద పెరగడమే కాదు, ఆ సంపద కింది వర్గా లకు చేరడమే నిజమైన అభివృద్ధికి గీటురాయి.
– డా. తిరునహరి శేషు, అర్థశాస్త్ర ఉపన్యాసకులు, కేయూ


