స్పూర్తి
కతోలికులు మరియ మాత ముందు కూర్చొని, మూడు దేవరహస్యాలతో 15 ఘట్టాలతో కూడుకొన్న జపదండ చెబుతారు. క్రీస్తు ప్రభు గురించి, తండ్రి దేవునికి సంబంధించి, ఆత్మ దేవునికి సంబంధించిన రహస్యాలే అవి. ఆ యా ఘట్టాలన్నీ కొత్త నిబంధనా సంఘటనలే. దేవునికీ తమకూ మధ్యవర్తిగా ఆమెను నిలబెట్టి, ఆ ప్రభునికి ‘మా బాధలూ గాథలూ చేరవేయవమ్మా మా మరియమ్మా’ అని వేడుకొంటారు. పూజ వేరు, విన్నపం వేరు.
బైబిల్లో ఆమెకు ఎదురైన చిన్న సంఘటనల్లోని మాటల్నే జపంగా మార్చుకొని పదే పదే ఉచ్ఛరించడం వల్ల ఆమె కేవేవో పూజలు జరుగుతున్నాయనుకోకూడదు. ఈ విషయమై ఇటీవల విశ్వ కాపరి, పోప్ లియో ప్రత్యేకమైన సందేశం ఇచ్చిన సంగతి మరువగూడదు. శిలువపై మరణించబోతున్న యేసు ప్రభువు, తన తల్లి బాధ్యత ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. మరియ మాత ఓ చిన్న ఇంట్లో నివసించేది. ఆమె ప్రతిరోజూ దేవుణ్ణి ప్రార్థించేది. అందరినీ ప్రేమతో చూసుకునేది. తన చుట్టూ ఉన్నవారిని ఆశీర్వదించేది. పేదలకు సహాయం చేసేది. యేసు చెప్పిన మాటలను ప్రజలకు గుర్తు చేసేది.
ఓ రోజు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, ‘మరియమ్మా! దేవుడు నిన్ను తన దగ్గరకు పిలుస్తున్నాడు’ అని చెప్పాడు. కొంతకాలానికి ఆమె భూలోక జీవితాన్ని ముగించింది. యేసు శిష్యులు ఆమెను ఎంతో గౌరవంగా సమాధి చేశారు. కొన్ని రోజుల తర్వాత వారు సమాధి దగ్గరకు వెళ్లి చూడగా, అక్కడ మరియ మాత శరీరం కనిపించలేదు. దేవుడు ఆమెను శరీరంతో సహా పరలోకానికి తీసుకువెళ్లాడని వారు విశ్వసించారు. ఆమెకు తిన్నగా మోక్షాన్ని ఆరోపించారు. ఇది ‘మోక్షారోపణ’. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మరియ మాత మోక్షారోపణ పండుగ జరుపుకొంటారు. అమె ఎంతో ధన్యురాలని పిలుస్తారు. (లూకా 1:48)
– డా. దేవదాసు బెర్నార్డ్ రాజు (ఆగస్టు 15న మరియా మోక్షారోపణ పండుగ)


