శ్రావణంలో ఇవి చేస్తే శుభఫలితాలు! | Shravanamasam Pujalu Vratalu Pandugalu Visishtatha | Sakshi
Sakshi News home page

శ్రావణంలో ఇవి చేస్తే శుభఫలితాలు!

Aug 13 2026 8:33 AM | Updated on Aug 13 2026 9:00 AM

Shravanamasam Pujalu Vratalu Pandugalu Visishtatha

సన్నిధి

మామూలు సమయాలలో ఎలా ఉన్నా శ్రావణమాసం రాగానే ఇంచుమించు ప్రతి భక్తుడి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెలరోజుల పాటు ఉదయం, సాయంత్రం ధూపదీప నైవేద్యాలతో, చందన సుగంధాలతో, చిరుగంటల సవ్వడితో... కర్పూర నీరాజనపు పరిమళాలతో... కాళ్లకు పసుపు, నొసట కుంకుమ ధరించిన ముత్తైదువల పట్టుచీరల రెపరెపలతో వీధులన్నింటా ఒక పవిత్రమైన వాతావరణం నెలకొంటుంది. అంత గొప్ప శుభమాసం నేడే ప్రారంభమైంది. ఇక ఈ మాసమంతా ఎన్నో పండుగలు, పర్వదినాలు, వివాహాది శుభముహూర్తాలతో సందడి చేయనుంది.

సనాతన ధర్మంలో (హిందూ) చాంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది, ఎంతో పవిత్రత కలిగినటువంటిది శ్రావణమాసం. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది.

త్రిమూర్తుల్లో స్థితికారుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసంగా శ్రావణమాసానికి పేరు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు విశిష్ట ఫలం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.

శివారాధనకు ఎంతో విశిష్టత
శ్రావణమాసం శివపూజకు విశిష్టమైనది. ముఖ్యంగా సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్ర వచనం.
సోమవారాల్లో శివుడి ప్రీత్యర్థం ఈ వ్రతాన్ని చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగినవారు పూర్తిగా, అలా సాధ్యం కాని పక్షంలో రాత్రిపూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు. వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ ఒక్కోరోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేద శాస్త్రలు చెబుతున్నాయి. ఈ మాసంలో  ఆచరించే ప్రతి పూజకు తగిన ఫలం ఉంటుందని శాస్త్రోక్తి.

మంగళ గౌరీ వ్రతం
శ్రావణ మాసం లో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళగౌరీ నోము అనీ పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీ కృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని ప్రతీతి..

వరలక్ష్మీ వ్రతం
శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ దేహిమే రమే అని పఠిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి. అలాగే ముత్తయిదువులకు వాయనాలు ఇచ్చి ఆశ్వీరాదాలు తీసుకోవాలి.

విశిష్టతలు
శుక్ల ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుందని ప్రతీతి.

శుక్ల పక్ష పౌర్ణమి
రాఖీ పౌర్ణమిగా జరుపుకునే శ్రావణ పున్నమి రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షాబంధన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంతే కాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవిత్రధారణ చేస్తారు. వేదాభ్యాసాన్ని ప్రారంభిస్తారు.

ఇక ఆ తర్వాత వచ్చే కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విదియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య పర్వాలు కూడా శ్రావణమాసంలోనే వస్తాయి. కృష్ణాష్టమి, ΄÷లాల అమావాస్య, గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావడం ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు,  పూజలు, వ్రతాలు, నియమాలను ఆచరిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని శాస్త్రోక్తి.
– పూర్ణిమాస్వాతి

నిర్వహణ: డి.వి.ఆర్‌. భాస్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement