రష్యాకు మైండ్‌బ్లాక్.. మెగా అటాక్‌తో ఉక్కిరిబిక్కిరి | Russian grain export terminals hit By Ukraine Army At Black Sea | Sakshi
Sakshi News home page

రష్యాకు మైండ్‌బ్లాక్.. మెగా అటాక్‌తో ఉక్కిరిబిక్కిరి

Aug 13 2026 7:43 AM | Updated on Aug 13 2026 7:43 AM

Russian grain export terminals hit By Ukraine Army At Black Sea

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో నల్ల సముద్రం మరోసారి అగ్నిగుండంగా మారింది. రష్యాకు అత్యంత కీలకమైన నోవొరోసిస్క్ నౌకాశ్రయంపై ఉక్రెయిన్ భారీ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. రష్యా నల్ల సముద్ర నౌకాదళానికి ప్రధాన స్థావరంగా ఉన్న ఈ పోర్టుపై జరిగిన దాడిలో నాలుగు రష్యా యుద్ధనౌకలు దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. వాటిలో రెండు ఫ్రిగేట్లు ఉన్నాయని తెలిపింది. అయితే ఈ నష్టంపై రష్యా నుంచి ఇప్పటివరకు పూర్తి స్థాయి అధికారిక ధృవీకరణ రాలేదు.

ఈ దాడి సైనిక లక్ష్యాలకే పరిమితం కాలేదు. నోవొరోసిస్క్‌లోని రెండు ప్రధాన ధాన్యం ఎగుమతి టెర్మినల్స్ కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. దీంతో రష్యా ధాన్యం ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. నల్ల సముద్రం ద్వారా ప్రపంచ మార్కెట్లకు రష్యా భారీగా గోధుమలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. ఇప్పటికే దాడి కారణంగా సరకు రవాణాను బాల్టిక్, కాస్పియన్ సముద్ర నౌకాశ్రయాలతో పాటు భూ మార్గాలకు మళ్లించే అవకాశాలను రష్యా పరిశీలిస్తున్నట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది.

నోవొరోసిస్క్ రష్యాకు సాధారణ వాణిజ్య నౌకాశ్రయం కాదు. క్రిమియాలోని సెవాస్టోపోల్‌పై ఉక్రెయిన్ దాడుల ముప్పు పెరగడంతో రష్యా తన నల్ల సముద్ర నౌకాదళంలోని పెద్ద భాగాన్ని నోవొరోసిస్క్‌కు తరలించింది. అందువల్ల అక్కడి నౌకాదళ స్థావరంపై దాడి చేయగలిగామని ఉక్రెయిన్ ప్రకటించడం రష్యాకు వ్యూహాత్మకంగా పెద్ద సవాలుగా మారింది. సెవాస్టోపోల్‌ను వదిలి సురక్షిత ప్రాంతంగా భావించిన నోవొరోసిస్క్ కూడా పూర్తిగా సురక్షితం కాదన్న సందేశాన్ని ఈ దాడి ఇచ్చినట్లయింది.

‘ప్రత్యేకమైన ఆపరేషన్’..
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీ ఈ దాడిని ‘ప్రత్యేకమైన ఆపరేషన్’గా అభివర్ణించారు. రాకెట్లు, వైమానిక డ్రోన్లు, నౌకాదళ డ్రోన్లను కలిపి ఉపయోగించి రష్యా నౌకాదళ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. రష్యా దూకుడు కొనసాగుతున్నంతకాలం ఆ దేశ నౌకాదళం, దానికి మద్దతు ఇచ్చే మౌలిక వసతులు సురక్షితంగా ఉండబోవని హెచ్చరించారు. రాత్రంతా నోవొరోసిస్క్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానిక నివేదికలు తెలిపాయి. రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు పలు లక్ష్యాలను కూల్చివేసినట్లు అధికారులు ప్రకటించారు. అయినప్పటికీ డ్రోన్ల దాడి పోర్టు చుట్టుపక్కల ప్రాంతాలను తాకింది. పైప్‌లైన్లు దెబ్బతినడంతో నగరంలో నీటి సరఫరా నిలిచిపోయింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా నోవొరోసిస్క్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

ఈ దాడి రష్యాకు సైనికంగానే కాకుండా ఆర్థికంగానూ ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద గోధుమ ఎగుమతిదారు. నల్ల సముద్రంలోని నౌకాశ్రయాలు ఆ ఎగుమతులకు అత్యంత కీలకం. రెండు ప్రధాన ధాన్యం టెర్మినల్స్ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల ఎగుమతులపై తక్షణ లాజిస్టికల్ ఒత్తిడి ఏర్పడింది. రష్యా తన సరకు రవాణాను ఇతర సముద్ర మార్గాలకు మళ్లించాల్సి వస్తే రవాణా సమయం, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం రష్యా వరకే పరిమితం కాకపోవచ్చు. రష్యా, ఉక్రెయిన్ రెండూ ప్రపంచ ధాన్యం వాణిజ్యంలో కీలక దేశాలు. ముఖ్యంగా ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఆసియాలోని అనేక దేశాలు నల్ల సముద్రం నుంచి వచ్చే ధాన్యంపై ఆధారపడుతున్నాయి. యుద్ధం కారణంగా సరఫరా మార్గాల్లో అంతరాయం పెరిగితే ప్రపంచ ఆహార ధరలపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement