13 మంది మృతి, 48 మందికి గాయాలు
కీవ్: ఉక్రెయిన్ తన లాంగ్‌రేంజ్ డ్రోన్‌ల సత్తాను మరోసారి రష్యాకు రుచి చూపింది. ఆదివారం రాత్రి రష్యాలోని టాటార్‌స్తాన్ ప్రాంతంలోని నిజ్నెకామ్‌స్క్ నగరంపై పాల్పడిన డ్రోన్‌లో 13 మంది ప్రాణాలు కోల్పోగా, 48 మంది గాయాలపాలయ్యారు. సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఈ దాడి ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. అయితే, రష్యా చమురు ప్లాంట్లను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించుకుంది.
ఉక్రెయిన్ సరిహద్దుకు 1,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజ్నెకామ్‌స్క్ నగర జనాభా 2.40 లక్షలు.నగరంలో రెండు అత్యాధునిక, అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలతోపాటు ఒక పెట్రో కెమికల్ ప్లాంటు ఉన్నాయి. ఉక్రెయిన్ తరచుగా రష్యా ఇంధన మౌలిక వనరులే లక్ష్యంగా దాదాపు ప్రతి రోజూ దాడులకు పాల్పడుతుండటం తెల్సిందే. రష్యాలో చమురు శుద్ధి కర్మాగారాలు దెబ్బతినడంతో ఇంధన కొరత తలెత్తింది. ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
నాలుగేళ్ల యుద్ధానికి ముగింపు పలుకుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను చర్చలకు దిగేలా చేయడమే తమ దాడుల లక్ష్యమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంటున్నారు. ‘రష్యా పాల్పడిన ప్రతి దాడికీ ధీటుగా మేం బదులిస్తాం. యుద్ధం ప్రభావం రష్యన్లకు కూడా తెలిసేలా చేస్తాం’అని ఆయన వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ దేశీయంగా అభివృద్ధి చేసుకున్న లాంగ్ రేంజ్ డ్రోన్లతో రష్యాలోని సుదూర ప్రాంతాలపైనా దాడులకు పాల్పడుతోంది.
సరిహద్దు నుంచి సుమారు 2 వేల కిలోమీటర్ల దూరంలో గల సైబీరియా ప్రాంతంపైనా ఇటీవల దాడి చేసింది. కాగా, ఉక్రెయిన్‌కు గగనతల రక్షణ వ్యవస్థల కొరత తీవ్రంగా ఉందని తెలిసిన రష్యా నిత్యం శక్తివంతమైన గ్లైడ్ బాంబులు, రకరకాల క్షిపణులు, డ్రోన్లతో పౌర ఆవాసాలపై దాడులు చేస్తోంది. ఉక్రెయిన్‌లోని నీప్రో ప్రాంతంలో ఉన్న తమ రెండు గోదాములపై రష్యా 24 గంటల వ్యవధిలో రెండుసార్లు దాడులకు పాల్పడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం వెల్లడించింది.
ఈ దాడుల్లో యుద్ధ క్షేత్రంలోని వారికి ఉద్దేశించిన 5 లక్షల డాలర్ల విలువైన అత్యవసర సాగ్రి ధ్వంసమైందని తెలిపింది. ప్రాణనష్టం మాత్రం సంభవించలేదంది. కాగా, ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వివిధ ప్రాంతాలపైకి ఉక్రెయిన్ ప్రయోగించిన 450కిపైగా డ్రోన్లను మధ్యలోనే కూల్చినట్లు రష్యా తెలిపింది. ఇలా ఉండగా, రష్యాలోని సరిహద్దు బెల్గొరోడ్ ప్రాంతంపై ఉక్రెయిన్ గత 24 గంటల్లో జరిపిన దాడుల్లో మరో నలుగురు చనిపోయారని అధికారులు తెలిపారు.


