ఇరాన్‌కు ట్రంప్‌ బిగ్‌ షాక్‌.. ఇక పరిహారం కూడా చెల్లించాల్సిందే! | Iran Sought War Damages From the US : Trump Demands Compensation From Iran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌కు ట్రంప్‌ బిగ్‌ షాక్‌.. ఇక పరిహారం కూడా చెల్లించాల్సిందే!

Aug 11 2026 2:07 AM | Updated on Aug 11 2026 2:07 AM

Iran Sought War Damages From the US : Trump Demands Compensation From Iran

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఇరాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. భవిష్యత్‌లో జరిగే శాంతి చర్చల్లో భాగంగా.. దశాబ్దాలుగా ఇరాన్‌ మద్దతుతో జరిగిన దాడులు, ఘర్షణల్లో అమెరికన్లకు జరిగిన నష్టానికి ఇరాన్‌ నుంచి నష్టపరిహారం కోరాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ట్రూత్‌ సోషల్‌లో ఆయన ఓ పోస్ట్‌ చేశారు.

గత ఐదు నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇరాన్‌కు జరిగిన నష్టానికి ఆ దేశం పరిహారం కోరుతున్న విషయాన్ని ప్రస్తావించిన ట్రంప్‌.. అదే తరహాలో అమెరికా కూడా ఇరాన్‌ నుంచి పరిహారం కోరడం ‘ఆసక్తికరమైన ఆలోచన’ అని పేర్కొన్నారు. ఇరాన్‌ కోరుతున్న నష్టపరిహారం అంశం అమెరికాతో జరిగిన చర్చల్లో ఇప్పటివరకు ప్రస్తావనకు రాలేదని ఆయన అన్నారు.

దశాబ్దాల నాటి ఘటనల ప్రస్తావన
తన నష్టపరిహారం డిమాండ్‌కు మద్దతుగా గతంలో జరిగిన పలు ఘటనలను ట్రంప్‌ ప్రస్తావించారు. ఇరాన్‌ మద్దతుతో జరిగిన రోడ్డు పక్క బాంబు దాడులు, ఇతర ఘర్షణల్లో అమెరికా సైనికులు మరణించడం, తీవ్రంగా గాయపడటాన్ని ఆయన ప్రస్తావించారు. ఇరాన్‌ మాజీ సైనిక కమాండర్‌ ఖాసిమ్‌ సొలైమానీ పేరు కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.

2000 అక్టోబర్‌లో యెమెన్‌లోని ఓడరేవులో అమెరికా నావికాదళానికి చెందిన యూఎస్‌ఎస్‌ కోల్‌పై జరిగిన బాంబు దాడిని కూడా ట్రంప్‌ ఉదహరించారు. ఆ ఘటనలో 17 మంది అమెరికా నావికులు మరణించగా.. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ దాడికి అల్‌ఖైదానే కారణమని ఎఫ్‌బీఐ గతంలో పేర్కొంది.

నిరసనకారుల కుటుంబాలకూ పరిహారం?
గత ఐదు దశాబ్దాల్లో ఇరాన్‌లో జరిగిన ప్రజా ఉద్యమాలు, నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా పరిహారం అందించాలని ట్రంప్‌ పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత ఐదు నెలల యుద్ధంలో మరణించినట్లు తాను పేర్కొన్న సుమారు 52 వేల మందికి సంబంధించిన నష్టపరిహారం అంశాన్ని కూడా చర్చల్లో చేర్చాలని తన ప్రతినిధులకు సూచించినట్లు తెలిపారు.

హర్మూజ్‌పై ఇరాన్‌ కీలక డిమాండ్‌
మరోవైపు హర్మూజ్‌  జలసంధి విషయంలో ఇరాన్‌ తన వైఖరిని స్పష్టం చేసింది. అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు.. యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లించి, ఆర్థిక ఆంక్షలను తొలగించి, స్తంభింపజేసిన ఇరాన్‌ ఆస్తులను విడుదల చేసే వరకు హర్మూజ్‌  జలసంధిని తిరిగి తెరవబోమని ఇరాన్‌ చెబుతోంది.

ప్రాంతీయ వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దని ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌  కూడా డిమాండ్‌ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌-అమెరికా మధ్య భవిష్యత్‌ శాంతి చర్చలు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement