ఇరాన్‌ను లొంగదీసుకునేందుకు మరో మాస్టర్‌ప్లాన్‌! | No War Just Strategy: Trumps Master Plan for Iran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ను లొంగదీసుకునేందుకు మరో మాస్టర్‌ప్లాన్‌!

Aug 10 2026 6:45 AM | Updated on Aug 10 2026 6:45 AM

No War Just Strategy: Trumps Master Plan for Iran

అమెరికా–ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైఖరి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు ఇరాన్‌పై తీవ్ర హెచ్చరికలు చేస్తూ.. మరోవైపు చర్చలకు తలుపులు తెరిచి ఉంచుతున్న ఆయన తీరు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. “ఇది యుద్ధం కాదు.. చెస్‌ గేమ్‌ లాంటిది” అంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆయన వ్యూహానికి అద్దం పడుతున్నాయి. 

సైనిక చర్యల కంటే ముందుగా ఆర్థిక ఒత్తిడి, ఆంక్షలు, దౌత్యపరమైన ఎత్తుగడలతో ఇరాన్‌ను చర్చల బాట పట్టించాలన్నది అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది. ఇరాన్‌తో అమెరికా ప్రస్తుతం “పాక్షిక చర్చలు మాత్రమే” జరుపుతోందని ట్రంప్‌ తాజాగా స్పష్టం చేశారు. “ఇరాన్‌లో భారీ ద్రవ్యోల్బణం ఉంది. వారి వద్ద డబ్బు లేదు. మేం పరిస్థితిని గమనిస్తున్నాం” అని ట్రంప్‌ పేర్కొన్నట్లు అమెరికా మీడియా సంస్థ ఆక్సియోస్‌ తెలిపింది.

వెంటనే మరో సైనిక చర్యకు దిగకుండా.. ఇరాన్‌ ఆర్థిక పరిస్థితిని మరింత ఒత్తిడికి గురిచేసే విధానాన్ని అనుసరిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

ఇటీవల ఇరాన్‌పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ట్రంప్‌.. ఇప్పుడు మాట మార్చడం వెనుక వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం వల్ల అమెరికాపై పడే ఆర్థిక, రాజకీయ ప్రభావాలను అంచనా వేసుకుంటూనే.. ఒత్తిడి ద్వారా ఫలితం సాధించాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఓసారి దాడుల మాట.. మరోసారి చర్చల బాట!
ట్రంప్‌ విదేశాంగ విధానంలో ఈ మార్పు కొత్తది కాదు. ప్రత్యర్థి దేశాలపై గరిష్ఠ ఒత్తిడి తీసుకురావడం.. ఆ తర్వాత చర్చలకు మార్గం సుగమం చేయడం ఆయన శైలిలో కనిపించే అంశం. ఇరాన్‌ విషయంలోనూ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు సైనిక శక్తిని ప్రదర్శిస్తూ హెచ్చరికలు చేయడం.. మరోవైపు చర్చలకు అవకాశం ఉందని చెప్పడం ద్వారా టెహ్రాన్‌పై మానసిక ఒత్తిడి పెంచే ప్రయత్నం జరుగుతోందని అంచనాలు ఉన్నాయి.

“ఇది చెస్‌ ఆట లాంటిది. చివరకు అంతా సర్దుకుంటుంది” అని ట్రంప్‌ చెప్పడం కూడా ఈ వ్యూహాన్నే సూచిస్తోంది. చమురు ధరలు తగ్గుతున్నాయని, దీంతో యుద్ధ ప్రభావం అమెరికా ప్రజలపై పెద్దగా పడటం లేదని ఆయన పేర్కొన్నారు.

మారిన సమీకరణాలు
అమెరికా–ఇరాన్‌ వివాదం కొత్తది కాదు. ఇరాన్‌ అణు కార్యక్రమం చుట్టూ మొదలైన వివాదం.. ఆంక్షలు, చమురు ఎగుమతులు, ప్రాంతీయ ఆధిపత్య పోరు వరకు విస్తరించింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ప్రధాన పట్టు హర్ముజ్‌ జలసంధిపై ఉంది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ మార్గం ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది.

హర్ముజ్‌ను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలంటే అమెరికా ముందుగా నౌకాదళ ఆంక్షలు, చమురు ఆంక్షలను తొలగించాలని ఇరాన్‌ డిమాండ్‌ చేస్తోంది.

అయితే ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ మాట్లాడుతూ.. అమెరికాతో నేరుగా చర్చలు జరగడం లేదని, కానీ మధ్యవర్తుల ద్వారా చర్చలకు అనుకూల వాతావరణం కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

అదసలు సాధ్యమేనా?
ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి అమెరికాకు కొత్త వ్యూహం కాదు. దశాబ్దాలుగా అమలు చేస్తున్న ఆంక్షల కారణంగా ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. చమురు ఎగుమతులు, విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థపై ఆంక్షలు ఆ దేశ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేశాయి. అయితే ఇరాన్‌ను పూర్తిగా లొంగదీయడం మాత్రం అంత సులభం కాలేదు. ఆంక్షల మధ్య కూడా చైనా వంటి దేశాలకు చమురు విక్రయించడం, ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు అనుసరించడం ద్వారా టెహ్రాన్‌ కొంతవరకు నష్టాన్ని భర్తీ చేసుకుంటోంది.

అంటే.. ఆంక్షలు ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతున్నప్పటికీ, అవి ఇప్పటివరకు ఆ దేశాన్ని పూర్తిగా అమెరికా షరతులకు తలొగ్గే స్థాయికి తీసుకురాలేదని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు ట్రంప్‌ ఆర్థిక ఒత్తిడితో పాటు దౌత్యపరమైన ఒత్తిడిని కూడా కలిపి ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తోంది.

ట్రంప్‌కు నెతన్యాహూ షాక్‌
ఇదిలా ఉండగా.. గాజా అంశంలో అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. హమాస్‌ పూర్తిగా ఆయుధాలు పక్కన పెట్టేంత వరకు గాజా నుంచి ఇజ్రాయెల్‌ బలగాల ఉపసంహరణ ఉండదని నెతన్యాహూ స్పష్టం చేశారు. ఈ అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. తన దేశ ప్రజల ముందు తాను కఠిన వైఖరినే కొనసాగిస్తున్నానని చూపించుకోవాల్సిన రాజకీయ ఒత్తిడి కూడా ఆయనపై ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

హౌతీల దాడులతో మరింత ఉద్రిక్తత
మరోవైపు యెమెన్‌లో ఇరాన్‌ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలోని అల్‌-మఖా పోర్టుపై దాడి చేశారు. ఈ ఘటనలో కనీసం ఏడుగురు మరణించినట్లు సమాచారం. హౌతీల చర్యలు, హార్ముజ్‌ వివాదం, గాజా యుద్ధ పరిణామాలు కలిసి మధ్యప్రాచ్య పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి.

ట్రంప్‌ వ్యూహం ఫలిస్తుందా?
ఇరాన్‌తో ఘర్షణను పూర్తిస్థాయి యుద్ధంగా మార్చకుండా.. ఆర్థిక ఒత్తిడి, చర్చలు, వ్యూహాత్మక బెదిరింపులతో తన లక్ష్యాలను సాధించాలని ట్రంప్‌ ప్రయత్నిస్తున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అయితే ఇరాన్‌ కూడా వెనక్కి తగ్గే పరిస్థితిలో లేదు. అణు కార్యక్రమం, చమురు ఆంక్షలు, హార్ముజ్‌ జలసంధి వంటి అంశాలపై రెండు దేశాల మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ట్రంప్‌ ఆడుతున్న ఈ ‘చెస్‌ గేమ్‌’లో ఇరాన్‌ చివరకు ఏ ఎత్తు వేస్తుంది? లేదంటే ఈ వ్యూహం మరోసారి పశ్చిమాసియా యుద్ధం అంచులకు తీసుకెళ్తుందా?.. రాబోయే రోజుల్లోనే తెలిసేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement