కిమ్‌ వింత సలహా!.. ఏంటో తెలుసా? | Kim Bizarre Heatwave Advice: Koreans Urged to Drink Dog Meat Soup | Sakshi
Sakshi News home page

కిమ్‌ వింత సలహా!.. ఏంటో తెలుసా?

Aug 8 2026 2:00 PM | Updated on Aug 8 2026 2:05 PM

Kim Bizarre Heatwave Advice: Koreans Urged to Drink Dog Meat Soup

ఉత్తర కొరియాలో మండుతున్న ఎండలు ఇప్పుడు మరో ఆసక్తికర చర్చకు దారితీశాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ.. ప్రజలు వేడిని తట్టుకునేందుకు ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఓ వింత సలహా ఇచ్చారు!. ఆయన సూచన మేరకు.. ప్రజలంతా కుక్క మాంసం సూప్‌ తినాలని అక్కడి ప్రభుత్వ మీడియా సూచిస్తోంది. అంతేకాదు దీనిని సంప్రదాయ ఆరోగ్య ఆహారంగా అభివర్ణిస్తూ ప్రచారం చేస్తోంది.

ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో ఇటీవల ఉష్ణోగ్రతలు 36.7 డిగ్రీల సెల్సియస్‌ (98.1 ఫారెన్‌హీట్‌)కు చేరుకున్నాయి. దీంతో వేసవి వేడిని ఎదుర్కొనే ఆహారాలపై అధికార పార్టీ పత్రిక రోడాంగ్‌ సిన్మున్‌ ప్రత్యేక కథనాలు ప్రచురించింది. పుచ్చకాయ, దోసకాయలు, చేపల గంజి, పెసరపప్పు వంటి చల్లదనాన్ని ఇచ్చే ఆహారాలతో పాటు.. డాంగోగి (కుక్క మాంసం) సూప్‌ను కూడా "పోషకాహారం"గా పేర్కొంది.

‘వేడి వేడితోనే పోతుంది’.. పాత నమ్మకం
కొరియన్‌ సంస్కృతిలో కొన్ని ప్రాంతాల్లో కుక్క మాంసాన్ని గతంలో నుంచి బలాన్నిచ్చే ఆహారంగా భావించే సంప్రదాయం ఉంది. ముఖ్యంగా వేసవిలో అత్యంత వేడి రోజులుగా భావించే సాంబోక్‌ (Dog Days of Summer) సమయంలో దీనిని తినే ఆచారం ఉందని చెబుతారు. "వేడిని వేడితోనే జయించాలి" అనే నమ్మకంతో కుక్క మాంసం సూప్‌ శరీరానికి శక్తినిస్తుందని కొందరు విశ్వసిస్తారు.

అసలు శాస్త్రీయ నిజం ఏమిటి?
కుక్క మాంసం తింటే శరీరంలోని వేడి తగ్గుతుందని లేదంటే ఎండ వేడిని ప్రత్యేకంగా తట్టుకునే శక్తి వస్తుందని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే ఇతర మాంసాహారాల మాదిరిగానే ఇందులో ప్రోటీన్‌, కొవ్వు, కొన్ని పోషకాలు ఉండవచ్చు. అవి శరీరానికి శక్తిని అందించవచ్చు. కానీ తీవ్రమైన ఎండలో శరీరాన్ని చల్లబరచడానికి ప్రధానంగా అవసరమయ్యేవి మాత్రం తగినంత నీరు తాగడం, ఎలక్ట్రోలైట్లు సమతుల్యంగా ఉంచుకోవడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం అని వైద్య నిపుణులు చెబుతారు. వేసవిలో అధిక కొవ్వు, బరువైన ఆహారాలు కొందరిలో జీర్ణ సమస్యలు కూడా కలిగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

సంప్రదాయమా? ప్రచారమా?
కుక్క మాంసాన్ని వేసవి ఆహారంగా ప్రచారం చేయడం వెనుక కేవలం ఆరోగ్య నమ్మకం మాత్రమే కాకుండా.. ఉత్తర కొరియా ప్రభుత్వ ప్రచార కోణం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల సంప్రదాయాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం స్థానిక సంస్కృతిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. అదే సమయంలో కఠిన వాతావరణ పరిస్థితుల్లో ప్రజలకు "పరిష్కారాలు" చూపిస్తున్నామనే సందేశాన్ని కూడా ఇవ్వాలనుకుంటోంది.

కిమ్‌ ఇమేజ్‌కు మరో ప్రచారం
వేసవి వేడి నేపథ్యంలో ఉత్తర కొరియా మీడియా మరోవైపు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రజల కోసం కష్టపడే నాయకుడిగా చూపించే కథనాలను కూడా ప్రసారం చేస్తోంది. గతంలో తీవ్రమైన ఎండలు, వర్షాలను లెక్కచేయకుండా నిర్మాణ పనులను పరిశీలించారని, ప్రజల సంక్షేమం కోసం పనిచేశారని అధికారిక మీడియా పేర్కొంది. ఇప్పుడు ఆయన ఈ సలహా ఇచ్చారంటూ ప్రచారం చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా చర్చ
ఉత్తర కొరియా సూచన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఒకవైపు ఇది అక్కడి సంప్రదాయ ఆహార సంస్కృతిలో భాగమని కొందరు చెబుతుండగా.. మరోవైపు ఆధునిక వైద్య శాస్త్రం మాత్రం దీన్ని వేడిని తగ్గించే ప్రత్యేక పరిష్కారంగా గుర్తించడం లేదు. రికార్డు వేడి వేళ కిమ్‌ సర్కార్‌ ఇచ్చిన ఈ సలహా.. సంప్రదాయం, నమ్మకం, శాస్త్రం మధ్య చర్చకు తెరలేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement