బ్రాహ్మణులకు అఖిలేష్‌ గాలం.. తిప్పికొట్టిన బీజేపీ, బీఎస్పీ | Akhilesh Yadav's PDA Brahmin Pitch for 2027 UP Polls Draws BJP, BSP Fire | Sakshi
Sakshi News home page

బ్రాహ్మణులకు అఖిలేష్‌ గాలం.. తిప్పికొట్టిన బీజేపీ, బీఎస్పీ

Aug 8 2026 12:45 PM | Updated on Aug 8 2026 12:53 PM

Akhilesh Yadavs Brahmin outreach for 2027 UP polls faces backlash from BJP BSP

లక్నో: రాబోయే ఏడాది(2027)లో జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ చేపట్టిన ‘బ్రాహ్మణ ఓటు బ్యాంక్’ వ్యూహం రాజకీయ దుమారం రేపుతోంది. ఇటీవల జరిగిన ఒక సదస్సులో ఆయన తన ‘పీడీఏ’ ఫార్ములాలోని ‘పీ’అంటే 'పండితులు' (బ్రాహ్మణులు) అని పేర్కొనడంపై బీజేపీ, బీఎస్పీ తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. అఖిలేశ్ రాజకీయ ప్రయోజనాల కోసం  ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని ఆయా పార్టీల నేతలు  ఎద్దేవా చేశారు

ఈ వ్యాఖ్యలపై యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ స్పందిస్తూ, అఖిలేశ్ బ్రాహ్మణుల పట్ల నటిస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఒక జర్నలిస్టును కులం అడిగి, బ్రాహ్మణులను అవమానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘పవర్‌ కోసం ఒక కుటుంబానికి ప్రాధాన్యతనివ్వడం తప్ప, సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం ఎస్పీకి తెలియదు’ అని పాఠక్ విమర్శించారు. వ్యక్తిగత ఆరోపణలు, దూషణలతో ప్రజల నమ్మకాన్ని గెలవలేరని ఆయన వ్యాఖ్యానించారు.

ఇక బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి కూడా అఖిలేశ్ తీరును ఎండగట్టారు. సమాజ్‌వాదీ పార్టీ ఎప్పటికప్పుడు తన రంగులు మార్చుకుంటూ కుల రాజకీయాలు చేస్తోందని ఆమె ఆరోపించారు. ఎన్నికల స్వార్థం కోసం అఖిలేశ్ ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారని, ఇవి సమాజ శ్రేయస్సుకు పనికిరావని ఆమె పేర్కొన్నారు. కాగా జనేశ్వర్ మిశ్రా జయంతి సందర్భంగా లక్నోలో జరిగిన బ్రాహ్మణ సమ్మేళనంలో అఖిలేశ్ ప్రసంగిస్తూ, బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష కార్యకర్తలను, బ్రాహ్మణులను, శంకరాచార్యుల వంటి మత పెద్దలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. ‘బీజేపీ ఎన్ని నిర్వచనాలు చెప్పినా, పీడిఏలో ‘పీ’ అంటే పండితులు కూడా అని వారు గ్రహించాలన్నారు. గతంలో ‘పీడీఏ’అంటే పిచ్డే (వెనుకబడిన తరగతులు/OBC), దళిత్ (Dalits), అల్పసంఖ్యాకులు (మైనారిటీలు/Muslims) అని అఖిలేష్ యాదవ్ నిర్వచించారు. కాగా ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఈ బ్రాహ్మణ కార్డు రాజకీయాలు యూపీలో వేడిని మరింతగా పెంచుతున్నాయి.

ఇది కూడా చదవండి: గాల్లో దూసుకెళ్లే ఫ్లయింగ్ వెహికల్.. దిమ్మతిరిగే ఆవిష్కరణ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement