లక్నో: నాలుగు దశాబ్దాల పాటు ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్) ప్రాంతాన్ని తన నేరసామ్రాజ్యంతో గజగజలాడించిన మాఫియా డాన్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. అతీక్ అహ్మద్‌కు ఉన్న ఐదుగురు కుమారులలో అందరికంటే చిన్నవాడైన అబాన్ అహ్మద్ గురువారం ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అబాన్ అహ్మద్ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉదంతంలో అత్యంత షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మితిమీరిన వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, కారులో చిక్కుకున్న అబాన్ అహ్మద్ తన చివరి క్షణాల్లో ‘నన్ను కాపాడండి’ అంటూ ఆర్తనాదాలు చేశాడని ఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షి దీపక్ యాదవ్ వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షి దీపక్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో అబాన్ అహ్మద్ ప్రయాణిస్తున్న హ్యుందాయ్ క్రెటా కారు అత్యంత వేగంగా వెళ్తోంది. ఆ సమయంలో అకస్మాత్తుగా జాతీయ రహదారిపైకి ఒక దూడ అడ్డుగా వచ్చింది. దానిని తప్పించే క్రమంలో కారు డ్రైవర్ అకస్మాత్తుగా స్టీరింగ్‌ను తిప్పగా, అదే సమయంలో ఎదురుగా ఒక మోటార్ సైకిల్ కూడా వచ్చింది.
అంతటి వేగంలో కారును కంట్రోల్ చేయలేక, ఆ బైకును తప్పించే క్రమంలో కారు రోడ్డు డివైడర్‌ను అత్యంత బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతతో డివైడర్‌ను ఢీకొట్టిన కారు గాల్లోకి లేచి రోడ్డుపై పల్టీలు కొడుతూ కిందపడింది.
ప్రమాదం జరగడం చూడగానే నేను కారులో ఉన్న ప్రయాణికులను రక్షించేందుకు పరుగున వెళ్లాను. కారు డోర్లు తెరిచేందుకు ప్రయత్నించినా అవి పూర్తిగా లాక్ అయిపోయాయి. సాధ్యం కాకపోవడంతో వెంటనే సమీపంలో ఉన్న ఒక ఇనుప రాడ్డును తెచ్చి కారు డోర్లను బద్దలు కొట్టాను. అనంతరం పోలీసులకు సమాచారం అందించాను. డోర్లు తెరిచేసరికి కారు ముందు ప్యాసింజర్ సీట్లో రక్తపు మడుగులో పడి ఉన్న అబాన్ అహ్మద్ తీవ్ర నొప్పితో విలవిలలాడుతూ.. 'నన్ను కాపాడండి' అని వేడుకుని, ఆ వెంటనే స్పృహ కోల్పోయాడు అని దీపక్ యాదవ్ వివరించాడు. గాయపడిన ముగ్గురిని పూంచ్ పోలీసులు వెంటనే మోంథ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు.
రోడ్డు ప్రమాదంపై ఝాన్సీ ఎస్ఎస్పీ బీబీజీటీఎస్ మూర్తి మాట్లాడుతూ..ప్రమాదం జరిగే సమయంలో అబాన్ కారు గంటకు 120 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అంతేకాకుండా, ఆ సమయంలో కురిసిన తేలికపాటి వర్షం కారణంగా హైవే రోడ్డు తడిగా మారిందని, మితిమీరిన వేగం వల్లే బ్రేకులు వేసినా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని పోలీసులు స్పష్టం చేశారు.
అయితే, కారులో ఉండి ప్రాణాలతో బయటపడిన ఉమర్ అహ్మద్ అనే మరో యువకుడు మాత్రం.. రోడ్డుపై ఉన్న ఒక ఇటుకను కారు బలంగా ఢీకొట్టడం వల్లే వాహనం నియంత్రణ కోల్పోయిందని పోలీసులకు తెలిపాడు.


