తిరువనంతపురం : కేరళలోని కన్నూర్ జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరదల్లో రైతును కాపాడుతూ తిరువనంతపురానికి చెందిన 36 ఏళ్ల రెస్క్యూ వాలంటీర్ ఆర్.రాజేష్ వీరమరణం పొందారు. తాను కాపాడిన రైతు మునిగిపోతుండటం గమనించి, తన ఒంటిపై ఉన్న లైఫ్ జాకెట్‌ను తీసి అతనికి తొడిగి, తాను మాత్రం వరద ఉధృతికి ప్రాణాలు కోల్పోవడంపై కేరళ సీఎం వీడీ సతీషన్ విచారం వ్యక్తం చేశారు. ఈమేరకు రాజేష్ సహాసాన్ని గుర్తు చేసుకుంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్‌లో రాజేష్ నిస్వార్థ గుణం, ఆయన చూపిన అసాధారణ హీరోయిజం కేరళ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. సమాజం ఆయనను ఎప్పటికీ మరువదు’అని భావోద్వేగంతో పోస్టు చేశారు.
ఆగస్టు 1 కురిసిన భారీ వర్షాలకు కన్నూర్ జిల్లా చెరుపుళా పరిధిలోని కరియాంగోడ్ నది ఉప్పొంగింది. కొండచరియలు విరిగిపడ్డాయనే సమాచారంతో తన కాఫీ తోటను పరిశీలించేందుకు వెళ్లిన రైతు బెన్నీ (61) ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయారు. మీన్‌తుల్లి జలపాతం వద్ద రాపెల్లింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న రాజేష్, తన తోటి వాలంటీర్లు షిబిన్, జితిన్‌లతో కలిసి సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగారు. ఉధృతంగా ప్రవహిస్తున్న కరియాంగోడ్ నదిని ఈదుకుంటూ వెళ్లి రైతు బెన్నీని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.
తిరుగు ప్రయాణంలో నది ఒడ్డుకు చేరుకునే క్రమంలో వృద్ధుడైన బెన్నీ నీటిలో మునిగిపోతూ కొట్టుమిట్టాడుతుండటాన్ని రాజేష్ గమనించారు. ఏమాత్రం ఆలోచించకుండా తన ప్రాణాలకు రక్షణగా ఉన్న లైఫ్ జాకెట్‌ను విప్పి బెన్నీకి తగిలించారు. ఆ తర్వాత సేఫ్టీ రోప్ పట్టుకుని ఒడ్డుకు రావడానికి ప్రయత్నిస్తుండగా, నది ఒడ్డున పట్టు తప్పి రాజేష్ వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. రెండు రోజుల తర్వాత రాజేష్ మృతదేహం లభ్యమైంది.
విపత్తుల్లో ముందుండే హీరోరాజేష్ కేవలం ఈ ఒక్కసారే కాదు, కేరళను ముంచెత్తిన గత విపత్తుల్లోనూ వందలాది ప్రాణాలను కాపాడారు.2018 కేరళ మహా వరదలు, అలాగే 2024 వయనాడ్ కొండచరియలు విరిగిపడిన దారుణ ఉదంతాల్లో ఆయన రెస్క్యూ వాలంటీర్‌గా ముందుండి సేవలందించారు.ఆయన 'అడ్వెంచర్ డిజాస్టర్ సొసైటీ'లో సభ్యుడిగా ఉంటూ, ఇతరులకు వాటర్ సేఫ్టీ, రోప్ రెస్క్యూలపై శిక్షణ ఇచ్చే నిపుణుడు.
రాజేష్ మృతిపై కేరళ ప్రజలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వీడీ సతీషన్ మాట్లాడుతూ.. రాజేష్ అత్యున్నత త్యాగం చేశాడు. ఆయన కుటుంబానికి నా గాఢ సానుభూతి. రాజేష్ నిర్మించుకుంటున్న ఇంటిని ప్రభుత్వమే పూర్తి చేస్తుంది. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం" అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
Paying tributes to disaster response trainer R. Rajesh, who made the ultimate sacrifice by giving his life jacket to save another during flash floods in Cherupuzha. Met his grieving family to offer deepest condolences.
The Govt will complete the construction of his unfinished… pic.twitter.com/6GsC9K9V1g— V D Satheesan (@vdsatheesan) August 5, 2026
ఆగస్టు 1 నుండి కేరళను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటివరకు వర్షాల కారణంగా కనీసం 20 మంది మరణించగా, నలుగురు గల్లంతయ్యారు. 12,000 మందికి పైగా ప్రజలను 300 సహాయక శిబిరాలకు తరలించారు. పతనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి, కన్నూర్, వయనాడ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సుమారు 165 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది.


