భువనేశ్వర్ : ఒడిశాలోని జాజాపూర్ జిల్లాలో వరదల వల్ల ప్రజలు పడే అవస్థలు అంతా ఇంతా కాదు. అసలే వరదల వల్ల గూడు చెదిరి ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇప్పుడు పాములతో సరికొత్త సమస్య వచ్చి పడింది. వరదనీటితో పాటు పాములు సైతం ఇళ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళలనలకు గురవుతున్నారు. విషపు జీవులు కరిచివేయడం వల్ల ఇప్పటికే దాదాపు 76మందికి పైగా ఆసుపత్రులలో చేరారు.
దశరథ్‌పూర్ బ్లాక్‌లోని గ్రామాల్లోని వీధులు, సంతల రోడ్లపైకి విపరీతంగా వరద చేరింది. దేవాలయాలు ఇళ్లు, ప్రభుత్వకార్యాలయాలన్నిటినీ వరద ముంచెత్తింది. దీంతో ఇళ్లలోని సామాగ్రి అంతా నీటిపాలు కావడంతో ప్రజలు తినడానికి, నిద్రపోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అయితే ఈ సమస్యలతో సతమవుతున్న ప్రజలకు ఇప్పుడు ఊహించని విపత్తు కొత్త తలనొప్పిని తెచ్చింది. భారీవరదలకు విష సర్పాలు , ఇతర విష సరీసృపాల ఇండ్లలోకి చేరుతున్నాయి. ప్రజల ఇళ్లు, నివాసాలు, పంజరాలలో ఆశ్రయం పొందేందుకు యత్నిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అక్కడి ఆరోగ్యశాఖ అందించిన వివరాల ప్రకారం. గత ఐదు రోజుల్లో మంగళ్‌పురా మెడికల్ సెంటర్‌లో 76 మందికి పైగా చికిత్స పొందారని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అధికారి అమృత ప్రీతమ్ మల్లా తెలిపారు. వీరిలో 37 మందిని గుర్తుతెలియని జంతువులు, 11 మందిని పాములు కాటు వేసినట్లు తెలిపారు.దీంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని విషసర్పాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
జాగ్రత్తలు
కరెంటు లేనప్పుడు టార్చ్ లైట్‌ను ఉపయోగించాలి
చీకటి ప్రదేశంలో తిరిగేటప్పుడు లైటును ఉపయోగించాలి.
బూట్లు, బట్టలు వేసుకునే ముందు వాటిని జాగ్రత్తగా సరిచూసుకోవాలి.
నేలపై పడుకోవడానికి బదులుగా, మంచం వంటి ఎత్తైన ప్రదేశాన్ని ఉపయోగించాలి.
ఒకవేళ పాములు లేక ఇతర విషసర్పాలు కాటు వేసినట్లు అనుమానం వస్తే స్వంత చికిత్స కాకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. అని ప్రకటన విడదల చేశారు.


