జలదిగ్బంధంలో 100 గ్రామాలు | Flooding crosses third danger mark at Bhadrachalam | Sakshi
Sakshi News home page

జలదిగ్బంధంలో 100 గ్రామాలు

Aug 2 2026 5:22 AM | Updated on Aug 2 2026 5:22 AM

Flooding crosses third danger mark at Bhadrachalam

వరద గోదారి ఉగ్రరూపం

హుటాహుటిన ఇళ్లు ఖాళీ చేస్తున్న జనం 

తిండి లేక ఇక్కట్లు పడుతున్న గ్రామీణులు

భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవాహం  

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ 

గుండెపోటుతో ఒకరు మృతి, వరదలో మరొకరు గల్లంతు 

సాక్షి, అమరావతి/చింతూరు/వేలేరుపాడు/సాక్షి, అమలాపురం: గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు పోటెత్తుతోంది.  భద్రాచలం వద్ద నీటి మట్టం 55.3 అడుగులకు చేరి మూడో ప్రమాద హెచ్చరికను దాటి ఉప్పొంగుతోంది. ఇక ధవళేశ్వరం బ్యారేజీలోకి చేరుతున్న వరద గంట గంటకూ పెరుగుతోంది.  ధవళేశ్వరం బ్యారేజీలో నీటి మట్టం రాత్రి 8.40 గంటలకు 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి వరద ఉద్ధృతితోపాటు పోలవరం బ్యాక్‌ వాటర్‌ ప్రభావంతో  చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లో వాగులు ఉప్పొంగుతున్నాయి. 

ఈ మండలాల్లో సుమారు వంద గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి.  వరద వల్ల సామగ్రిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న క్రమంలో వీఆర్‌పురం మండలం శ్రీరామగిరికి చెందిన నాళ్లారపు నవీన్‌ (32) అనే యువకుడు గుండెపోటుకు గురయ్యాడు. అతడిని మర పడవపై కూనవరం మండలం కోతులగుట్ట ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతను మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లోకి వరద నీరు చొచ్చుకొస్తోంది. పి.గన్నవరం చాకలిపాలెం వద్ద కనకయ్యలంక కాజ్‌వేపై ఐదారు అడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తోంది. దీంతో పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల సరిహద్దులో రాకపోకలు నిలిచాయి.   

వరదలో గిరిజనుడు గల్లంతు  
వేలేరుపాడు మండలం టేకూరుకి చెందిన నూపా ప్రసాద్‌ శుక్రవారం రాత్రి గోదావరి వరద నీటిలో కొట్టుకుపోయాడు. వరదల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరిగినా సహించేదిలేదని ఏలూరు కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అధికారులను  హెచ్చరించిన కొన్ని గంటల వ్యవధిలోనే  ఈ ఘటన జరిగింది. ప్రసాద్‌ శుక్రవారం మధ్యాహ్నం వేలేరుపాడు సంతకు వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో గోదావరిని దాటేందుకు యత్నించి గల్లంతయ్యాడు. శనివారం ఉదయం నుంచి గాలిస్తున్నా.. రాత్రి వరకూ ప్రసాద్‌ జాడ దొరకలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement