కరువులోనూ కడలిలోకి 185 టీఎంసీలు | Heavy Flood Inflow To Srisailam Project Due To Rain | Sakshi
Sakshi News home page

కరువులోనూ కడలిలోకి 185 టీఎంసీలు

Aug 3 2026 5:35 AM | Updated on Aug 3 2026 5:35 AM

Heavy Flood Inflow To Srisailam Project Due To Rain

ఒడిసిపట్టుకునే అవకాశం లేక సముద్రంలో కలిసిన గోదావరి జలాలు  

తగ్గుముఖం పట్టిన ప్రాణహిత, ఇంద్రావతి... శాంతించిన గోదావరి 

దేవాదులలో 8 మోటార్లతో పంపింగ్‌ 

ఎగువ పరీవాహకంలో వర్షాలతో కొనసాగుతున్న కృష్ణమ్మ ఉరుకులు  

ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయినీ నుంచి లక్ష క్యూసెక్కుల వరద 

శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద... క్రమంగా పెరుగుతున్న నిల్వలు 

సాక్షి, హైదరాబాద్‌ /గద్వాల/అచ్చంపేట/కొల్లాపూర్‌/భద్రాచలంటౌన్‌ /కన్నాయిగూడెం: అల్పపీడన ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలతో గత ఆదివారం ఉదయం 6గంటల వరకు ఏకంగా 185.71 టీఎంసీల గోదావరి జలాలు కడలిపాలయ్యాయి. ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి భీకరంగా పోటెత్తడంతో.. ఒడిసిపట్టుకునే అవకాశం లేక వచ్చి న వరద వచ్చి నట్టు సముద్రంలో కలిసిపోయింది. ఇప్పటి వరకు ఉపనది కడెం నుంచి కడెం ప్రాజెక్టుకు 10.48 టీఎంసీలు, గోదావరి ప్రధాన పాయపై ఉన్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 18.71టీఎంసీలు, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 36.95 టీఎంసీల వరద వచ్చింది.  

నెమ్మదించిన గోదావరి..
కడెం, ప్రాణహిత, ఇంద్రావతి పరీవాహకంలో కురిసిన ఎడతెరపి లేని వర్షాలతో నిన్న మొన్నటి వరకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. వర్షాలు విరామం తీసుకోవడంతో క్రమంగా శాంతిస్తోంది. గోదావరి, ప్రాణహిత నదుల సంగమ స్థలంలో నిర్మించిన మేడిగడ్డ బరాజ్‌కు ప్రాణహిత నుంచి ప్రస్తుతం 5.52 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, గేట్లన్ని ఎత్తి ఉండడంతో వచ్చి న వరద వచ్చి నట్టు కిందకు వెళ్లిపోతోంది. దిగువన ఉన్న సమ్మక్క బరాజ్‌కు 5.54 లక్షల క్యూసెక్కులు, దాని కింద ఉన్న సీతమ్మసాగర్‌ బరాజ్‌కు 9.05 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చింది వచ్చినట్టు కిందకు విడుదల చేస్తున్నారు.

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 42.09 అడుగులు, ప్రవాహం 9.27 లక్షల క్యూసెక్కులకు తగ్గిపోవడంతో తొలి ప్రమాద హెచ్చరికను సైతం ఉపసంహరించుకున్నారు. గోదావరి ప్రధానపాయపై ఎగువన ఉన్న శ్రీరాంసాగర్‌ పాజెక్టుకు 19,457 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతుండడంతో గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు గాను 34.1 టీఎంసీలకు నిల్వలు చేరాయి.

కడెం ప్రాజెక్టు గరిష్ట సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా, 3.5 టీఎంసీల నిల్వను కొనసాగిస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 16,048 క్యూసెక్కులు వస్తుండగా, 20.18 టీఎంసీల గరిష్ట సామర్థ్యానికిగాను 19.87 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ నంది పంప్‌హౌస్‌ ద్వారా 15,750 క్యూసెక్కుల నీటిని మేడారం రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి గాయత్రి పంప్‌హౌస్‌ ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని మిడ్‌మానేరు రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు. దీంతో మిడ్‌మానేరులో 27.55 టీఎంసీల గరిష్ట సామర్థ్యానికిగాను 13.12 టీఎంసీలకు నిల్వలు చేరాయి.  

దేవాదుల ప్రాజెక్టులో.... 
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుట్టలగంగారంలో ఉన్న దేవాదుల ప్రాజెక్టులో అధికారులు 8 మోటార్లు ఆన్‌ చేసి నీటి పంపింగ్‌ కొనసాగిస్తున్నారు. దేవాదులలోని మూడు ఫేజ్‌ల్లో ఫస్ట్‌ ఫేజ్‌లో రెండు, రెండో ఫేజ్‌లో రెండు, ఫేజ్‌ త్రీలో 6 మోటార్లు ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం 5 మోటార్లతో పంపింగ్‌ కొనసాగించిన అధికారులు, ఆదివారం మరో మూడు మోటార్లను ఆన్‌చేశారు. మొత్తం 8 మోటార్లతో 2,129 క్యూసెక్కుల నీటిని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని గొల్లబుద్దారం వద్ద ఉన్న భీంఘన్‌పూర్‌ రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్‌ చేస్తున్నారు.  

ఉరకలేస్తున్న కృష్ణమ్మ ..     
కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో వర్షాలతో కర్ణాటకలో కృష్ణా ప్రధాన పాయపై ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 1.03 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా, 123.08 టీఎంసీల గరిష్ట సామర్థ్యానికి గాను 112.29 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 1.11లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 1.15 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తగా, వచ్చింది వచ్చినట్టు కిందకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలో ఉపనది భీమాపై ఉన్న ఉజ్జయినీ ప్రాజెక్టుకు 59,971 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, జలాశయం ఇప్పటికే నిండడంతో 95 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.

దీంతో దిగువన తెలంగాణలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు 1.68 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, విద్యుదుత్పత్తి, గేట్ల ద్వారా 1.78 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండడంతో దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. శ్రీశైలంలో 1.69 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, 215.81 టీఎంసీల గరిష్ట సామర్థ్యానికి గాను 76.86 టీఎంసీలకు నిల్వలు చేరాయి. ప్రస్తుత వానాకాలంలో ఇప్పటి వరకు శ్రీశైలంలో 51 టీఎంసీలు వచ్చి చేరాయి. మరో 138.98 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండుతుంది.  

కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరుడు 
కృష్ణానది, తుంగభద్ర నుంచి వరద భారీగా వస్తుండటంతో శ్రీశైలం జలాశయంలో బ్యాక్‌ వాటర్‌ అంతకంతకూ పెరుగుతోంది. శనివారం రాత్రి సంగమేశ్వరాలయ గర్భగుడిలోని వరదనీరు చేరగా, ఆదివారం రాత్రికి ఆలయ గోపురం నీటిలో మునిగిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement