80 శాతం కాలేజీలకు కుదరని ఒప్పందం
ప్రయోగాత్మక విద్యపై వర్సిటీల్లో ఆందోళన
బోధనపై ఆసక్తి చూపని టెక్ ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలతో భాగస్వామ్యానికి బహుళ జాతి కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. ఇంటర్న్‌షిప్ ఇచ్చేందుకు ససేమిరా అంటున్నాయి. ఐటీ ఉద్యోగులు సైతం ఎమర్జింగ్ కోర్సులను బోధించేందుకు భయపడుతున్నారు. మాతృ సంస్థలు అనుమతించడం లేదని చెబుతున్నారు. కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి బ్రాంచీల్లో ప్రాక్టికల్ బోధనను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) తప్పనిసరి చేసింది. ఆయా కోర్సుల్లో సంబంధిత కంపెనీలు ఇంటర్న్‌షిప్ ఇవ్వడానికి అంగీకరించాయనే ఒప్పంద పత్రాన్ని ప్రైవేటు కాలేజీలు అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీకి సమర్పించాలి.
దీంతో జేఎన్‌టీయూహెచ్ సహా పలు వర్సిటీలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నాయి. క్లాసులు మొదలుపెట్టేందుకు ముందే ఎంవోయూలను సమరి్పంచాలని ప్రైవేటు కాలేజీలను ఆదేశించాయి. దీంతో కాలేజీ యాజమాన్యాల్లో ఆందోళన మొదలైంది.
ఎమర్జింగ్ కోర్సుల ఎదురీత: రాష్ట్రవ్యాప్తంగా 152 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. మొత్తం 1.16 లక్షల సీట్లల్లో కంప్యూటర్ సైన్స్, అనుబంధ ఎమర్జింగ్ కోర్సుల్లో సీట్లు 78 వేల వరకూ ఉన్నాయి. ఇందులో 65 వేల సీట్లు భర్తీ అవుతున్నాయి. టాప్–10 కాలేజీల్లో పూర్తిస్థాయిలో విద్యార్థులు చేరుతున్నారు. ఈ కోర్సులు బోధించేందుకు సంబంధిత విభాగాల్లో మాస్టర్ డిగ్రీ ఉండాలి. మాస్టర్స్ చేసిన వాళ్లంతా సాఫ్ట్‌వేర్ రంగంలోనో, విదేశాలకు వెళ్లో స్థిరపడుతున్నారు. బోధకుల కొరతను దృష్టిలో ఉంచుకుని ఏఐసీటీఈ ఐటీ నిపుణుల చేత ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా బోధన చేపట్టాలని గత ఏడాది సూచించింది.
గత ఏడాది కేవలం 12 కాలేజీల్లో మాత్రమే డేటాసైన్స్, ఏఐ బ్రాంచీల్లో ఐటీ నిపుణులు ఆన్‌లైన్ ద్వారా బోధన చేసినట్టు చెబుతున్నారు. మిగతా కాలేజీల్లో సివిల్, మెకానికల్, సీఎస్‌ఈ కోర్ గ్రూపుల్లో ఎంటెక్ చేసిన వాళ్లు బోధించారు. గ్రామీణ ప్రాంతాల్లో బీటెక్ చేసిన ఉపాధ్యాయుల చేతే బోధన చేయించినట్టు గుర్తించారు. దీనివల్ల ఎమర్జింగ్ కోర్సుల్లో లోతైన విద్యా బోధన జరగడం లేదు. ఈ ఏడాది పరిస్థితి మరింత కష్టంగా ఉందని ప్రైవేటు కాలేజీలు అంటున్నాయి. 80 శాతం కాలేజీలకు ఎంవోయూ కుదరలేదని తెలిసింది.
ఎందుకీ పరిస్థితి?
ఐటీ సంస్థలన్నీ యాంత్రీకరణ వైపు వేగం పెంచాయి. బిగ్ డేటా సెంటర్స్‌పై పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తున్నాయి. దీనికోసం ఆధునిక సాంకేతికత, సరికొత్త లాంగ్ లెరి్నంగ్ మాడ్యూల్స్‌ను ఎంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ సంస్థలకు భద్రతపరమైన సమస్యలూ సవాళ్లు విసురుతున్నాయి. ప్రతీ ఉద్యోగిపై ఏఐ ఆధారిత నిఘా పెట్టాల్సిన అవసరం ఏర్పడిందని హైదరాబాద్ ఏఐ కంపెనీ సీనియర్ ఎనలిస్ట్ సాధూ దూబే తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ విద్యార్థులను ఇంటర్న్‌షిప్ పేరుతో అనుమతిస్తే ఇబ్బందులు ఉంటాయని చెప్పారు.
కొత్త వ్యక్తులు ఏ చిన్న కమాండ్ జోలికి వెళ్లినా కంపెనీలకు పెద్దస్థాయిలో నష్టం వాటిల్లే వీలుంది. చాట్‌బాట్లు, కోడింగ్ అసిస్టెంట్లు, ఎంటర్‌ప్రైజ్ ఏఐ వ్యవస్థ దెబ్బతినే వీలుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే ఎంవోయూలకు వెనుకంజ వేస్తున్నారు. ఆయా కోర్సులకు ప్రయోగాత్మక వాస్తవికత ఇవ్వకపోతే విద్యార్థులకు స్కిల్డ్ ఉద్యోగాలు రావడం కష్టమని ఏఐసీటీఈ అధ్యయనంలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో కంపెనీలతో ఎంవోయూ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రైవేటు కాలేజీలు కోరుతున్నాయి.


