ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిన్నరలోపే.. అప్పుల కొండ కరిగించేశారు! | Over Rs 400 crore loan arrears cleared within a year and a half of being elected as MLA: Telangana | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిన్నరలోపే.. అప్పుల కొండ కరిగించేశారు!

Aug 3 2026 4:46 AM | Updated on Aug 3 2026 4:48 AM

Over Rs 400 crore loan arrears cleared within a year and a half of being elected as MLA: Telangana

రూ.400 కోట్లకు పైగా రుణ బకాయిలు వారం వ్యవధిలోనే తీర్చేయడంపై చర్చ

వివిధ సంస్థల్లో వాటాదారులుగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత, ఆయన కుటుంబం

ఆరేళ్ల వ్యవధిలో 11 కంపెనీల పేరిట9 బ్యాంకుల నుంచి రూ.470 కోట్ల రుణాలు తీసుకున్న వైనం

అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో డీఫాల్టర్లుగా ప్రకటించిన బ్యాంకులు

పదేళ్లకు పైగా కొనసాగిన నోటీసులు, ఎన్‌సీఎల్‌టీ కేసుల పర్వం

2023లో ఎమ్మెల్యేగా ఎన్నికైన నేత..ఏడాదిన్నరలోపే మారిన సీన్‌

స్వల్ప వ్యవధిలోనే భారీ మొత్తంలో రుణాలెలా తీర్చారనే అనుమానాలు

సాక్షి, హైదరాబాద్‌: ఆయన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత. సుమారు రెండున్నర దశా బ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగు తున్నారు. 2023లో తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. వ్యాపారవేత్తగానూ పేరొందిన సదరు ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులు గతంలో వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థల్లో వాటాదారులుగా ఉన్నారు. కొన్ని వ్యాపార సంస్థలు తీసుకున్న రుణాలకు సెక్యూరిటీ ఇచ్చారు. వారు వాటాదారులుగా ఉన్న సంస్థలు సుమారు ఆరేళ్ల వ్యవధిలో వ్యాపార అవసరాల కోసం వివిధ బ్యాంకుల నుంచి సుమారు రూ.470 కోట్ల రుణాలు తీసుకున్నాయి.

అయితే ఏళ్ల తరబడి వడ్డీ, అసలు చెల్లించకపోవడంతో సదరు సంస్థలను బ్యాంకులు మొండి బకాయిదారులుగా ప్రకటిస్తూ డిమాండ్, పొజిషన్‌ నోటీసులు కూడా జారీ చేశాయి. కార్పొరేట్‌ డెబ్టార్‌గా పేర్కొంటూ నేషనల్‌ కంపెనీ ఆఫ్‌ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో కేసులు కూడా నడిచాయి. ఇది 2024 వరకే..! సదరు కంపెనీల్లో వాటాదారుగా ఉన్న, ఆయా కంపెనీలతో సన్నిహిత సంబంధమున్న అధికార పార్టీ నేత.. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిన్నర లోపే పరిస్థితి మారిపోయింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే బ్యాంకుల్లో ఏళ్ల తరబడి భారీగా పేరుకు పోయిన రుణ బకాయిల్లో రూ.400 కోట్లకు పైగా సదరు సంస్థలు తీర్చేయడం వ్యాపార, రాజకీయ వర్గాలను విస్తుపోయేలా చేసింది. ఇదెలా సాధ్యమయ్యింది?, ఏం జరిగిందనే చర్చకు తెరలేపింది.

అప్పుల ఊబిలో కూరుకుపోయి.. డీఫాల్టర్లుగా మారి
అధికార పార్టీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, సన్నిహితులు భాగస్వామిగా ఉన్న 11 వ్యాపార సంస్థలు 9 బ్యాంకుల నుంచి 2013కు ముందు సుమారు రూ.470 కోట్ల మేర రుణాలు తీసుకున్నాయి. ఇందులో భాగమైన ఓ రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణ సంస్థలో సదరు ఎమ్మెల్యే గతంలో మేజర్‌ వాటాను కూడా కలిగి ఉన్నారు. సదరు నిర్మాణ సంస్థ నాలుగు బ్యాంకులకు చెందిన హైదరాబాద్‌ బ్రాంచీల నుంచి 2007 అక్టోబర్‌ నుంచి 2013 డిసెంబర్‌ మధ్యకాలంలో రూ.357 కోట్లు రుణంగా తీసుకోవడం గమనార్హం. దీంతో పాటు సదరు ఎమ్మెల్యే కుటుంబసభ్యులు వాటాదారులుగా ఉన్న ఓ ‘ప్రైవేటు హోటల్స్‌’ పేరిట కూడా రూ.87 కోట్ల రుణాలు తీసుకున్నారు.

వీటితో పాటు కొన్ని ఐటీ కంపెనీలు, ఆగ్రో ఇండస్ట్రీస్‌ పేరిటా వేర్వేరు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. అయితే తర్వాతి కాలంలో అప్పుల ఊబిలో కూరుకుపోయి తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించకపోవడంతో బ్యాంకులు సదరు వ్యాపార సంస్థలను డీఫాల్టర్లుగా ప్రకటించాయి. పదేళ్లకు పైగా ఈ తతంగం కొనసాగింది.

రుణాలు చెల్లించినట్టు ధ్రువీకరించిన బ్యాంకులు
    అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంస్థలతో దగ్గరి సంబంధాలున్న సదరు నేత వరుస ఓటముల తర్వాత 2023 ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఏడాదిన్నర లోపే గతంలో డీఫాల్టర్‌గా మారిన సంస్థలు కేవలం వారం రోజుల్లో రుణాలకు సంబంధించి రూ.వందల కోట్ల బకాయిలను బ్యాంకులకు తిరిగి చెల్లించాయి. 2025 మార్చి 24 నుంచి అదే నెల 31 వరకు సుమారు రూ.400 కోట్లకు పైగా రుణాల చెల్లింపు జరిగింది. 2025 మార్చి 24న బంజారాహిల్స్‌లోని ఓ బ్యాంకు శాఖకు ఏకమొత్తంలో రూ.120 కోట్లు చెల్లించేశారు.

తమకు బకాయి పడిన మొత్తం తిరిగి వసూలైందని సదరు బ్యాంకు ధ్రువీకరిస్తూ నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) కూడా జారీ చేసింది. ఇతర రుణాలకు సంబంధించి కూడా ఆయా బ్యాంకులు తమకు రావాల్సిన బకాయిలు వసూలైనట్లు పేర్కొంటూ ఎన్‌ఓసీలు ఇచ్చాయి. రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణ సంస్థకు సంబంధించి రూ.357 కోట్లు, ప్రైవేటు హోటల్స్‌కు సంబంధించి రూ.87 కోట్లు 2025 డిసెంబర్‌ 30 నుంచి 2026 మార్చి మధ్యకాలంలో చెల్లించినట్లు ‘సాక్షి’  ప్రాథమిక పరిశీలనలో తేలింది.

అఫిడవిట్లలో కనిపించని విదేశీ ఖాతాల వివరాలు
     సదరు నేత 2023 ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘానికి అఫిడవిట్లు సమర్పించారు. తనతో పాటు తన భార్య వృత్తిని వ్యాపారంగా పేర్కొన్నారు. తనపై 40 క్రిమినల్‌ కేసులు ఉన్నాయని వెల్లడించడంతో పాటు ఆస్తుల విలువ సుమారు రూ.54 కోట్లు, అప్పులు సుమారు రూ.12 కోట్లు ఉన్నట్లు తెలిపారు. 2014 నాటి అఫిడవిట్‌లో సుమారు రూ.28 కోట్లు, 2018లో సుమారు రూ.26 కోట్లు తనకు ఆస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. కానీ బ్రెజిల్, సింగపూర్, హాంకాంగ్‌ వంటి దేశాల్లో ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలు ఆయన తన ఎన్నికల అఫిడవిట్లలో పొందు పరచలేదనే ఆరోపణలు ఉన్నాయి.

ఇదిలావుండగా.. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన యధేచ్చగా చెరువుల ఆక్రమణ, ఇసుక దందా, బెదిరింపులు, వసూళ్ల పర్వం కొనసాగించారనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే స్వల్ప వ్యవధిలో వందల కోట్లలో చెల్లింపులు సాధ్యమయ్యాయా? అని వ్యాపార, రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా సదరు కంపెనీలు కొనసాగించిన భారీ ఆర్థిక లావాదేవీలపై విచారణ జరిగితేనే అన్ని విషయాలూ వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement