మహంకాళీ... కాపాడాలి | CM Revanth Reddy Offers Silk Clothes at Secunderabad Ujjaini Mahankali Temple on Bonalu | Sakshi
Sakshi News home page

మహంకాళీ... కాపాడాలి

Aug 3 2026 4:56 AM | Updated on Aug 3 2026 4:56 AM

CM Revanth Reddy Offers Silk Clothes at Secunderabad Ujjaini Mahankali Temple on Bonalu

ఆదివారం సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దర్శనానికి వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు

అంగరంగ వైభవంగా లష్కర్‌ బోనాలు

ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి  పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి 

పూజలు చేసిన మంత్రులు, ఇతర ప్రముఖులు

రాంగోపాల్‌పేట్‌: చరిత్రాత్మకమైన లష్కర్‌ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు వేలాది మంది తరలి వచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున క్యూలైన్లలో వేచి ఉన్నారు. జాతర సందర్భంగా వేకువజామున 4.05 గంటలకు నగర ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ దంపతులు అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాధారణ భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 12.45 గంటలకు అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు.

ఆయనతోపాటు మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బోనం సమర్పించగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పాల్గొన్నారు. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, దేవాదాయ శాఖ కమిషనర్‌ హన్మంతరావు, ఆలయ చైర్మన్‌ కామేష్, ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి సీఎంకు స్వాగతం పలికారు. రాజ్యసభ సభ్యులు పవన్‌ఖేరా, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేష్, నవీన్‌యాదవ్‌ తదితరులు సీఎం వెంట ఉన్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్‌రావు, హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నందా, ప్రభుత్వ సలహాదారులు వి.హన్మంతరావు, వేణుగోపాల్, జిల్లా కలెక్టర్‌ ఆల ప్రియాంక, నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తదితరులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.  
బోనాలు విశ్వవ్యాప్తం చేసిన ఘనత కేసీఆర్‌దే: కేటీఆర్‌ 
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే బోనాల జాతరను విశ్వవ్యాప్తం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. తల్లి ఆశీర్వాదంతోనే తెలంగాణ సాధించాం. అమ్మకు ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్‌ బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి వర్షాలు బాగా కురవాలి, రైతులందరూ సంతోషంగా ఉండాలని మొక్కుకున్నా.  

తెలంగాణ అగ్రగామిగా ఉండాలి: మహేశ్‌గౌడ్‌ 
దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచేలా అమ్మవారు ఆశీర్వదించాలని మొక్కుకున్నా. వర్షాలు బాగా కురిసి పాడి పంటలతో ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement