రాయదుర్గంలో మరోసారి భూముల వేలం
రెండు ప్లాట్లుగా మొత్తం 10 ఎకరాలకుపైగా అమ్మకానికి...
గతంతో పోలిస్తే 26 శాతం పెరిగిన రిజర్వ్ ప్రైస్
రూ.2,500 కోట్ల ఆదాయమే ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్టీ మరో రికార్డు నమోదుకు సిద్ధమైంది. నగరం నడిరోడ్డున ఉన్న రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ ఇందుకు మరోసారి వేదిక అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల అమ్మకం ప్రక్రియలో భాగంగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ లేఅవుట్‌లో ఖరీదైన, బహుళ ప్రయోజన భూములను ఈ–వేలం వేయాలని నిర్ణయించింది.
సర్వే నంబర్ 83/1లో రెండు ప్లాట్ల(10 ఎకరాలకుపైగా)ను విక్రయానికి పెట్టింది. వేలం ద్వారా రూ.2,500 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) స్థాపనకు విదేశీ దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌కు క్యూ కట్టడంతో రాయదుర్గం ప్రాంతంలో గ్రేడ్–ఏ కార్యాలయాల స్థలాలకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఇదే కొత్త రికార్డు నమోదుకు కలిసి వస్తుందని ప్రభుత్వం ధీమాగా ఉంది. అందుకే ఎకరాకు కనీస ధరను గతం కంటే దాదాపు 26 శాతం అధికం చేసింది.
పెరిగిన కనీస ధర..
నాలెడ్జ్ సిటీ లేఅవుట్‌లోని 5.25 ఎకరాలు, 5.38 ఎకరాలున్న ఈ ప్లాట్లను ప్రభుత్వం అమ్మకానికి ఉంచింది. ఎకరాకు రూ.175 కోట్ల కనీస ధరగా (రిజర్వ్ ప్రైస్) నిర్ణయించింది. ఈ వేలాన్ని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఎంఎస్‌టీసీ లిమిటెడ్ ద్వారా నిర్వహించనుంది. రెండు ప్లాట్లు పక్కపక్కనే ఉండడంతో ఒకే రియల్టీ సంస్థ అధిక మొత్తం చెల్లించి దక్కించుకునే అవకాశమూ లేకపోలేదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది మే 28, జూన్ 1న ఇదే నాలెడ్జ్ సిటీ లేఅవుట్‌లోని రెండు ప్లాట్లకు నిర్వహించిన వేలంలో కనీస ధర ఎకరాకు రూ.139 కోట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఈ నెలలో నిర్వహించే వేలంలో ఎకరాకు రిజర్వ్ ప్రైస్ ఏకంగా రూ.36 కోట్లు పెంచారు. దీనిని బట్టి చూస్తే ఈ ప్రాంతంలో భూములకు దిగ్గజ రియల్టీ సంస్థల నుంచి ఉన్న డిమాండ్ ఇట్టే అర్థం అవుతోంది.
గత రికార్డులు బద్దలయ్యేనా..
రాయదుర్గం ప్రాంతంలో 2026 మే నెలలో జరిగిన వేలంలో 6.29 ఎకరాల ప్రభుత్వ భూమి ఎకరాకు రికార్డు స్థాయిలో రూ.237 కోట్లు పలికింది. గౌర వెంచర్స్ ఈ ప్లాట్‌ను చేజిక్కించుకుంది. ప్రభుత్వ భూముల అమ్మకాల్లోనే ఇప్పటి వరకు ఇదే అత్యధిక ధర. దేశవ్యాప్తంగా సైతం ఒక ఎకరాకు ఈ స్థాయిలో ధర పలకడం ఇదే తొలిసారి అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. జూన్ 1న జరిగిన వేలంలో 5.09 ఎకరాల ప్లాట్‌ను ఎకరా రూ.204 కోట్లు వెచ్చించి వంశీరామ్ బిల్డర్స్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం నాలెడ్జ్ సిటీ పరిధిలో ఉన్న వాణిజ్య భవనాలకు డిమాండ్ దృష్ట్యా, రాబోయే వేలంలో తీవ్రమైన పోటీ ఎదురై పాత రికార్డులు బద్దలవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
వివాదాలు లేని వసతులు..
ఈ భూములు ఎలాంటి కోర్టు వివాదాలు, చిక్కులు లేకుండా తక్షణ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాయని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ స్పష్టం చేసింది. వీటికి అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ) సదుపాయం ఉండటంతోపాటు, ఇవి బహుళ ప్రయోజన జోన్ పరిధిలోకి వస్తాయి. అత్యుత్తమ రోడ్డు రవాణా అనుసంధానం ఉన్న ఈ ప్లాట్లకు రాష్ట్ర ప్రభుత్వ సింగిల్ విండో విధానం ద్వారా నిర్ణీత వ్యవధిలోనే అనుమతులు లభిస్తాయి. నాలెడ్జ్ సిటీ అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన సంగతి తెలిసిందే.


