మాతృ హృదయం
బయట కుండపోత వర్షం.
అందరూ గాఢనిద్రలో ఉన్నారు.
సరిగ్గా అదే సమయంలో మృత్యువు
ఆ ఇల్లాలి తలుపు తట్టింది.
క్షణాల్లో ఇల్లు కూలిపోతోంది.
ఆమె తల పగిలి రక్తం కారుతోంది.
కానీ, ఆమెలో ఎక్కడ లేని బలం వచ్చింది.
నొప్పినీ, భయాన్నీ పక్కన పెట్టి కాలంతో పరుగు తీసింది.
కుప్పకూలుతున్న ఇంటి శిథిలాల నుంచి తన
కుటుంబాన్ని ప్రాణాలతో బయటకు లాక్కొచ్చింది.
కేరళలోని పయ్యన్నూరులో భయానక వరద విపత్తులో
54 ఏళ్ల ఇందూ దామోదరన్ చూపిన మాతృహృదయం ఇది.
కేరళను గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉప్పొంగుతున్న నదులు. విరిగిపడుతున్న కొండచరియలు. అతలాకుతలమవుతున్న సామాన్య జీవితాలు. కానీ, ప్రకృతి సృష్టించిన ఈ మహా బీభత్సంలో ఒక సామాన్య మహిళ సృష్టించిన అద్భుతం ఇవాళ కేరళ వ్యాప్తంగా వైరల్‌గా నిలిచింది. కన్నూర్‌కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పయ్యన్నూర్ మున్సిపాలిటీలోని కేలోత్ గ్రామంలో నివసిస్తున్న ఇందూ దామోదరన్ అనే మహిళ ఒక తల్లిగా, ఇల్లాలుగా విపత్కర పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం ఐదుగురు ప్రాణాలను కాపాడింది. అది కేవలం సమయస్ఫూర్తి కాదు, మరణాన్ని సైతం ఎదిరించిన మాతృమూర్తి ధైర్యం.
అర్ధరాత్రి ప్రళయం..
గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేలోత్ గ్రామంలోని లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికే జలమయమయ్యాయి. ఆగస్టు 3 అర్ధరాత్రి దాటిన సమయం. ఇందూ దామోదరన్ తన పూర్వీకుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తోంది. ఆ సమయంలో భర్త దామోదరన్ ఏదో పని మీద వేరే ఊరిలో ఉన్నారు. బయట వర్షం బీభత్సంగా కురుస్తుండగా ఒక్కసారిగా ఒక పెద్ద శబ్దంతో ఇంటి పైకప్పు భాగం కూలి ఇందూ తలపై పడింది.
ఆ దెబ్బకు ఆమె తల పగిలి, రక్తం ధారగా కారడం ప్రారంభమైంది. తీవ్రమైన నొప్పితో కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి. సాధారణంగా ఏ మనిషైనా ఆ సమయంలో భయంతో కేకలు వేస్తూ పడిపోతారు. కానీ, ఇందూ చుట్టూ చూసింది. పక్కనే గాఢ నిద్రలో ఉన్న వృద్ధురాలైన తల్లి, సోదరి, 14 ఏళ్ల కుమారుడు, 13 ఏళ్ల మేనల్లుడు ఉన్నారు. ఇంకా ముఖ్యం ఐదేళ్ల వయసున్న చిన్న మేనల్లుడు నిద్రపోతున్నాడు. తాను పడిపోతే వీరంతా ఈ శిథిలాల కింద సమాధి అయిపోతారని ఆమెకు అర్థమైంది. అంతే, తల నుంచి కారుతున్న నెత్తుటిని తుడుచుకునే తీరిక కూడా లేకుండా ఆమె కదిలింది.
మృత్యుగృహం నుంచి సురక్షిత తీరానికి...
నెత్తురు ఓడుతున్న శరీరంతోనే ఇందు ఒక్కొక్కరినీ నిద్ర లేపింది. ఇల్లు కూలిపోతోంది, వెంటనే బయటకు రండంటూ కేకలు వేసింది. ఆ సమయంలో బయట ఊరంతా వరద నీరు చేరడం, అర్ధరాత్రి గాఢాంధకారం కావడం వల్ల చుట్టుపక్కల వాళ్ళు కూడా తమ ఇళ్లను కాపాడుకునే కంగారులో ఉన్నారు.
ఎవరి సహాయం కోసం ఎదురుచూడకుండా భయంతో వణికిపోతున్న చిన్నపిల్లాడు పార్థివ్‌ను, నడవలేని స్థితిలో ఉన్న తన తల్లిని చేతుల్లోకి తీసుకుని, కాంక్రీట్ ముక్కలు పడుతున్నా లెక్కచేయకుండా వాకిట్లోకి పరుగెత్తింది ఇందూ. ఆమె వెనుకే మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ప్రాణభయంతో బయటకు వచ్చారు. వారు వాకిట్లోకి వచ్చి, అడుగు దూరంలో ఉన్న సురక్షితమైన తోటలోకి చేరుకున్నారో లేదో... పెద్ద శబ్దంతో ఆ ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. కేవలం కొన్ని సెకన్ల వ్యవధి. ఇందూ గనుక ఆ నెత్తురు చూసి భయపడి ఉంటే, ఆ కొన్ని సెకన్లు ఆలస్యమై ఉంటే... ఇవాళ ఆ కుటుంబం ప్రాణాలతో ఉండేది కాదు.
మాతృత్వపు అసాధారణ శక్తి
ప్రకృతి విపత్తుల ముందు మనుషులు ఎంత బలహీనులో మనం చూస్తూనే ఉంటాం. కానీ, అదే ప్రకృతి విపత్తును ఒక స్త్రీ తన సంకల్పబలంతో ఎలా ఎదిరించిందో ఈ ఘటన నిరూపించింది. పక్కన భర్త లేకపోయినా, ఊరంతా వరద ముంచెత్తినా, తీవ్రమైన గాయాలతో ఒంటరిగా పోరాడి గెలిచింది.
ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఇందూను చూసి వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఆ సమయంలో ఆమెకు కలిగిన శారీరక నొప్పి కంటే, తన కుటుంబం ఏమైపోతుందనే మానసిక ఆందోళనే ఆమెను నడిపించిందన్నారు. కేరళ వరదల్లో ఇందూ దామోదరన్ ఒక సాధారణ బాధితురాలిగా మిగిలిపోలేదు; విపత్తుల కంటే మనుషుల ఆత్మవిశ్వాసం, బంధాల మీద ఉండే ప్రేమ చాలా శక్తిమంతమైనవని నిరూపించింది. సెల్యూట్ ఇందూ దామోదరన్!


