కేంద్ర ప్రభుత్వంలో మిత్రులు.. పీవోకేలో శత్రువులు.. | Pakistan's Ruling Allies PPP and PML-N Clash Fiercely in POK Elections 2026 | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వంలో మిత్రులు.. పీవోకేలో శత్రువులు..

Aug 5 2026 9:28 AM | Updated on Aug 5 2026 10:17 AM

PPP and PML-N chase seats IN POK Allies at Centre

పాకిస్తాన్‌లో ఒకే ప్రభుత్వంలో భాగస్వాములు.. కానీ, పీవోకేలోని ముజఫరాబాద్‌లో మాత్రం ప్రత్యర్థులు. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్ (POK) ఎన్నికలు పాక్‌ అధికార కూటమిలోని రెండు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర రాజకీయ పోరుకు వేదికగా మారాయి. ఒకవైపు ప్రజా ఆందోళనలు, కాల్పులు, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. మరోవైపు ఎన్నికల ఫలితాలపై అధికార కూటమిలోని పాకిస్తాన్‌ పీపుల్స్ పార్టీ (PPP), పాకిస్తాన్‌ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

కాగా, పాకిస్తాన్‌లోని కేంద్ర ప్రభుత్వంలో మిత్రపక్షాలుగా ఉన్న ఈ రెండు పార్టీలు.. పీవోకేలో మాత్రం ఆధిపత్యం కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. ఒకే కూటమిలో కొనసాగుతున్నా.. ఎన్నికల రంగంలో మాత్రం ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేస్తూ రాజకీయ యుద్ధం సాగిస్తున్నాయి. పీవోకేలో ఎన్నికల తొలి రెండు దశల్లో PML-N ఆధిక్యం సాధించడంతో PPP తీవ్రంగా స్పందించింది. PPP అధినేత బిలావల్ భుట్టో జర్దారీ ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, తమ పార్టీకి చెందిన ఓట్లను ప్రభావితం చేశారని ఆరోపించారు. కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలను ఆక్రమించారని, తమ పోలింగ్ ఏజెంట్లను బయటకు పంపించారని, బ్యాలెట్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని PPP నేతలు ఆరోపించారు.

ప్రజలు నిజంగా తిరస్కరించిన చోట ఓటమిని అంగీకరిస్తామని, కానీ దొంగిలించిన ఫలితాలను మాత్రం అంగీకరించబోమని బిలావల్ భుట్టో స్పష్టం చేశారు. PML-Nను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఆ పార్టీ విజయాలు ప్రజా మద్దతుతో కాకుండా అక్రమాల ఆధారంగా సాధిస్తున్నాయని విమర్శించారు. అయితే PML-N ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. ప్రజలే ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని, ఓటమిని అంగీకరించలేని వారు ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి మరియమ్ నవాజ్ కూడా ఎన్నికల ఫలితాలను ప్రజల విజయంగా అభివర్ణించారు.

ఇ‍మ్రాన్‌ కోసం కూటమి.. 
ఇక, 2022లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని తొలగించే సమయంలో PPP, PML-N సహా పలు పార్టీలు ఒకే వేదికపైకి వచ్చాయి. రాజకీయ అవసరాల నేపథ్యంలో ఏర్పడిన ఈ కూటమి ప్రస్తుతం POK ఎన్నికల కారణంగా అంతర్గత విభేదాలను బయటపెడుతోంది. ఇస్లామాబాద్‌లో కలిసి పాలన సాగిస్తున్న పార్టీలు.. ముజఫరాబాద్‌లో మాత్రం పరస్పర ప్రత్యర్థులుగా మారాయి. ఈ రాజకీయ పోరుకు మరోవైపు POKలో ప్రజా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆర్థిక సమస్యలు, ధరల పెరుగుదల, పరిపాలనా విధానాలు, పాకిస్తాన్‌ కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యానికి వ్యతిరేకంగా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో నిరసనలు ఉధృతమయ్యాయి. నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే, పాక్‌ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ, నిరసనల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందని ఆరోపించింది. మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవల నిలిపివేత, అరెస్టులు, భారీగా భద్రతా బలగాల మోహరింపుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. పీవోకే ఎన్నికల తొలి దశలో మొత్తం 13 స్థానాలకు జరిగిన పోలింగ్‌లో PML-N తొమ్మిది స్థానాలు గెలుచుకోగా, PPP నాలుగు స్థానాలు సాధించింది. రెండో దశలో కూడా PML-N ఆధిక్యం కొనసాగించింది. మూడో, చివరి దశ ఎన్నికలు ఆగస్టు 10న జరగనున్నాయి. ప్రస్తుతం POK ఎన్నికలు సాధారణ రాజకీయ పోటీని దాటి.. పాకిస్తాన్‌ అధికార కూటమిలోని రెండు ప్రధాన పార్టీల మధ్య ఆధిపత్య పోరుగా మారాయి. ప్రజలు తమ సమస్యలపై నిరసనలు చేస్తున్న వేళ.. రాజకీయ పార్టీలు మాత్రం అధికారం, స్థానాల కోసం పోరాడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement