బుర్ఖాలో కన్వర్ యాత్ర.. సంభల్‌లో మళ్లీ ఉద్రిక్తత! | Muslim woman Hindu husband, and a Burqa Kanwar Yatra | Sakshi
Sakshi News home page

బుర్ఖాలో కన్వర్ యాత్ర.. సంభల్‌లో మళ్లీ ఉద్రిక్తత!

Aug 5 2026 7:49 AM | Updated on Aug 5 2026 7:49 AM

Muslim woman Hindu husband, and a Burqa Kanwar Yatra

ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో మరో మతానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకున్న ఓ మహిళ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముస్లిం మతానికి చెందిన తమన్నా మాలిక్ హిందూ యువకుడు అమన్‌ త్యాగిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. గతంలో మహాశివరాత్రి సందర్భంగా ఆమె బుర్ఖా ధరించి కన్వర్‌ యాత్ర నిర్వహించడం వివాదానికి దారితీసింది. ఇప్పుడు మరోసారి ఆమె కన్వర్‌యాత్ర చేపట్టడంతో శాంతిభద్రతల పరిరక్షణ కోసం యంత్రాంగం అప్రమత్తమైంది.

సంభల్‌కు చెందిన తమన్నా మాలిక్, అమన్‌ త్యాగి సుమారు నాలుగేళ్ల క్రితం తమ మతాల సరిహద్దులను చెరిపివేసి వివాహం చేసుకున్నారు. తమ వివాహం సజావుగా సాగితే శివాలయంలో భర్తతో కలిసి జలాభిషేకం చేస్తానని తమన్నా  మొక్కుకున్నారు. ఈ దంపతులకు ఆర్యన్, దక్ష అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత కొంతకాలం వేరే ప్రాంతంలో నివసించిన ఈ కుటుంబం, ఏడాది క్రితమే సంభల్‌కు తిరిగి వచ్చింది.

గతంలోనూ చెలరేగిన వివాదం
గత మహాశివరాత్రి సమయంలో తమన్నా మాలిక్ బుర్ఖా ధరించి హరిద్వార్ నుంచి గంగాజలం తెచ్చి శివునికి జలాభిషేకం చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దుమారానికి దారితీసింది. పలువురు ముస్లిం నేతలు, మతగురువులు ఆమె చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. అయితే, తాను నిత్యం బుర్ఖా ధరిస్తానని, ఇందులో ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని తమన్నా అప్పట్లో స్పష్టం చేశారు.

రూ.20 వేల పూచీకత్తుతో నోటీసులు
ఈసారి సావన్ మాసంలో మళ్లీ కన్వర్‌యాత్ర చేపట్టాలని తమన్నా నిర్ణయించుకోవడంతో స్థానిక యంత్రాంగంలో టెన్షన్ మొదలైంది. రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండేందుకు, అస్మోలి పోలీస్ స్టేషన్ నివేదిక ఆధారంగా సంభల్  ఎన్‌డీఎం వికాస్ చంద్ర కోర్టు ద్వారా చర్యలు చేపట్టారు. తమన్నా మాలిక్, అమన్‌ త్యాగిలకు శాంతిభద్రతల నోటీసులు జారీ చేసి, రూ.20 వేల చొప్పున పూచీకత్తుతో నోటీసులు జారీ చేశారు.

కోర్టుకు వెళ్లని తమన్నా... భర్త అమన్‌ త్యాగి కౌంటర్
భద్రతా కారణాల దృష్ట్యా తమన్నా మాలిక్‌ను కోర్టుకు తీసుకురాలేనని ఆమె భర్త అమన్‌ త్యాగి తెలిపారు. అయితే, నోటీసులు అందిన వెంటనే తాను కోర్టులో హాజరై బెయిల్ పొందానని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి నచ్చిన దుస్తులు ధరించే హక్కు కల్పించిందని, కాబట్టి తమన్నా బుర్ఖా వేసుకున్నా లేదా కాషాయ వస్త్రాలు ధరించినా కన్వర్‌ యాత్ర ఆపేది లేదని ఆయన తేల్చిచెప్పారు.

మరో మహిళకు మద్దతుగా యాత్ర
గజియాబాద్‌కు చెందిన షబీనా బానో/అనీషా బానో అనే మహిళ కన్వర్‌ యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారని, ఆమెకు మద్దతుగానే తమ తమన్నా కూడా యాత్రకు సిద్ధమయ్యారని అమన్‌ త్యాగి వివరించారు. ఎవరైనా మహిళల హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదని, తాము ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు.

ఈ వివాదంపై సంభల్ ఎస్‌డీఎం వికాస్ చంద్ర స్పందిస్తూ, గతంలో శాంతిభద్రతలకు విఘాతం కలగడంతో పోలీసుల నివేదిక మేరకే ఈ చర్యలు చేపట్టామని తెలిపారు. ఏ వ్యక్తి వేషధారణపై కూడా ఎలాంటి నిషేధం లేదని, ఎవరికి నచ్చిన పద్ధతిలో వారు కన్వర్‌ తీసుకురావచ్చని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు యంత్రాంగం ఈ దంపతులపై నిఘా ఉంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement