మీ పుట్టిన తేదీ వివరాలు చెప్పండి! | WhatsApp begins testing age checks for Indian users | Sakshi
Sakshi News home page

మీ పుట్టిన తేదీ వివరాలు చెప్పండి!

Aug 5 2026 6:06 AM | Updated on Aug 5 2026 6:06 AM

WhatsApp begins testing age checks for Indian users

వయసు నిర్ధారణకు మెసేజ్‌లు పంపుతున్న వాట్సాప్‌ 

డీపీడీపీ చట్టం అమలు కోసమే 

పుట్టిన తేదీ చెప్పడం ఐచ్చికమని స్పష్టీకరణ

న్యూఢిల్లీ: దేశీ వినియోగదారుల వయసును నిర్ధారించుకునేందుకు సోషల్‌ మెసేజింగ్‌ అప్లికేషన్‌ ‘వాట్సప్‌’ కొత్త కొత్త పద్ధతులను అన్వేషిస్తోంది. కొన్నింటిని పరీక్షిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచి్చన డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ (డీపీడీపీ) చట్టానికి అనుగుణంగా వాట్సప్‌ ఈ చర్య చేపట్టిన్టు తెలుస్తోంది. ‘‘మీ పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయండి’’అన్న సమాచారంతో వచి్చన వాట్సప్‌ మెసేజీలను కొందరు ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేయగా దీనిపై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ‘‘త్వరలో అమల్లోకి రానున్న భారతీయ చట్టాలు మీ వయసును అడుగుతున్నాయి’’అని కూడా వాట్సప్‌ తన సందేశంలో చెబుతోంది. అయితే ప్రస్తుతానికి ఇది ఐచ్చికమైన విషయం మాత్రమేనని, వయసు నిర్ధారణ చేస్తేనే వాట్సప్‌ వాడవచ్చు అన్న నిబంధన ఏదీ లేదని వాట్సప్‌ సంస్థ మంగళవారం తెలిపింది.

నిర్ధారణ అయిన వయసును ఇతర ప్లాట్‌ఫామ్‌లతో పంచుకోబోమని స్పష్టం చేసింది. వయసు నిర్ధారణ పరీక్షలు వాట్సప్‌ పనితీరుపై ఎలాంటి ప్రభావమూ చూపవని కూడా తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఐటీ కార్యదర్శి ఎస్‌.కృష్ణన్‌ కూడా మంగళవారం వాట్సప్‌ సందేశాలను గమనించి.. ‘‘బహుశా రానున్న డీపీడీపీ చట్టానికి సంబంధించినది అయి ఉంటుందని చెప్పడం గమనార్హం. ఇందుకు సంబంధించిన తుది గడువు దగ్గరపడుతోంది కాబట్టి విషయం ఏమిటన్నది వారి ద్వారా కూడా తెలుసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. డిజిటల్‌ రూపంలో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని చట్టపరమైన అంశాల విషయంలో వాడేందుకు, వ్యక్తుల హక్కులకు మధ్య సమతౌల్యత పాటించేందుకు కేంద్ర ప్రభుత్వపు డీపీడీపీ చట్టం ఉపయోగపడుతంది.

పద్దెనిమిది ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిని ఈ చట్టం కింద పిల్లలుగా పరిగణిస్తున్నారు. వీరి సమాచారం విషయంలో ఎలా నడుచుకోవాలన్న విషయమైన చట్టంలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. చట్టం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే సమయానికి పిల్లలు వాట్సప్‌ వాడేందుకు తల్లిదండ్రులు లేదా సంరక్షకుడి అనుమతితోనే వారి వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్‌ చేయాలి. ఇందుకు తగ్గ సాంకేతిక, వ్యవస్థాగతమైన ఏర్పాట్లను ప్లాట్‌ఫామ్స్‌ సిద్ధంగా ఉంచాలి. పిల్లల సమాచారాన్ని వారికి హాని కలిగించే విషయాలకు వాడకూడదు. ప్లాట్‌ఫామ్‌లు పిల్లల ప్రవర్తనను గమనించే ఎలాంటి ఏర్పాట్లూ చేయకూడదు.

వారిని దృష్టిలో ఉంచుకుని ప్రకటనలు గుప్పించడమూ నేరమే. చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకపోతే భారీ స్థాయి జరిమానాలు పడే అవకాశముంది. అనుమతికి సంబంధించిన నిబంధనలు వచ్చే ఏడాది మే నాటికి అమల్లోకి రావచ్చునని నిపుణులు భావిస్తున్నారు. అయితే దీనికి ఇంకా తొమ్మిది నెలలు గడువు ఉన్నప్పటికీ వాట్సప్‌ వంటి ప్లాట్‌ఫామ్స్‌ ఇప్పటి నుంచే వాటి అమలుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే వాట్సప్‌ ఇటీవల ప్రకటించి వాయిదా వేసిన యూజర్‌నేమ్‌ ఫీచర్‌ విషయమై వాట్పప్‌కు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఒక నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ విషయంలో తదుపరి చర్యలు ఏమిటన్న ప్రశ్నకు ఐటీ శాఖ కార్యదర్శి ఎస్‌.కృష్ణన్‌ సమాధానమిస్తూ.. ‘‘ఈ అంశం వాట్సప్‌తోపాటు అన్ని మెసేజింగ్‌ అప్లికేషన్లకూ వర్తిస్తుంది. దీంట్లో రెండు విషయాలున్నాయి. యూజర్‌నేమ్‌ ఫీచర్‌ వల్ల ఇతరులను కాపీ కొట్టే అవకాశం. రెండోది ప్రైవసీ. ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకోవాలి’’అన్నారు. ప్లాట్‌ఫామ్స్‌ ఈ విషయంలో ఏమనుకుంటున్నాయో తెలుసుకున్న తరువాత అందరికీ ప్రామాణికమైన మార్గదర్శకాలు జారీ చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement