దేశంలో అన్నింటికీ ఆధార్ కార్డునే ఆధారంగా చాలా మంది పరిగణిస్తుంటారు. అయితే మోటారు ప్రమాద పరిహారం (Motor Accident Compensation) నిర్ణయించే సమయంలో బాధితుడి వయస్సును కేవలం ఆధార్ కార్డు ఆధారంగా నిర్ణయించరాదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ ప్రధానంగా గుర్తింపు పత్రం మాత్రమేనని, అది పుట్టిన తేదీకి తుది, నిర్ధారిత ఆధారంగా పరిగణించలేమని పేర్కొంది.
వయస్సు నిర్ధారణ కోసం జనన ధ్రువీకరణ పత్రం, పాఠశాల రికార్డులు, వైద్య పత్రాలు వంటి చట్టబద్ధమైన, విశ్వసనీయ ఆధారాలనే పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఈ తీర్పు గతంలో సుప్రీంకోర్టు వెల్లడించిన న్యాయసూత్రాలకు అనుగుణంగానే ఉందని కోర్టు పేర్కొంది.
జస్టిస్ సచిన్ సింగ్ రాజ్‌పుత్ విచారించిన మూడు అనుబంధ మోటారు ప్రమాద అప్పీళ్లలో ఈ కీలక తీర్పు వెలువడింది. గాయపడిన రంజిత్ భుంజియా వయస్సును మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) కేవలం ఆధార్ ఆధారంగా 68 ఏళ్లుగా పరిగణించింది. దీంతో భవిష్యత్ ఆదాయ నష్టాన్ని లెక్కించేందుకు తక్కువ మల్టిప్లయర్ వర్తింపజేసి పరిహారాన్ని తగ్గించింది.
అయితే హైకోర్టు పిటిషన్, వైద్య రికార్డులు, వైకల్య ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి బాధితుడి వయస్సు 61–65 సంవత్సరాల మధ్య ఉంటుందని నిర్ధారించింది. దాంతో పరిహారాన్ని రూ.96,400 నుంచి రూ.3.90 లక్షలకు పెంచింది. ఇదే ప్రమాదంలో మరణించిన మరో ఇద్దరు బాధితుల కుటుంబాలకు కూడా పరిహారాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేసులో బీమా కంపెనీల బాధ్యతపై కూడా హైకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. ప్రీమియం చెల్లించిన సమయం నుంచి కాకుండా, బీమా పాలసీలో పేర్కొన్న తేదీ, సమయం నుంచే బీమా ఒప్పందం అమల్లోకి వస్తుందని తెలిపింది. కాబట్టి ప్రమాదం జరిగిన సమయంలో పాలసీ ఇంకా అమల్లోకి రాకపోతే, ప్రీమియం ముందే చెల్లించినా బీమా సంస్థపై బాధ్యత ఉండదని తీర్పులో పేర్కొంది.
మరో ముఖ్యమైన అంశంగా, ఒకే మోటార్‌సైకిల్‌పై ముగ్గురు ప్రయాణించడం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనే అయినప్పటికీ, ఆ కారణం వల్లే ప్రమాదం జరిగిందని నిరూపించకపోతే దానిని "సహకార నిర్లక్ష్యం" (Contributory Negligence)గా పరిగణించి పరిహారం తగ్గించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనకు ప్రమాదంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నప్పుడే పరిహారంపై ప్రభావం చూపుతుందని న్యాయస్థానం పేర్కొంది.


