ఆ నేరగాడు చిక్కినట్టేనా! | Sakshi Editorial On Chhattisgarh Mahadev App Scam Issue | Sakshi
Sakshi News home page

ఆ నేరగాడు చిక్కినట్టేనా!

Jul 14 2026 1:07 AM | Updated on Jul 14 2026 1:07 AM

Sakshi Editorial On Chhattisgarh Mahadev App Scam Issue

ఎనిమిదేళ్లుగా ఎన్నికల రుతువులో రాజకీయ పక్షాలు పరస్పరం బురద చల్లుకోవడానికి పనికొచ్చే అంశంగా మిగిలిపోయిన మహదేవ్‌ యాప్‌ స్కాంలో ఎట్టకేలకు సూత్రధారుల్లో ఒకడైన సౌరభ్‌ చంద్రశేఖర్‌ ఒమన్‌ పోలీసులకు ఇటీవల చిక్కడం కీలక పరిణామం. ఛత్తీస్‌గఢ్‌ కేంద్రంగా పలు రాష్ట్రాల్లో అమాయక పౌరులనుంచి రూ. 6,000 కోట్లు అపహరించిన ఈ యాప్‌ మన ఆర్థికవ్యవస్థ బలహీనతకు ఆనవాలు. ఈ సొమ్మంతా బ్యాంకుల ద్వారానే నేరగాళ్లకు చేరడం చిన్న విషయం కాదు. పలు రాజకీయ పక్షాల నాయకులు, బాలీవుడ్‌ ప్రముఖులు, ఉన్నతాధికారుల ప్రమేయంతోనే ఆ యాప్‌ వేల కోట్లు కొల్లగొట్టిందని జనం చెప్పుకోవటమే తప్ప అందుకు సాక్ష్యాధారాలు లేవు. 

సీబీఐ, ఈడీ వంటి సంస్థలు అనేకచోట్ల దాడులు చేశాయి. కొంతమందిని అరెస్టు చేశాయి. ఛత్తీస్‌గఢ్‌ అప్పటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు భూపేష్‌ బాఘెల్‌కు రూ. 508 కోట్లు ఇచ్చానంటూ 2023 నవంబర్‌లో అక్కడి అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ కేసులో అరెస్టయిన ఆసిమ్‌ దాస్‌ అనే వ్యక్తి అంగీకరించాడని ఈడీ ప్రకటించినా... రాజకీయ దుమారం రేగటం మినహా జరిగిందేమీ లేదు. ఆ వెంటనే కాంగ్రెస్‌ నేతలు తమ వంతుగా బీజేపీ నాయకులపై ఆరోపణలు చేశారు. తనతో బలవంతంగా ఆ మాట చెప్పించారని  ఆ నిందితుడు కోర్టుముందు వాంగ్మూలం ఇవ్వడంతో అది కాస్తా చల్లారింది. ఈలోగా ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకొచ్చింది. పూర్వాశ్రమంలో ఒక జ్యూస్‌ సెంటర్‌ యజమాని అయిన సౌరభ్‌ చంద్రశేఖర్‌ ఎవరి ప్రమేయమూ లేకుండా ఎదిగాడంటే ఎవరూ నమ్మరు.

మహదేవ్‌ యాప్‌ కొల్లగొట్టిన మొత్తం రూ. 6,000 కోట్లు అంటున్నా అంతకు మించి ఉండొచ్చు కూడా. ప్రపంచమంతా అబ్బురంగా మాట్లాడుకునే బూర్జ్‌ ఖలీఫాలో అత గాడికి పలు ఫ్లాట్లు ఉన్నాయని చెబుతారు. ఇవిగాక వేరే దేశాల్లో విలాసవంతమైన భవంతులు, హోటళ్లు, వందల కోట్లలో నడిచే ఇతర వ్యాపారాలు సరేసరి. చదువుసంధ్యలు పెద్దగాలేని, మూడు పదులు కూడా దాటని సౌరభ్‌ స్వల్పకాలంలోనే ఇంత కొల్లగొట్ట డానికి ఊతమిచ్చింది మనుషుల్లోని దురాశ, వ్యవస్థల నిరాసక్తత. ఎన్నికల్లో ఎవరు నెగ్గుతారన్న ఆసక్తి, రేసు గుర్రాల్లో ఏది విజేతగా నిలుస్తుందనే అంచనాలు మహదేవ్‌ యాప్‌కి పెద్ద మేత. మ్యాచ్‌ ఫిక్సింగ్‌లు సరేసరి. 

అరెస్టులూ, పరస్పర ఆరోపణలతో ఇంత దుమారం రేగినా... 2023లో ఆ యాప్‌ను నిషేధించినా, మొన్న ఏప్రిల్‌లో జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొత్త డొమైన్‌లతో ఆ యాప్‌ రెండు చేతులా కోట్ల రూపాయలు దండుకుంది. బుకీల ద్వారా పాలకపక్షంగా రాబోతున్న దెవరో, రెండో స్థానంలో ఉండబోయే పక్షానికి ఎన్ని స్థానాలొస్తాయో కాకరేపడం, బెట్టింగ్‌లు జోరందుకోవటం, సొమ్ములు కొల్లగొట్టడం, దక్షిణాఫ్రికా, కెన్యా, బ్యాంకాక్,హాంకాంగ్‌లనుంచి దీన్నంతా చక్కబెట్టడం ఈ దొంగల నిర్వహణాశైలి. సౌరభ్‌ పెళ్లికే రూ. 200 కోట్లు ఖర్చయిందనీ, బాలీవుడ్‌ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు ప్రదర్శనలిచ్చారనీ సీబీఐ ఆరాలో తేలింది. 

ఇప్పుడు సౌరభ్‌ను పట్టుకున్న ఒమన్‌తో మన దేశానికి నేరస్థుల అప్పగింత ఒప్పందం ఉంది. కానీ ఇక్కడికి రప్పించాలంటే అతనిపై ఉన్న కేసులు, సాక్ష్యాధారాలు, కోర్టు రికార్డులు సమర్పించాలి. ఒప్పందం పరిధిలోకి అవి వస్తాయో రావో అక్కడి న్యాయ స్థానాలు తేల్చాలి. రెండేళ్ల క్రితం యూఏఈలో అరెస్టయినా ఆ దేశంతో నేరస్థుల అప్పగింత ఒప్పందం లేకపోవటంతో విడుదలయ్యాడు. సౌరభ్‌ సహచరుడు రవి ఉప్పల్‌ ఆచూకీ లేకుండాపోయాడు. అతగాడు వనౌటులో ఉన్నాడని మన నిఘా సంస్థలు అంచనా వేస్తున్నా, నిర్ధారణగా తేల్చలేకపోయాయి. 

జూదం దగ్గర మొదలైన దర్యాప్తు... హవాలా రాకెట్, నకిలీ కంపెనీలు, విదేశీ సంస్థల్లో పెట్టుబడులు, స్థిరాస్తులు వగైరాలన్నీ బయటపడ్డాక దాని విస్తృతి పెరిగింది. ఇలాంటి ఆర్థిక నేరగాళ్ల ఆచూకీ రాబట్టడంలో, ఇక్కడికి రప్పించడంలో వ్యవస్థలు విఫలం కావటంవల్ల ఇలాంటివారు మరింత మంది పుట్టుకొస్తున్నారు. సౌరభ్‌ను సత్వరం తీసుకు రాగలిగితేనే నేరగాళ్లలో భయం ఏర్పడుతుంది. అతగాడే కాదు... రకరకాల పేర్లతో పలు రాష్ట్రాల్లో అనేకానేక సంస్థలు వెలుస్తున్నాయి. జనాన్ని నిలువుదోపిడీ చేస్తున్నాయి. దీనికి అడ్డుకట్టవేయడం తక్షణ కర్తవ్యం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement