టీటీడీ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లకు పైగా టోకరా! | Fake TTD Job Scam Exposed, Man Dupes Job Seekers Cheats Rs 5 Crore Fake Appointment Letters, More Details Inside | Sakshi
Sakshi News home page

టీటీడీ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లకు పైగా టోకరా!

Jul 10 2026 10:45 PM | Updated on Jul 11 2026 11:58 AM

Fake TTD Job Scam Busted man Dupes Job Seekers Cheats Rs 5 Crore Fake Appointment Letters

ఒక్కో అభ్యర్థి నుంచి రూ.15 లక్షల–రూ.50 లక్షల వరకు వసూలు 

టీటీడీ నకిలీ లోగో, ఈవో స్టాంపులతో దొంగ నియామకపత్రాల అందజేత 

తిరుపతి ఈస్ట్‌ పోలీసులకు బాధితుల ఫిర్యాదు

తిరుపతి క్రైం: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నిరుద్యోగులను నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. టీటీడీ నకిలీ లోగో, ఈవో స్టాంపులతో దొంగ నియామకపత్రాలు అందించి మోసం చేశాడు. దీనిపై బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... కిరణ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం తిరుపతిలోని కొందరు నిరుద్యోగులను కలిసి తనను న్యాయవాదిగా పరిచయం చేసుకున్నాడు. 

టీటీడీలో ఉన్న అన్యమత ఉద్యోగుల స్థానంలో కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారని నమ్మించాడు. టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ విభాగం జీఎం సుబ్రహ్మణ్యం తనకు బాగా తెలుసునని, ఆయన ద్వారా ఆ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశలు కల్పించాడు. జూనియర్‌ అసిస్టెంట్‌తోపాటు ఇంకా రకరకాల పోస్టులు ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.50లక్షల వరకు వసూలు చేశాడు.  

నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చి.. 
మోసగాడు డబ్బులు తీసుకున్న అనంతరం టీటీడీ నకిలీ లెటర్‌ హెడ్, ఈవో స్టాంపు, సంతకంతో కూడిన అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందించాడు. అయితే, ఉద్యోగాల్లో చేరిక (జాయినింగ్‌) ప్రక్రియ కొనసాగుతోందంటూ కొంతకాలం ఆగాలని చెప్పాడు. చాలారోజులు ఎదురు చూసిన బాధితులకు అనుమానం వచ్చి టీటీడీలో ఉద్యోగ నియామకాల గురించి ఆరా తీయగా... ఎటువంటి పోస్టులు భర్తీ చేయలేదని తేలింది. దీంతో తాము మోసపోయామని ఇద్దరు బాధితులు శుక్రవారం తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

ఒక యువకుడికి జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టు వచ్చినట్లు ఇచ్చిన నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ 

తామిద్దరం, తమకు తెలిసిన మరికొందరు కలిపి రూ.కోటి వరకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు కిరణ్‌కుమార్‌రెడ్డి ఎవరు? ఏం చేస్తుంటారు? టీటీడీ నకిలీ లోగో, లెటర్‌ హెడ్, ఈవో స్టాంప్‌ తయారు చేయడం, దొంగ నియామకపత్రాలు అందించడం, పెద్ద ఎత్తున ఆరి్థక లావాదేవీలు సాగించడం వెనుక ఇంకా ఎవరి ప్రమేయం అయినా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా, 25 మంది వరకు బాధితులు ఉంటారని, వారి నుంచి కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement