breaking news
fake appointment letters
-
టీటీడీ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లకు పైగా టోకరా!
తిరుపతి క్రైం: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నిరుద్యోగులను నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. టీటీడీ నకిలీ లోగో, ఈవో స్టాంపులతో దొంగ నియామకపత్రాలు అందించి మోసం చేశాడు. దీనిపై బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... కిరణ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం తిరుపతిలోని కొందరు నిరుద్యోగులను కలిసి తనను న్యాయవాదిగా పరిచయం చేసుకున్నాడు. టీటీడీలో ఉన్న అన్యమత ఉద్యోగుల స్థానంలో కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారని నమ్మించాడు. టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం సుబ్రహ్మణ్యం తనకు బాగా తెలుసునని, ఆయన ద్వారా ఆ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశలు కల్పించాడు. జూనియర్ అసిస్టెంట్‌తోపాటు ఇంకా రకరకాల పోస్టులు ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.50లక్షల వరకు వసూలు చేశాడు. నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి.. మోసగాడు డబ్బులు తీసుకున్న అనంతరం టీటీడీ నకిలీ లెటర్ హెడ్, ఈవో స్టాంపు, సంతకంతో కూడిన అపాయింట్మెంట్ లెటర్లు అందించాడు. అయితే, ఉద్యోగాల్లో చేరిక (జాయినింగ్) ప్రక్రియ కొనసాగుతోందంటూ కొంతకాలం ఆగాలని చెప్పాడు. చాలారోజులు ఎదురు చూసిన బాధితులకు అనుమానం వచ్చి టీటీడీలో ఉద్యోగ నియామకాల గురించి ఆరా తీయగా... ఎటువంటి పోస్టులు భర్తీ చేయలేదని తేలింది. దీంతో తాము మోసపోయామని ఇద్దరు బాధితులు శుక్రవారం తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఒక యువకుడికి జూనియర్ అసిస్టెంట్ పోస్టు వచ్చినట్లు ఇచ్చిన నకిలీ అపాయింట్మెంట్ లెటర్ తామిద్దరం, తమకు తెలిసిన మరికొందరు కలిపి రూ.కోటి వరకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు కిరణ్‌కుమార్‌రెడ్డి ఎవరు? ఏం చేస్తుంటారు? టీటీడీ నకిలీ లోగో, లెటర్ హెడ్, ఈవో స్టాంప్ తయారు చేయడం, దొంగ నియామకపత్రాలు అందించడం, పెద్ద ఎత్తున ఆరి్థక లావాదేవీలు సాగించడం వెనుక ఇంకా ఎవరి ప్రమేయం అయినా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా, 25 మంది వరకు బాధితులు ఉంటారని, వారి నుంచి కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. -
ఆర్మీ ఉద్యోగాల పేరుతో మోసం...
సాక్షి, హైదరాబాద్ : ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లాన్స్ నాయక్లాన్స్ అనే ఆర్మీ అధికారి చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ అపాయింట్మెంట్ కాపీలు ఇచ్చి మొహం చాటేయడంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆర్మీ అధికారిని శనివారం అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహరంలో లాన్స్ నాయక్లాన్స్తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, తదుపరి విచారణ కొరకు నిందితుల్నికోర్టులో హాజరు పరచామని వారు తెలిపారు. -
మాజీ సీఎం కిరణ్ బంధువునంటూ టోకరా
ఎస్ఐ, వీఆర్వో అభ్యర్థుల వద్ద రూ.55 లక్షల వసూలు సీఎం పేషీ ఇచ్చినట్టుగా నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్ కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి బంధువునని నమ్మించి.. ఉద్యోగాల పేరిట పలువురు ఎస్ఐ, వీఆర్వో అభ్యర్థులను నిలువునా ముంచాడో కేటుగాడు. ఎస్ఐగా ఎంపికైనట్లు సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో అతడు అభ్యర్థులకు నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం గమనార్హం. నిందితుడు నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల పేరుతో సుమారు రూ.55 లక్షలు దండుకుని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నగర సీసీఎస్ పోలీసులు సోమవారం చీటింగ్ కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పీలేరు మండలం గ్యారంపల్లికస్ప గ్రామానికి చెందిన జగన్మోహన్రెడ్డి హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో రెండేళ్ల క్రితం ప్రైవేట్ కార్యాలయం తెరిచాడు. కడప జిల్లా బద్వేల్‌కు చెందిన విజయనర్సింహా రెడ్డి, రైల్వే కోడూరుకు చెందిన నరేష్, చంద్రగిరికి చెందిన సుమతి ఎస్ఐ ఉద్యోగ పరీక్ష రాశారు. నల్లకుంటలో ఉండే రఘు తన స్నేహితుడు జగన్మోహన్రెడ్డి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి బంధువని, అతను ఎస్ఐ పోస్టులు ఇప్పిస్తాడని పై ముగ్గురితో నమ్మబలికాడు. 2013లో జగన్మోహన్రెడ్డిని కలుసుకున్నారు. ఒక్కో పోస్టుకు రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకుని అడ్వాన్స్‌గా ముగ్గురి నుంచి రూ.15 లక్షలు తీసుకున్నాడు. అలాగే వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి రూ.33 లక్షలు తీసుకున్నాడు. ఎస్ఐ అభ్యర్థులుగా సెలక్ట్ అయినట్లు సీఎం కార్యాలయం పేరుపై ఎస్ఐ అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చాడు. తీరా అవి నకిలీవని తెలుసుకున్న అభ్యర్థులు డబ్బులకోసం నిలదీయగా.. జగన్మోహన్రెడ్డి తన కార్యాలయం ఖాళీ చేసి పరారయ్యాడు. బాధితులు నగర సీసీఎస్ డీసీపీ పాలరాజుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చీటింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా... కారు విక్రయిస్తానని జగన్మోహన్రెడ్డి రూ.2 లక్షలు తీసుకుని ఉడాయించాడని చిత్తూరుకు చెందిన మురళి, డాక్టర్ పోస్టు ఇప్పిస్తానని తమ వద్ద నుంచి రూ.5 లక్షలు తీసుకున్నాడని రైల్వే కోడూరుకు చెందిన హెడ్మాస్టర్ సుబ్బారాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


