సాక్షి, తాడేపల్లి: పోర్టులు, భూములను తమ వారికి కట్టబెట్టటానికే చంద్రబాబు కేబినెట్ సమావేశమంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐదుగురు మంత్రులు గైర్హాజరయ్యారంటే ఎంత నాన్ సీరియస్‌గా జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేబినెట్ సమావేశంలో ప్రజలకు మేలు చేసే అంశాలపై చర్చించటం మానేశారంటూ ఆయన దుయ్యబట్టారు.
‘‘కేబినెట్‌కి డీజీపీ వెళ్లి సోషల్ మీడియా కట్టడిపై మాట్లాడటం ఏంటి?. టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులతో మా పార్టీ నేతలను తిట్టిస్తున్నారు. జుగుప్సాకరంగా పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేదు. కానీ మావారిపై అక్రమ కేసులు పెట్టి 1,394 మందిని అరెస్టు చేశారు. సోషల్ మీడియా అంటే చంద్రబాబు భయపడిపోతున్నారు. అందుకే టాస్క్ ఫోర్స్ కూడా పెడుతున్నారు. గాదె సాయికృష్ణను దారుణంగా లాకప్ డెత్ చేస్తే ఈ డీజీపీ ఎందుకు మాట్లాడలేదు?’’ అంటూ అంబటి ప్రశ్నించారు.
‘‘క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు?. ఇలాంటి వాటిపై కేబినెట్‌లో చర్చించరా?. ఉండవల్లిలో పోలీసు కానిస్టేబుల్ తల పగలకొట్టిన టీడీపీ కార్యకర్తలపై ఎందుకు కేసు పెట్టలేదు?. ఉత్తుత్తి కేబినెట్‌లు కాకుండా ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ కేబినెట్‌కి ఎందుకు రావటం లేదు?. ఆ కారణాలు ఏంటో సీఎం, డిప్యూటీ సీఎం సమాధానం చెప్పాలి.’’ అని అంబటి నిలదీశారు.
‘‘రావణ్‌కు అన్ని కేసుల్లోనూ బెయిల్ వస్తోందని ఉపా చట్టం ప్రయోగించారు. రావణ్ టీమ్‌లోని ఒక మహిళ జగన్‌ని కలిసి న్యాయ సహాయం కావాలని కోరారు. వైఎస్ జగన్ సరే అన్నారు.. అంతే తప్ప రావణ్‌కు మాకు ఎలాంటి సంబంధం లేదు. టీడీపీ కార్యకర్తలు అడిగినా న్యాయ సహాయం చేస్తాం. తీవ్ర వాదుల మీద పెట్టాల్సిన చట్టాన్ని అమాయకులపై పెట్టటం ఏంటి?. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటే ఇదే’’ అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.


