మరో 'మాస్టర్' స్కామ్! | Another episode in the Amaravati capital high tech real estate scam | Sakshi
Sakshi News home page

మరో 'మాస్టర్' స్కామ్!

Jul 13 2026 3:22 AM | Updated on Jul 13 2026 3:22 AM

Another episode in the Amaravati capital high tech real estate scam

అమరావతి హైటెక్‌ రియల్‌ ఎస్టేట్‌ కుంభకోణంలో మరో అంకం

రూ.45.14 కోట్లతో సుర్బానా–జురాంగ్‌ కన్సార్షియంకు పనులు

రెండోవిడత భూసమీకరణ గ్రామాల్లో మాస్టర్‌ప్లాన్‌ తయారీ బాధ్యత..

తొలి విడత భూముల్లో మాస్టర్‌ప్లాన్‌ ఖర్చు రూ.12.32 కోట్లు

ఆ ప్లాన్‌లో లోపాల కారణంగా విద్యుత్‌లైన్లు మార్చినందుకు ఖజానాపై రూ.1,480 కోట్ల భారం

అయినా ఇçప్పుడు మళ్లీ అవే సింగపూర్‌ కంపెనీలకు మళ్లీ మాస్టర్‌ప్లాన్‌ పనులు

స్పోర్ట్స్‌ సిటీ పేరుతో ఏడు గ్రామాల్లో 20,494 ఎకరాల సమీకరణ

ఇంకా 43 గ్రామాల్లో 1.54 లక్షల ఎకరాలకు రాజధాని విస్తరణ

లక్షల ఎకరాలు సమీకరించి రూ.లక్షల కోట్లతో మౌలిక సదుపాయాలు సాధ్యమయ్యే పనేనా?

ఇప్పుడు సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నది 1,375 ఎకరాల్లోనే

వాటిని విజయవాడ–గుంటూరు మధ్య నిర్మించి ఉంటే రాజధాని ఈపాటికే పూర్తయ్యేది

మహానగరంగా రూపాంతరం చెంది.. రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజిన్‌గా మారేదంటోన్న నిపుణులు, మేధావులు

కానీ రైతుల భూములు భారీగా సమీకరించి అస్మదీయులకు కట్టబెట్టడం పైనే చంద్రబాబు చూపంతా 

2003లో అపద్ధర్మ సీఎంగా హైదరాబాద్‌లో ఐఎంజీ భారత్‌కు 850 ఎకరాలు రాసిచ్చేసిన చంద్రబాబు

ఇప్పుడు స్పోర్ట్స్‌ సిటీ పేరుతో భారీ ఎత్తున భూములు అస్మదీయునికి కట్టబెడతారంటోన్న నిపుణులు

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ.. రైతుల జీవితాలతో బాబు చెలగాటమాడుతున్నారంటూ విమర్శలు

సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని హైటెక్‌ రియల్‌ ఎస్టేట్‌ స్కామ్‌లో మరో అంకం మొదలైంది. స్పోర్ట్స్‌ సిటీ నిర్మాణం పేరుతో రెండో విడత ఇప్పటికే ఏడు గ్రామాల్లో 20,494 ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ (భూసమీకరణ) కింద సీఆర్‌డీఏ సమీకరిస్తోంది. ఇంటర్నేషనల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌తోపాటు భవిష్యత్‌లో 43 గ్రామాల్లో 1.54 లక్షల ఎకరాలకు రాజధానిని విస్తరించేందుకు ప్రణాళిక రచించింది. రెండో విడత సమీకరిస్తున్న గ్రామాలతోపాటు ఎయిర్‌పోర్టు, భవిష్యత్‌లో రాజధాని విస్తరించే 43 గ్రామాల్లోనూ మాస్టర్‌ ప్లాన్‌ తయారీ కోసం ఈ ఏడాది జనవరిలో టెండర్లు పిలిచింది. 

ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో వాటిని రద్దు చేసి.. ఫిబ్రవరిలో టెండర్లు పిలిచింది. వాటిని ఇటీవల ఆమోదించింది. మాస్టర్‌ ప్లాన్‌ తయారీ పనులను సింగపూర్‌కు చెందిన సుర్బానా–జురాంగ్‌ కన్సార్షియంకు రూ.45.14 కోట్లకు కట్టబెట్టింది. 2015లో 53,748 ఎకరాలలో రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ తయారీ బాధ్యతలను ఇదే కన్సార్షియంకు రూ.12.32 కోట్లకు అప్పగించడం గమనార్హం. ఈ మాస్టర్‌ ప్లాన్‌ లోపం వల్ల విద్యుత్‌ లైన్‌లు మార్చేందుకు రూ.1,480 కోట్లకుపైగా రాష్ట్ర ఖజానాపై భారం పడింది.. అయినా సరే రెండో విడత రాజధాని మాస్టర్‌ ప్లాన్‌నూ అదే సంస్థకు ప్రభుత్వం అప్పగించడం వెనుక కారణం ఏమిటన్నది బహిరంగ రహస్యమే. 

11 ఏళ్లుగా ప్రాథమిక దశ దాటని రాజధాని..
రాజధానిపై ముందే వందిమాగధులు, బినామీలకు లీకులు ఇచ్చి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి రైతుల నుంచి కారుచౌకగా భూములు కాజేసిన తర్వాత 2015లో గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అప్పట్లో 53,748 ఎకరాల్లో (217.23 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ప్రభుత్వ, అటవీ భూమిపోనూ 34,390 ఎకరాలను రైతుల నుంచి భూసమీకరణ ద్వారా సమీకరించింది. 

పల్లపు ప్రాంతం.. కొండవీటివాగు, పాలవాగు వరద ప్రభావిత ప్రాంతమైన ఆ భూమిలో రాజధాని నిర్మించడానికి కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున రూ.లక్ష కోట్లు అవసరం అవుతుందంటూ అప్పట్లో కేంద్రానికి సీఎం చంద్రబాబు డీపీఆర్‌ సమర్పించారు. కానీ.. 11 ఏళ్లవుతున్నా ఇప్పటికీ రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. 2014–19 మధ్య రాజధాని నిర్మాణానికి రూ.5,500 కోట్లు వ్యయం చేసినా.. శాశ్వత నిర్మాణం ఒక్కటంటే ఒక్కటీ కట్టలేదు.  తాత్కాలిక నిర్మాణాల ముసుగులో కాంట్రాక్టర్లతో కలిసి భారీ ఎత్తున దోచుకున్నారని.. షాపూర్‌జీ పల్లోంజీ నుంచి సీఎం వ్యక్తిగత కార్యదర్శి కమీషన్లు తీసుకుని ఐటీ శాఖకు పట్టుబడటాన్ని బట్టి చూస్తే రాజధాని నిర్మాణంపై చంద్రబాబు సర్కార్‌కు ఎంత చిత్తశుద్ధి ఉందన్నది అప్పట్లోనే స్పష్టమయ్యిందని ఆర్థిక నిపుణులు ఎత్తిచూపుతున్నారు. 

విజయవాడ–గుంటూరు మధ్య 1400 ఎకరాల్లోనే రాజధాని పూర్తయ్యేది..
ఇక 2024, జూన్‌ 12న మళ్లీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. అధికారంలోకి వచ్చి ఇప్పటికి 25 నెలలు పూర్తయింది. రాజధాని నిర్మాణ పనుల కోసం రూ.47,387 కోట్లు అప్పు తెచ్చి.. సుమారు రూ.60 వేల కోట్ల అంచనాతో పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. కానీ.. నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు సాగడం లేదని అధికారవర్గాలే చెబుతున్నాయి. తొలి విడత సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు పదేళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని, ఆ పదేళ్లు కౌలు చెల్లిస్తామని సీఆర్‌డీఏ చట్టం ద్వారా హామీ ఇచ్చారు. 

కానీ.. ఆ మేరకు హామీ అమలు చేయలేదు. దాంతో రైతులకు కౌలు చెల్లింపును మరో ఐదేళ్లు పొడిగించారు. ప్రస్తుతం అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, లోక్‌భవన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల క్వార్టర్స్‌సహా అన్ని ప్రభుత్వ భవనాలను నిర్మిస్తున్నది కేవలం 1,375 ఎకరాల్లోనే. రైతులకు ప్లాట్లు కేటాయించగా మిగిలిన భూములను అస్మదీయులు, బినామీలకు చెందిన సంస్థలకు అత్తెసరు ధరలకు కట్టబెడుతున్నారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. 

విజయవాడ–గుంటూరు మధ్య కోల్‌కత–చెన్నై జాతీయ రహదారికి సమీపంలో 1500 ఎకరాలను 2015లోనే సేకరించి.. అందులో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, అన్ని ప్రభుత్వ భవనాలను రూ.5 వేల కోట్లతో పూర్తి చేసే అవకాశం ఉండేదని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగి ఉంటే 2017 నాటికే రాజధాని పూర్తయ్యేదని.. ఈ పాటికి విజయవాడ–గుంటూరు కలిసిపోయి మహానగరంగా రూపాంతరం చెందేదని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజిన్‌గా మారేదని తేల్చిచెబుతున్నారు. 

తొలి విడతకు మూడింతలు పెద్దగా..
రాజధాని 29 గ్రామాలకే పరిమితమైతే చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుందని.. భూముల ధరలు పెరగాలంటే ఇంటర్నేషనల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్‌ సిటీ, స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌ రావాలని.. అందుకోసం రెండో విడత భూసమీకరణ తప్పదని సీఎం చంద్రబాబు తెగేసిచెప్పారు. అందులో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి మండలంలో నాలుగు గ్రామాలు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మూడు గ్రామాలు... వెరసి ఏడు గ్రామాల్లో స్పోర్ట్స్‌ సిటీ కోసం 20,494 ఎకరాల్లో (82.9 చదరపు కిలోమీటర్లు) భూసమీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 

ఇక గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, స్మార్ట్‌ ఇండస్ట్రీస్, భవిష్యత్‌ అవసరాల కోసం గుంటూరు జిల్లాలో గుంటూరు, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని మండలాలు, తాడికొండ, పల్నాడు జిల్లాలో అమరావతి, ఎడ్లపాడు, పెదకూరపాడు మండలాల్లో 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాలకు (626.67 చదరపు కిలోమీటర్లు) రాజధాని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 50 గ్రామాల్లో 709.57 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణానికి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించే పనులను సింగపూర్‌ సంస్థలకు అప్పగించింది.  

ఇందులో ఏడు గ్రామాల్లోని 20,494 ఎకరాలను తొలుత భూసమీకరణ చేసి.. ఆ తర్వాత అవసరమైనప్పుడు మిగతా భూమిని విడతల వారీగా సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. రహదారులు, వరద నీటి నియంత్రణ, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్‌ సౌకర్యం వంటి మౌలిక సదుపాయాల కల్పన.. ఆ పనులకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకోవడంతో పాటు ఇంకా ఇతర మార్గాల ద్వారా ఆర్థిక వనరుల సమీకరణ అవకాశాలను అన్వేషిస్తూ మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని నిర్దేశించింది. 

స్పోర్ట్స్‌ సిటీ పేరుతో బినామీలకే భూసంతర్పణ
ఉమ్మడి రాష్ట్రానికి అపద్ధర్మ సీఎంగా 2004, మే 13 వరకూ చంద్రబాబు ఉన్నారు. అప్పట్లో క్రీడల అభివృద్ధి పేరుతో హైదరాబాద్‌లో 850 ఎకరాల భూమిని (ప్రస్తుతం ఆ భూమి ధర రూ.లక్ష కోట్లు) బిల్లీ రావుకి అప్పటికప్పుడు ఏర్పాటుచేసిన ఐఎంజీ భారత్‌ అనే సంస్థకు కట్టబెట్టేశారని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆ భూకేటాయింపులను రద్దు చేసి రూ.లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని పరిరక్షించారని ప్రశంసిస్తున్నారు. అమరావతి రాజధానిలోనూ స్పోర్ట్స్‌ సిటీని 2,500 ఎకరాల్లో నిర్మిస్తామని మంత్రి నారాయణ పలు సందర్భాల్లో చెప్పారు. 

స్పోర్ట్స్‌ సిటీ ముసుగులో బిల్లీ రావు వంటి బినామీలకే వేలాది ఎకరాల భూములను కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. రాజధానికి అత్యంత సమీపంలో గన్నవరం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ఇప్పటికే ఉంది. ఆ ఎయిర్‌పోర్టుకూ రాజధానికి అనుసంధానం చేస్తూ వెస్ట్రన్‌ బైపాస్‌ నిర్మాణం కూడా పూర్తయింది. ఇక రాజధానికి కొత్తగా ఎయిర్‌పోర్టు అవసరం లేదు. 

కానీ.. ఇంటర్నేషనల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు కోసం ఐదు వేల ఎకరాల భూమి అవసరమని మంత్రి నారాయణ పదే పదే చెబుతున్నారు. అందుకోసం మరో విడత భూసమీకరణ చేసి.. ఆ భూమిని మరో బినామీకి కట్టబెడతారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. హైటెక్‌ రియల్‌ ఎస్టేట్‌ స్కామ్‌ కోసం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ.. రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ నిపుణులు, మేధావులు, రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రం..
రాజధాని కోసం ఇప్పటికే సమీకరించిన 53,748 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఎకరానికి సగటున రూ.2 కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లు అవసరమని 2016–18 మధ్య కేంద్రానికి ప్రభుత్వం డీపీఆర్‌లు పంపింది. గతేడాది ఏప్రిల్‌ 16న రాజధాని తొలి దశ నిర్మాణానికే రూ.77,249 కోట్లు అవసరమని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్‌ ఇచ్చారు.  ప్రస్తుత ధరల ప్రకారం 1.75 లక్షల ఎకరాల్లో రాజధానిని విస్తరించాలంటే మౌలిక సదుపాయాల కల్పనకే ప్రస్తుత ధరల ప్రకారం రూ.3.50 లక్షల కోట్లు అవసరం. ఇటీవల బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ధికి వందేళ్ల సమయం పడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. 

తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం రూ.లక్షల కోట్లకు చేరుతుందని అధికారవర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఈ లెక్కన రాజధానిని 1.75 లక్షల ఎకరాలకు విస్తరించే పనులు పూర్తి కావాలంటే ఇంకెన్ని వందలేళ్లు పడతాయి? ఇంకెన్ని రూ.లక్షల కోట్లు వ్యయం అవుతుంది? ఇంకెన్ని రూ.లక్షల కోట్లు అప్పు తేవాలని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం పేరుతో తెచ్చే అప్పులు పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement