‘రైతుల బతుకులపై చంద్రబాబు దండయాత్ర’ | Ysrcp Legal Cell Manohar Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘రైతుల బతుకులపై చంద్రబాబు దండయాత్ర’

Jul 12 2026 4:22 PM | Updated on Jul 12 2026 4:31 PM

Ysrcp Legal Cell Manohar Reddy Comments On Chandrababu

సాక్షి, తాడేపల్లి: రైతుల బతుకుల మీద చంద్రబాబు దండయాత్ర చేశారని.. వందలాది మంది పోలీసులతో ఉండవల్లి రైతుల భూములను లాగేసుకున్నారని వైస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ భూముల కేసు హైకోర్టులో ఉండగానే బలవంతపు స్వాధీనం అన్యాయం. తుది తీర్పు రాకముందే భూములపై బాబు సర్కార్‌ దుర్మార్గపు చర్యలు అంటూ దుయ్యబట్టారు.

‘‘చంద్రబాబు కరకట్ట బంగ్లా సమీపంలోనే ఈ దుర్మార్గం జరిగింది. జనవరి 8 భూసేకరణ నోటిఫికేషన్‌ను రైతులు  హైకోర్టులో సవాలు చేశారు. భూ సేకరణకు పరిపాలనా అనుమతి లేదని రైతులు కోర్టు దృష్టికి తెచ్చారు. న్యాయపరమైన అంశాలను లోతుగా పరిశీలించాల్సి ఉందని హైకోర్టు చెప్పింది. భూ సేకరణ ప్రక్రియ, అవార్డు రెండూ తుది తీర్పునకు లోబడి ఉంటాయని కూడా చెప్పింది. తుది విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఆ భూముల్లోకి బుల్డోజర్లు పంపారు. రైతులు స్వచ్చందంగా ఇస్తే తీసుకోవాలి. కానీ ఇలా బెదిరించి లాక్కుంటారా?’’ అని మనోహర్‌రెడ్డి నిలదీశారు.

‘‘అప్పటికప్పుడు అవార్డు ప్రకటించి భూములు లాక్కోవటం దుర్మార్గం. ప్రత్యామ్నాయం కూడా చూపకుండా భూమి లాక్కున్నారు. రైతులను తీవ్రంగా క్షోభ పెట్టారు. రైతులు కోర్టుకు వెళ్లకుండా శని, ఆదివారం చూసి భూముల్లోకి వచ్చారు. చంద్రబాబు ప్రభుత్వానికి కోర్టులపై గౌరవం ఉంటే ఇలా చేస్తారా?. ఉండవల్లిలో ఎకరం రూ.8 కోట్లు ఉంది. కానీ రూ.2.60 కోట్లు మాత్రమే ప్రభుత్వం పరిహారం ఎలా ఇస్తారు?. చంద్రబాబు బినామీలు ఆ చుట్టుపక్కలే రూ.8 కోట్ల చొప్పున కొన్నారు. మరి రైతులకు ఆ విధంగా పరిహారం ఎందుకు ఇవ్వటం లేదు?

..రైతుల నుంచి భూములు లాక్కుని ఎవరికి కట్టబెట్టబోతున్నారు?. రానున్న రోజుల్లో ఉండవల్లి గ్రామమే కనుమరుగు కాబోతోంది. ఇప్పటికైనా బలవంతపు భూసేకరణను నిలిపేయాలి. హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు భూముల్లోకి రాకూడదు. పంటలను ధ్వంసం చేయించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఉండవల్లి, పెనుమాక ప్రాంతంలో టీడీపీ నేతలు కొన్న భూముల వివరాలు బయట పెట్టాలి’’ అని మనోహర్‌రెడ్డి డిమాండ​ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement