ముంబై: ఆయన ఓ కీలక రాజకీయ నేత. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా ప్రజాప్రతినిధిగా సేవలందించారు. అలాంటి నేత కుటుంబంపై ఇప్పుడు సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన మాజీ ఎంపీ వినాయక్ రౌత్ కుటుంబంపై ఆయన కోడలు గిరిజా రౌత్ పోలీసులను ఆశ్రయించారు. తన భర్తతో పాటు అత్తమామలు తనను తీవ్ర వేధింపులకు గురిచేశారని ఫిర్యాదులో ఆరోపించారు.
అనేకసార్లు ఆహారం కూడా ఇవ్వకుండా చిత్రహింసలు పెట్టారని, క్షుద్రపూజల పేరుతో బలవంతంగా ఆవు మూత్రం తాగించడమే కాకుండా, తన జుట్టును కూడా సేకరించారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు మహారాష్ట్రలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
గిరిజా రౌత్ ఫిర్యాదు ప్రకారం.. వివాహం అనంతరం హనీమూన్‌కు వెళ్లిన సమయంలోనే తన భర్త గీతేష్ రౌత్ తనను దగ్గరకు రానివ్వలేదని ఆరోపించారు. శారీరకంగా దగ్గరవడానికి ప్రయత్నిస్తే, విదేశాల్లో హనీమూన్ చేసుకుందామని, భారత్‌లో వద్దని చెప్పేవారని పేర్కొన్నారు.
హనీమూన్ ముగించుకుని స్వగ్రామానికి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లో అందరి ముందు తనను అవమానించారని, నెమ్మదిగా నడుస్తున్నాననే కారణంతో దుర్భాషలాడారని ఆరోపించారు. సమయం, సందర్భంతో సంబంధం లేకుండా తనపై ఆగ్రహం వ్యక్తం చేసేవారని, ఈ విషయాలు తన అత్తకు కూడా తెలుసునని ఫిర్యాదులో పేర్కొన్నారు.
2018లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కూడా తన భర్త తనను దూరం పెట్టడం కొనసాగించాడని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రశ్నించగా తనపై దాడి చేసి, శారీరకంగా దగ్గరయితే చనిపోతానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
భర్తతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా తనను మానసికంగా వేధించారని, దురుసుగా ప్రవర్తించారని, గృహహింసకు పాల్పడ్డారని, పలుమార్లు ఇంటి నుంచి పంపించేశారని గిరిజా రౌత్ ఆరోపించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వినాయక్ రౌత్ ఉద్ధవ్ ఠాక్రేకు సన్నిహిత నేతగా గుర్తింపు పొందారు. అయితే ఈ ఆరోపణలపై వినాయక్ రౌత్ లేదా ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు.


