కేతన్ అగర్వాల్ హత్య కేసులో నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్! | Lohagad Fort Case Update, Siya Goyal Claims Ketan Agarwal Threatened Her Before Death, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

కేతన్ అగర్వాల్ హత్య కేసులో నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్!

Jun 26 2026 9:55 AM | Updated on Jun 26 2026 11:52 AM

Siya Goyal Reveals Ketan Agarwal Threats Before Lohagad Fort incident

ముంబై: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కేతన్‌ అగర్వాల్‌ హత్య కేసులో ఊహించని మలుపులు వెలుగులోకి వస్తున్నాయి. లోహగఢ్ కోట వద్ద తన ప్రియుడితో కలిసి, కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను లోయలోకి నెట్టి హత్య చేసిన నిందితురాలు సియా గోయల్.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలను వెల్లడించింది.

తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని కేతన్‌కు ముందే చెప్పినప్పటికీ, అతను మాత్రం వివాహాన్ని రద్దు చేసుకునేందుకు ఒప్పుకోలేదని విచారణలో తేలింది. ప్రస్తుతం సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్‌ చౌదరి పూణే రూరల్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. మహారాష్ట్రలోని వాద్గావ్ కోర్టు వీరికి జూన్ 29 వరకు వారం రోజుల పోలీస్ కస్టడీ విధించడంతో, విచారణలో భాగంగా ఈ సంచలన వివరాలు బయటపడ్డాయి.

‘నాకు మన పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేదు’. నేను చేతన్‌ను ప్రేమిస్తున్నాను. అతన్నే వివాహం చేసుకుంటాను’ అని తాను కేతన్‌కు స్పష్టం చేసినట్లు సియా పోలీసుల ముందు పేర్కొంది. అయితే, దానికి కేతన్ స్పందిస్తూ.. ‘నన్ను పెళ్లి చేసుకోకుండా నువ్వు తప్పించుకోలేవు.. నా గురించి, మా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌ గురించి నీకు బాగా తెలుసు కదా’అంటూ తనను బెదిరించాడని సియా వాంగ్మూలం ఇచ్చింది. అయితే, సియా చేస్తున్న ఈ వాదనలు ఎంతవరకు నిజమనేది ప్రస్తుత న్యాయపరమైన పరిశీలన, పోలీసుల కొనసాగుతున్న దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.

మొత్తం నువ్వు చేశావ్‌.. కాదు నీవల్లే
అంతకుముందు పోలీసు కస్టడీలో సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి విచారణలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. హత్య, నేరపూరిత కుట్ర వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ జంట.. మొదట్లో ఇల్లు వదిలి పారిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అలా పారిపోతే తన కుటుంబ పరువు పోతుందనే ఆందోళనతో సియా ఆ నిర్ణయం నుండి వెనక్కి తగ్గింది. కేతన్‌ను చంపడానికి ముందే, అతనితో కుదిరిన వివాహ నిశ్చితార్థాన్ని ఎలాగైనా రద్దు చేసుకోవడానికి ఈ జంట అనేక మార్గాలను కూడా అన్వేషించినట్లు సమాచారం.

విచారణ సమయంలో చేతన్ చౌదరి పోలీసులతో మాట్లాడుతూ.. సియాతో కలిసి పారిపోవడమే తన లక్ష్యమని, కానీ కేతన్‌ను హత్య చేయాలని ఆమెనే పట్టుబట్టిందని వెల్లడించాడు. మరోవైపు, ఈ హత్య పూర్తిగా చేతన్ ఆలోచనేనని సియా దర్యాప్తు అధికారులకు తెలిపింది. అంతకుముందు జూన్ 14న కేతన్‌ను చంపడానికి వారు చేసిన మొదటి ప్రయత్నం విఫలమైందని, ఆ సమయంలో చేతన్ తన ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడని కూడా సియా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది.

‘ఎవరో కోటపై నుంచి కిందపడిపోయారు.. కాపాడండి’
కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఫోటోలు దిగుతూ కేతన్ ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయాడంటూ నిందితురాలు సియా గోయల్ ఆడిన నాటకాన్ని.. అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ ధీరజ్ జాదవ్ ఇచ్చిన సాక్ష్యం పూర్తిగా బట్టబయలు చేసింది.

‘ఎవరో కోటపై నుంచి కిందపడిపోయారు.. కాపాడండి’ అంటూ నాడు సియా గోయల్ చేసిన ఆర్తనాదాలు, కేవలం పోలీసులను, అందరినీ తప్పుదోవ పట్టించేందుకేనని ఇప్పుడు స్పష్టమవుతోంది. ఆ రోజు లొహగడ్ కోటపై అసలు ఏం జరిగిందో సెక్యూరిటీ గార్డ్ కళ్లారా చూసి ఒక జాతీయ మీడియాతో పంచుకున్నారు. ‘ఎవరో కిందపడిపోయారు.. కాపాడండి అంటూ అరిచింది’ జూన్ 18న ఘటన జరిగిన సమయంలో తాను కోటపై విధి నిర్వహణలో ఉన్నట్లు ధీరజ్ జాదవ్ వివరించారు.

కేతన్‌ పేరే చెప్పలేదు
దూరం నుండి హఠాత్తుగా ఒక మహిళ గట్టిగా కేకలు వేయడం వినిపించింది. దాంతో నేను పరుగెత్తుకుంటూ ఆమె (సియా గోయల్) వద్దకు వెళ్లాను. ఏం జరిగిందని అడగ్గా.. ఆమె తీవ్ర ఆందోళన నటిస్తూ ‘ఇక్కడి నుండి ఎవరో కిందపడిపోయారు.. ప్లీజ్ సహాయం చేయండి.. సహాయం చేయండి’ అంటూ అరవడం మొదలుపెట్టింది. కానీ కింద పడింది తన కాబోయే భర్తేనని గానీ, అతని పేరని గానీ, అసలు ఏం జరిగిందనే మరిన్ని వివరాలను గానీ ఆ సమయంలో ఆమె నాకు చెప్పలేదు అని జాదవ్ పేర్కొన్నారు.

కోట వద్ద 24 గంటలూ భద్రతా సిబ్బంది అందుబాటులో ఉంటారని, సమీపంలోనే పోలీస్ స్టేషన్ కూడా ఉందని జాదవ్ తెలిపారు. కేతన్‌ను తోసేసిన ఆ నిర్దిష్ట ప్రాంతంలో తీవ్రమైన మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు ఉన్నాయని, అందువల్లనే తాము పోలీసులకు సమాచారం అందించడం కొంచెం ఆలస్యమైందని ఆయన వెల్లడించారు. తాను వెంటనే అప్రమత్తమై పోలీసులను పిలిపించడంతో ఈ దారుణ కుట్ర వెలుగులోకి రావడానికి పునాది పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement