పేపర్‌ లీక్స్‌ వ్యవస్థాగత సమస్య | Student movement outcome larger than Pradhan resignation: AISA chief Neha Bora | Sakshi
Sakshi News home page

పేపర్‌ లీక్స్‌ వ్యవస్థాగత సమస్య

Aug 12 2026 5:51 AM | Updated on Aug 12 2026 5:51 AM

Student movement outcome larger than Pradhan resignation: AISA chief Neha Bora

శిక్షలు పెంచితే తీరేది కాదు 

విపక్షాలు ఆదర్శంగా నిలవాలి 

విద్యార్థి రాజకీయాలూ ప్రజాస్వామ్య పరీక్షే 

ఏఐఎస్‌ఏ నేత నేహా బోరా

కోల్‌కతా: ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం భారత విద్యా వ్యవస్థలోని లోపాల వల్ల వచ్చిన వ్యవస్థాగత సమస్య అని, లీకేజీ బాధ్యులకు శిక్ష పెంచడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించలేమని ఆలిండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (ఏఐఎస్‌ఏ) అధ్యక్షురాలు నేహా బోరా స్పష్టం చేశారు. జంతర్‌మంతర్‌లో కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసన కార్యక్రమాల సందర్భంగా సామజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌తో కలిసి నేహా బోరా 23 రోజులపాటు ఉద్యమించిన సంగతి  తెలిసిందే. జార్ఖండ్‌ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలపై జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న నేహా మంగళవారం కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు. విద్యార్థి ఉద్యమాలతో వ్యవహరించే విషయంలో బీజేపీయేతర రాజకీయ పార్టీలు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. 

ప్రశ్న పత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్రం ప్రతిపాదిస్తున్న చట్టం నష్టం జరిగిన తరువాత ఏం చేయాలన్న దానిపైనే దృష్టి పెట్టిందని, లీకేజీ జరిగేందుకు కారణమవుతున్న సమస్యల పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు. ప్రశ్న పత్రాల లీకేజీ ఘటనలపై దర్యాప్తును కొత్త చట్టం ప్రకారం 11 నెలల్లో పూర్తి చేసినా అప్పటికి అడ్మిషన్‌ ప్రక్రియ పూర్తయి ఉంటుందని అన్నారు.  

జార్ఖండ్‌లో కొనసాగుతున్న ఆందోళనలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న విపక్ష, బీజేపీయేతర పార్టీలు శాంతియతంగా నిరసన చేస్తున్న విద్యార్థులతో ఎలా వ్యవహరించాలో చూపాలని, అందరికీ ఆదర్శంగా నిలవాలని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు ఇంకోలా వ్యవహరిస్తే విపక్షాలు రాజకీయంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను రాజకీయంగా సమర్థంగా ఎదుర్కోలేరని అన్నా రు. జెన్‌–జీ ఉద్యమం ప్రజా ప్రతినిధులను తప్పులకు బాధ్యులుగా నిలపవచ్చునన్న విషయాన్ని నిరూపించిందని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఒక్కటొక్కటిగా బలహీన పడుతున్న సమయంలో పుట్టుకొచ్చిన జెన్‌–జీ ఉద్యమం వాటి పునరుద్ధరణపై ఆశలు పెంచేవిగా ఉన్నాయన్నారు.

అనుభవజు్ఞల చేతుల్లో విధాన రూపకల్పన
విద్యా వ్యవస్థలో అనుభవం ఉన్నవారు విధానాల రూపకల్పనలో తమవంతు పాత్ర పోషించాలని బోరా అభిప్రాయపడ్డారు. కేంద్రీకరణను ప్రోత్సహించే నూతన విద్యా విధానాన్ని వెనక్కు తీసుకోవాలని, ఈ విధానం ప్రైవేటీకరణను, విద్యార్థుల మధ్య అసమానతలను పెంచేదిగా ఉందని విమర్శించారు. న్యాయం, అన్యాయం, సమాజ నిర్వహణ వంటి అంశాలపై చర్చలకు, అవగాహన పెంచుకునేందుకు విశ్వవిద్యాలయాలు వేదికలని అన్నారు. విద్యార్థి రాజకీయాలు కూడా ప్రజాస్వామ్య పరీక్షేనని, అక్కడ కూడా నేతలు విద్యార్థుల ప్రశ్నలు ఎదుర్కొని తాము వారికి నిజమైన ప్రతినిధులుగా నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 

విద్యార్థి రాజకీయాలను అణచివేస్తే ప్రశ్నించే సంస్కృతికి బదులు అనుకరించే సంస్కృతి ఎక్కువవుతుందని బోరా హెచ్చరించారు. ఢిల్లీ నిరసనల సమయంలో పౌరులపై బలప్రయోగం సరికదాన్న బోరా నిరసనకారులతో వ్యవహరించడానికి ప్రభుత్వాలు వ్యవస్థలు, ప్రోటోకాల్‌లు ఏర్పాటు చేసుకున్నాయని గుర్తు చేశారు. జెన్‌–జీకి ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ మద్దతివ్వడంపై బోరా పరోక్షంగా స్పందించారు. పెద్దల సలహాలను ప్రశ్నించకుండా పాటించి ఉంటే సాంఘిక సంస్కరణలు జరిగేవే కాదని వ్యాఖ్యానించారు.

ఏకమైతేనే హక్కుల సాధన
ప్రజలు ఐకమత్యంతో నిలిస్తే తమ హక్కులను సాధించుకోగలరు అనేందుకు జంతర్‌మంతర్‌ నిరసన కార్యక్రమం ప్రత్యక్ష ఉదాహరణ అని నేహా బోరా వ్యాఖ్యానించారు. కోల్‌కతాలో మంగళవారం కొంతమంది వామపక్ష విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ జంతర్‌ మంతర్‌ ఉద్యమ ఫలితం కేంద్ర మంత్రి రాజీనామా ఒక్కటే కాదని స్పష్టం చేశారు. జవాబుదారీతనానికి అతీతంగా ఉన్నామని అనుకునే వారిపై సాధించిన విజయమని అన్నారు. ప్రజలు దోషులుగా భావిస్తే ఎంతటి ముఖ్యులనైనా గద్దె దింపవచ్చునని ఈ ఉద్యమం నిరూపించిందని చెప్పారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement