కోర్టు వ్యాఖ్యలు సోషల్ మీడియా వైరల్ కంటెంట్‌గా మారుతున్నాయా? వాటి ద్వారా వాణిజ్య ప్రయోజనాలు పొందుతున్నారా?.. ఈ అంశాలపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కార్యకలాపాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్రం, సీబీఐ సహా పలు సంస్థలకు నోటీసులు ఇచ్చింది.
డిజిటల్-రాజకీయ సంస్థగా పేర్కొంటున్న సీజేపీ కార్యకలాపాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని సుప్రీంకోర్టు న్యాయవాది రాజా చౌద్రి ఓ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వంతో పాటు దర్యాప్తు సంస్థలకూ నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు చేసే మౌఖిక వ్యాఖ్యలను(Oral Comments) సందర్భం నుంచి వేరు చేసి వైరల్ చేయడం, వాటి ద్వారా వాణిజ్య ప్రయోజనాలు పొందడాన్ని పిటిషన్‌లో ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం.
కోర్టు వ్యాఖ్యలు.. వైరల్ కంటెంట్‌గా మారుతున్నాయా?
న్యాయ విచారణల్లో న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య జరిగే సంభాషణలను కొన్ని భాగాలుగా కట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో న్యాయ ప్రక్రియ అసలు ఉద్దేశం పక్కదారి పడుతోందని తెలిపారు. “కోర్టు వ్యాఖ్యలను మీమ్స్, వైరల్ వీడియోలు, ఆన్‌లైన్ ప్రచారాలుగా మార్చి సందర్భం లేకుండా చూపిస్తున్నారు” అని పిటిషన్‌లో పేర్కొన్నారు.
‘కాక్రోచ్’ వ్యాఖ్యలతో మొదలైన వివాదం
నకిలీ న్యాయ డిగ్రీల అంశంపై విచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ చేసినట్లు ప్రచారమైన ‘కాక్రోచ్’ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం సీజేఐ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. ఆ వ్యాఖ్యల ఆధారంగా ‘కాక్రోచ్ జంతా పార్టీ’ పేరుతో ఓ ఆన్‌లైన్ వేదిక ఏర్పడటం, అది రాజకీయ-డిజిటల్ ఉద్యమంగా మారడంపై పిటిషన్‌లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వ్యతిరేకం కాదన్న పిటిషనర్
తమ పిటిషన్ ప్రజాస్వామ్య విమర్శలు, వ్యంగ్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వ్యతిరేకం కాదని రాజా చౌదరి తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. అయితే రాజ్యాంగ సంస్థలపై జరిగే వ్యాఖ్యలను వాణిజ్య ప్రయోజనాల కోసం వక్రీకరించడం సమస్యగా పేర్కొన్నారు.
నీట్ వివాదం నేపథ్యంలో CJP చర్చ
నీట్ యూజీ పేపర్ లీక్‌లపై కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసనలు, ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల చర్యల నేపథ్యంలో ఈ సంస్థపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా దుమారం రేపింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు నోటీసులతో సీజేపీ కార్యకలాపాలు, కోర్టు వ్యాఖ్యల వినియోగంపై తదుపరి విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్రం, సీబీఐ సమాధానాల అనంతరం ఈ కేసులో తదుపరి పరిణామాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.


