మహిళలకు తక్షణ న్యాయసహాయం | SC judge calls for immediate legal aid to women | Sakshi
Sakshi News home page

మహిళలకు తక్షణ న్యాయసహాయం

Aug 9 2026 6:27 AM | Updated on Aug 9 2026 6:27 AM

SC judge calls for immediate legal aid to women

జస్టిస్‌ నాగరత్న సూచన

లీగల్‌ ఎయిడ్‌తో వచ్చిన ఫలితాలపై అధ్యయనం

హైకోర్టు పరిధి తగ్గించడంతో నష్టమని వ్యాఖ్య

బెంగళూరు: ఏదైనా ఘటన జరిగిన వెంటనే మహిళలకు న్యాయ సాయం అందించే వ్యవస్థ ఒకదాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.వి. నాగరత్న సూచించారు. కర్ణాటక హైకోర్టు అధికార పరిధిని తగ్గించేలా ఇటీవల చేసిన మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘మహిళలకు న్యాయం’ అంశంపై జాతీయ మహిళా కమిషన్, కర్ణాటక హైకోర్టు, కర్ణాటక జ్యుడీషియల్‌ అకాడమీలు ఏర్పాటు చేసిన సదస్సును శనివారం ప్రారంభించిన జస్టిస్‌ నాగరత్న మాట్లాడుతూ.. ఏదైనా ఘటన జరిగితే వెంటనే పోలీస్‌ స్టేషన్లు లేదా ఆసుపత్రుల్లోనైనా  మహిళలకు న్యాయపరమైన సాయం అందే ఏర్పాట్లు ఉండాలని అన్నారు.

 రాష్ట్ర, తాలూకా న్యాయ సేవా వ్యవస్థలు, పోలీస్‌ స్టేషన్లతోపాటు ఇతర సంబంధిత ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయంతో పటిష్టమైన వ్యవస్థ ఉండాలని సూచించారు. న్యాయసహాయం ద్వారా మహిళలకు చేకూరిన లబ్ధిని మదింపు చేసేందుకు ఒక అధ్యయనం నిర్వహించాలని, ఇది లబ్ధిదారుల సంఖ్యను మాత్రమే కాకుండా, ఫలితాలను అంచనా వేయాలని వివరించారు. న్యాయసహాయం ద్వారా కేసుల పరిష్కారం జరిగినప్పుడు హైకోర్టు ఆ విషయాన్ని సుప్రీంకోర్టు న్యాయసహాయ కమిటీకి తెలపాలని, తద్వారా ఓడిపోయిన పక్షం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ముందస్తు సమాచారం ఉంటుందని సూచించారు. 

కర్ణాటక సివిల్‌ కోర్టుల సవరణ చట్టం–2023, కర్ణాటక హైకోర్టు సవరణ చట్టం–2023లో చేసిన మార్పులు హైకోర్టు సాధారణ తొలి అప్పీళ్లను విచారించే అధికారాన్ని గణనీయంగా తగ్గించాయని జస్టిస్‌ నాగరత్న ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త విధానం ప్రకారం, సివిల్‌ జడ్జి (సీనియర్‌ డివిజన్‌) ఇచ్చిన తీర్పు, డిక్రీపై అప్పీల్‌ను హైకోర్టులో కాకుండా జిల్లా కోర్టులో దాఖలు చేయాల్సి ఉంటుందని ఇది సరికాదన్నారు.  ఈ మార్పు హైకోర్టు అధికారంపై ప్రభావం చూపుతుందని, మహిళా పిటిషనర్లకు నష్టం కలిగిస్తుందని చెప్పారు. ఈ నిబంధనను సరిదిద్ది, రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, అడ్వొకేట్‌ జనరళ్లను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement