కోర్టు ప్రొసీడింగ్స్‌ రిపోర్టీంగ్‌కు ఓకే  | News outlets can report courts, but cannot utilise audio-video clips | Sakshi
Sakshi News home page

కోర్టు ప్రొసీడింగ్స్‌ రిపోర్టీంగ్‌కు ఓకే 

Aug 6 2026 5:27 AM | Updated on Aug 6 2026 5:27 AM

News outlets can report courts, but cannot utilise audio-video clips

ఆడియో, వీడియో క్లిప్‌లపై నిషేధం

స్పష్టం చేసిన సుప్రీంకోర్టు 

సెప్టెంబర్‌ 18కి తదుపరి విచారణ వాయిదా

సాక్షి, న్యూఢిల్లీ: న్యాయస్థానాల విచారణలకు సంబంధించి వార్తా సంస్థలు యథేచ్ఛగా రిపోర్టీంగ్‌ చేసుకోవచ్చని, అయితే విచారణ తాలూకు ఆడియో, వీడియో క్లిప్‌లను మాత్రం తమ వార్తల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ప్రొసీడింగ్స్‌ రిపోర్టీంగ్‌పై గుర్తింపు పొందిన వార్తా సంస్థలకు ఎలాంటి పూర్తిస్థాయి (బ్లాంకెట్‌) నిషేధం లేదని తేల్చి చెప్పింది. కోర్టు ప్రొసీడింగ్స్‌ ముఖ్యాంశాలను, న్యాయపరమైన పరిణామాలను వార్తా సంస్థలు ప్రచురించొచ్చని, కానీ ప్రత్యక్ష ప్రసారాల క్లిప్పింగులను వాడుకోరాదని స్పష్టం చేసింది.

 ఈ మేరకు జూలైæ 24న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం వివరణ ఇచ్చింది. సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి లేకుండా న్యాయస్థానాల ప్రొసీడింగ్స్‌కు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగులను వెలికితీయడం, ప్రసారం చేయడం, వాటి ద్వారా ఆదాయం పొందడం, పోస్ట్‌ చేయడం, రీ–పోస్ట్‌ చేయడం, అప్‌లోడ్‌ చేయడం, మార్పులు చేయడం, భద్రపరచడం లేదా డిజిటల్, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఉంచడం వంటివి చేయరాదని సుప్రీంకోర్టు జూలై 24న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 

తాజాగా బుధవారం లైవ్‌ స్ట్రీమింగ్, కోర్టు ప్రొసీడింగ్స్‌ రికార్డింగ్‌లకు సంబంధించిన మోడల్‌ నిబంధనల అమలుపై స్టేటస్‌ రిపోర్టులను దాఖలు చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను ఆదేశించింది. నిరంతరాయంగా లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను అందులో వివరించాలని కోరింది. అలాగే ఈ పిటిషన్‌లోని అభ్యర్థనలను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు నోడల్‌ మంత్రిత్వ శాఖలతో సంప్రదించి ఒక ప్రతిపాదనను కోర్టు ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 18వ తేదీకి వాయిదా వేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement