మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ, కల్తీ పాల ఉత్పత్తులపై కఠిన చర్యలకు దిగిన రాష్ట్ర ప్రభుత్వం.. అనలాగ్ లేదా నాన్-డెయిరీ పనీర్ (పాలు కాకుండా ఇతర పదార్థాలతో తయారు చేసే పనీర్) తయారీ, విక్రయం, పంపిణీపై పూర్తిగా నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే గరిష్ఠంగా ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
మహారాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తుకారామ్ ముండే జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా అనలాగ్ పనీర్ తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, రవాణా, హోల్‌సేల్, రిటైల్ విక్రయాలు, పంపిణీ, అమ్మకానికి ఉంచడం వంటి అన్ని కార్యకలాపాలను నిషేధించారు. కల్తీ ఆహార పదార్థాల విక్రయాలను అడ్డుకోవడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. దేశంలో ఇలాంటి నిషేధం విధించిన రెండో రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఇంతకుముందు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా అనలాగ్ పనీర్‌పై నిషేధం విధించింది.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నేర తీవ్రత ఆధారంగా చర్యలు తీసుకుంటారు. అనలాగ్ పనీర్‌ను అసలు డెయిరీ పనీర్‌గా చూపించి విక్రయిస్తే వినియోగదారులను మోసం చేసినట్లుగా పరిగణిస్తామని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) హెచ్చరించింది. అనలాగ్ పనీర్ సాధారణంగా పాలు నుంచి కాకుండా.. కూరగాయల కొవ్వులు, నూనెలు, ఇతర నాన్-డెయిరీ పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు. చూడటానికి సంప్రదాయ పనీర్‌లానే కనిపించినప్పటికీ, దానిని అసలు పాలతో తయారు చేసిన పనీర్‌గా విక్రయించడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు.
భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం (FSSAI).. అసలు పనీర్ పాలు ఆధారంగానే తయారు కావాలి. అందులో స్టార్చ్, నాన్-డెయిరీ కొవ్వులు లేదా సింథటిక్ పదార్థాలు కలపకూడదు. అయితే అనలాగ్ పనీర్‌ను విక్రయించడానికి FSSAI కొన్ని నిబంధనలతో అనుమతి ఇస్తుంది. అది అనలాగ్ ఉత్పత్తి అని స్పష్టంగా లేబుల్‌పై పేర్కొనాల్సి ఉంటుంది. అయితే మార్కెట్‌లో కొందరు వ్యాపారులు తక్కువ ఖర్చుతో తయారయ్యే అనలాగ్ పనీర్‌ను అసలు పాల పనీర్‌గా విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది.
1,400 కిలోల నకిలీ పనీర్
గత ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీలో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. అనలాగ్ పనీర్‌ను పూర్తిగా నిషేధించాలని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. తాజాగా జూలై 30న జారీ చేసిన ఉత్తర్వులతో ఆ డిమాండ్‌కు అధికారిక రూపం వచ్చింది. కల్తీ పాల ఉత్పత్తులపై మహారాష్ట్రలో ఇప్పటికే విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. మే నెల నుంచి సింథటిక్ పాలు, నకిలీ పనీర్ తయారీ యూనిట్లపై ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు. పుణేలోని మంజరి ఖుర్ద్ ప్రాంతంలో నిర్వహించిన ఓ భారీ దాడిలో అధికారులు సుమారు 1,400 కిలోల నకిలీ పనీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకు లభించే ప్రత్యామ్నాయ పదార్థాలతో ఈ పనీర్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అదే సమయంలో భారీగా ముడి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సుమారు 1,800 కిలోల స్కిమ్డ్ మిల్క్ పౌడర్, 400 కిలోల గ్లిసరాల్ మోనోస్టియరేట్ (GMS) పౌడర్, 718 లీటర్ల పామ్ ఆయిల్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో రెస్టారెంట్లు, హోటళ్లలో కూడా ఫుడ్ సేఫ్టీ తనిఖీలు ముమ్మరం అయ్యాయి. నిబంధనలు ఉల్లంఘించిన పలు సంస్థలపై చర్యలు తీసుకోవడంతో పాటు కొన్ని లైసెన్సులు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నకిలీ పనీర్‌కు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా మహారాష్ట్ర తీసుకున్న ఈ నిర్ణయం.. వినియోగదారుల ఆరోగ్య రక్షణలో కీలక అడుగుగా అధికారులు పేర్కొంటున్నారు.


