డీకే కేబినెట్‌పై గాలి జనార్దనరెడ్డి సంచలన వ్యాఖ్యలు | Gali Janardhana Reddy Fire On DK Shiva Kumar | Sakshi
Sakshi News home page

డీకే కేబినెట్‌పై గాలి జనార్దనరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Aug 5 2026 11:17 AM | Updated on Aug 5 2026 11:41 AM

Gali Janardhana Reddy Fire On DK Shiva Kumar

సాక్షి,బళ్లారి: ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మలి విడత నిర్వహించిన మంత్రివర్గ విస్తరణలో బళ్లారి గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే నాగేంద్రకు మంత్రి పదవి కేటాయించడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం ప్రతిపక్ష నేత ఆశోక్, మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డితో పాటు పలువురు నాయకులు వేర్వేరు ప్రాంతాల్లో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ను, ఆ పార్టీ రాష్ట్ర నేతలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

 మాజీ మంత్రి జనార్దనరెడ్డి మాట్లాడుతూ వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొని, అప్పట్లో నాగేంద్ర తన మంత్రి పదవిని కోల్పోయి, జైలుకు కూడా వెళ్లి వచ్చారని గుర్తు చేశారు. అయితే ఆ అవినీతిలో ఒక్క నాగేంద్రది మాత్రమే పాత్ర కాదని, పలువురు ఆ పార్టీ పెద్దలకు కూడా ఉన్నట్లు రుజువు అయిందన్నారు. నాగేంద్ర ముఖానికి అవినీతి రంగు పులిమి, మిగిలిన కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు కూడా లూటీ చేశారన్నారు.   

వాస్తవాలు బయట పడతాయనే.. 
నాగేంద్రకు కేవలం 10 నుంచి 20 శాతం మాత్రమే పర్సంటేజ్‌ ఇచ్చి, మిగతా సొమ్మును అప్పట్లో బళ్లారి లోక్‌సభ ఎన్నికలతో పాటు తెలంగాణ, గోవా అసెంబ్లీ ఎన్నికలకు ఖర్చు చేశారన్నారు. ఈ విషయాలను నాగేంద్ర బయటకు చెబుతారనే భయంతో మంత్రి పదవిని కేటాయించారని ఆరోపించారు. ఇదే విషయంపై అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు అశోక్‌ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. వాలీ్మకి అభివృద్ధి మండలిలో అవినీతిపై తాము ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగేంద్రతో మంత్రి పదవికి రాజీనామా చేయించే వరకు పెద్ద ఎత్తున పోరాటం చేశామన్నారు. 

అయితే ప్రస్తుతం అదే పార్టీలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మంత్రివర్గంలో ఆయనకు మంత్రి పదవిని కేటాయించారని, ఆయన అవినీతి అంతా వాషింగ్‌ మిషన్‌లో వేసి కడిగి ఉండవచ్చన్నారు. అవినీతిలో ఆ పార్టీ పెద్దల పాత్ర కూడా ఉందనే విషయం స్పష్టంగా తెలిసిపోయిందన్నారు. ఇదే విషయంపై పరిషత్‌ సభ్యుడు లింగరాజ్‌ పాటిల్‌ నేతృత్వంలో బెళగావిలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్, ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement