హైడ్రా రంగనాథ్‌ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలపై కేసు | HYDRA Ranganath Sign Forgery Case Filed On 8 Colleges | Sakshi
Sakshi News home page

హైడ్రా రంగనాథ్‌ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలపై కేసు

Aug 5 2026 11:26 AM | Updated on Aug 5 2026 11:56 AM

HYDRA Ranganath Sign Forgery Case Filed On 8 Colleges

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో నకిలీ పత్రాల వ్యవహారం కలకలం రేపుతోంది. హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్‌ ఎన్‌వోసీలు (NOCలు) సృష్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది ప్రైవేట్‌ కాలేజీలపై కేసు నమోదైంది. దీంతో, ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అయితే, ఈ నకిలీ ఎన్‌వోసీలను ఇంటర్‌ బోర్డుకు సమర్పించి గుర్తింపు పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. హైడ్రా పేరుతో తయారు చేసిన నకిలీ పత్రాల వ్యవహారం వెలుగులోకి రావడంతో, సంబంధిత కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై హైదరాబాద్‌లోని లేక్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నకిలీ పత్రాల తయారీ, ఫోర్జరీ, మోసం తదితర అభియోగాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు నమోదు చేసిన కేసులో భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 337, 336(3), 340(2), 318(4), 3(5) కింద చర్యలు తీసుకుంటున్నారు.

కాగా, పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెల్లాపూర్‌, చిక్కడపల్లి, ఎస్‌ఆర్‌ నగర్‌, మెహదీపట్నం, బర్కత్‌పుర ప్రాంతాల్లో ఉన్న కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఈ ఫోర్జరీ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇదే తరహాలో మరిన్ని అక్రమాలు జరిగాయా? అన్న కోణంలో అధికారులు విచారణ ముమ్మరం చేశారు. మరో 60 కాలేజీలకు సంబంధించిన ఎన్‌వోసీలను కూడా స్క్రూటినీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు.. హైడ్రా పేరును ఉపయోగించి ప్రభుత్వ అధికారుల సంతకాలను నకిలీ చేయడం తీవ్ర నేరమని అధికారులు చెబుతున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని కాలేజీలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఎనిమిది కాలేజీలు ఇవే..

  • మెహిదిపట్నంలోని ప్రియాంకా జూనియర్ కాలేజ్
  • విద్యానగర్‌లోని మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్
  • చంద్రాయన్ గుట్టలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్
  • చిక్కడపల్లిలోని న్యూ ఎరా జూనియర్ కాలేజ్
  • శివరాంపల్లిలోని షాహీర్ జూనియర్ కాలేజ్
  • తెల్లాపూర్‌లోని వశిష్ట జూనియర్ కాలేజ్
  • బర్కత్‌పురాలోని హైందవి జూనియర్ కాలేజ్
  • ఎస్‌ఆర్‌ నగర్‌లోని రెసిడెన్స్ జూనియర్ కాలేజ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement