సూచిక బోర్డు లేకుండా పనులే కారణం..
హైదరాబాద్, చందానగర్: నగరంలో విషాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఎలాంటి సూచిక బోర్డు లేకుండా లిఫ్ట్ ఆపరేటర్ మరమ్మతు చేస్తుండటం, లిఫ్ట్ ఎక్కిన మహిళకు ఆ విషయం తెలియకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
వికారాబాద్ జిల్లా కుల్కచర్లకు చెందిన దాడి శ్రీనివాస్ నల్లగండ్లలోని అపర్ణ జినిత్‌లో సెక్యూరిటీ గార్డు. తన భార్య అనసూయ(43)తో కలిసి చందానగర్ అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లోని చాట్వాజ్ మాన్షన్ అపార్ట్‌మెంట్‌లో ఉండే బంధువుల వద్దకు వచ్చారు. రెండో అంతస్తుకు వెళ్లడానికి లిఫ్ట్ ఎక్కారు. ఆమె లోపల అడుగు పెట్టిన వెంటనే తలుపులు వేయకుండానే లిఫ్ట్ కదిలిపోయింది. దీంతో ఆమె కాళ్లు అందులో ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే ఆమె భర్త కేకలు వేయడంతో వెంటనే వచ్చిన అపార్ట్‌మెంట్ వాసులు లిఫ్టు తలుపులు తెరిచి ఆమెను బయటకు తీశారు. తీవ్ర గాయాలైన ఆమెను ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందిందని వైద్యులు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా, సూచిక బోర్డులు పెట్టకుండా, విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా లిఫ్ట్‌కు మరమ్మతులు చేపట్టడంతోనే నిండు ప్రాణం బలి అయిందని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


