‘పట్టభద్రులపై’ బీఆర్‌ఎస్‌ నజర్‌ | BRS focus on MLC Elections: Telangana | Sakshi
Sakshi News home page

‘పట్టభద్రులపై’ బీఆర్‌ఎస్‌ నజర్‌

Aug 5 2026 5:21 AM | Updated on Aug 5 2026 5:21 AM

BRS focus on MLC Elections: Telangana

శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోటీకి కసరత్తు

వరంగల్‌– ఖమ్మం– నల్లగొండలో పోటీపై మరోమారు ఏనుగుల కన్ను

హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌­నగర్‌లో పోటీకి వాణీదేవి అనాసక్తి

త్వరలో ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ ముఖ్యనేతలతో కేటీఆర్‌ భేటీలు

సాక్షి, హైదరాబాద్‌: శాసన మండలి పట్టభద్రుల కోటాలో వచ్చే ఏడాది మార్చిలోపు రెండు స్థానాలకు ఎన్నిక జరగనుంది. పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ పదవీ కాలం వచ్చే మార్చి 29న ముగియనుంది. దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణీదేవి బీఆర్‌ఎస్‌ తరపున హై­ద­రాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియో­జక­వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్‌ తరపున వరంగల్‌–ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికైన తీన్మార్‌ మల్లన్న ప్రస్తుతం ఇండిపెండెంట్‌గా కొనసాగుతున్నారు.

వీరి పదవీ కాలం ముగియనున్న నేప­థ్యంలో ఆయా స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించాలని భావిస్తున్న బీఆర్‌ఎస్‌ ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించింది. వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని భావి­స్తోంది. ఓటరు నమోదుపై అవగాహన కల్పించడంతోపాటు పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేసేందుకు త్వరలో ఉమ్మడి జిల్లాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రత్యేకంగా భేటీలు నిర్వహిస్తారు. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా స్థానికంగా సమావేశాలు ఏర్పాటు చేసేందుకు షెడ్యూలు ప్రకటించే అవకాశముంది.

వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ బరిలో ఏనుగుల?
2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజే­శ్వ­ర్‌రెడ్డి ఎన్నిక నేపథ్యలో వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్ట­భద్రుల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో 2024లో జరిగిన పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికలో ఏనుగుల రాకేశ్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ఓటమి అనంతరం కూడా రాకేశ్‌రెడ్డి విద్యార్థులు, పట్టభద్రులకు సంబంధించిన అంశాలపై క్షేత్రస్థాయిలో పలు ఆందోళన కార్య­క్ర­మాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే పట్టభ­ద్రు­ల కోటా ఎన్నికలో మరోమారు బరిలోకి దిగేందుకు రాకేశ్‌రెడ్డి సన్నాహాలు చేసుకుంటున్నారు.

గ్రూప్‌–1 విద్యార్థుల కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన రాకేశ్‌ రెడ్డి నిరుద్యోగ యువతకు మద్దతుగా నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో పార్టీ పరంగా, వ్యక్తిగతంగా చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. అయితే గతంలోనూ బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించిన దివ్యాంగుల కార్పొరేషన్‌ మా­జీ చైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఈసారైనా తనకు అవకా­శం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో తాను ఓటరు నమోదు­లో చురుగ్గా పాల్గొన్నా పార్టీ నిర్ణయం మేరకు బరి నుంచి తప్పుకున్న విషయాన్ని పార్టీ అధిష్టానానికి గుర్తు చేస్తున్నారు. 

హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌ స్థానంలో..
ప్రస్తుతం హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌ పట్టభ­ద్రు­ల నియోజకవర్గం ఎమ్మెల్సీగా బీఆర్‌ఎస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సురభి వాణీదేవి మరోమారు పోటీకి అనాసక్తి చూ­పుతున్నారు. గతంలో ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యక్ష రాజకీయా­ల్లోకి వచ్చిన వాణీదేవి తన వయసు రీత్యా పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బ­ల­మైన అభ్యర్థి కోసం బీఆర్‌ఎస్‌ అన్వేషిస్తోంది. బీసీలకు అవ­కాశం ఇవ్వాలని భావిస్తోంది. ఇండియన్‌ రైల్వే సర్వీసులో ఉ­న్న­తాధికారిగా ఉన్న ఉదయనాథ్‌ పోటీకి ఆసక్తి చూపుతున్న­ట్లు తెలిసింది.

ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన ఉదయ­నాథ్‌ ఇప్పటికే ఒకటి రెండు పర్యాయాలు కేటీఆర్‌తో భేటీ అ­యి­నట్లు సమాచారం. అయితే ఉదయనాథ్‌కు మరో 18 ఏళ్ల సర్వీ­సు ఉండటంతో పోటీపై కొంత ఊగిసలాట ధోరణితో ఉన్న­­ట్లు సమాచారం. స్పోర్ట్స్‌ అథారిటీ మాజీ చైర్మన్‌ అల్లీపు­రం వెంకటేశ్వర్‌రెడ్డి కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరు­తున్నారు. ఐఆర్‌ఎస్‌ రిటైర్డు అధికారి కూడా తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. పెరిక సామాజికవర్గానికి చెందిన ఓ న్యాయవాది కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement