సీఎం రేవంత్‌ను ప్రశ్నించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: సింగరేణి సంస్థకు రావాల్సిన రూ.54 వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణి తెలంగాణలో లేదా? అక్కడి కారి్మకులు తెలంగాణ ప్రజలు కారా అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. సింగరేణికి బకాయిలు చెల్లించే వరకు కార్మిక సంఘాలు పోరాడాలని, ప్రభుత్వం మెడలు వంచైనా ఆ నిధులను వసూలు చేస్తామని స్పష్టం చేశారు. తనపై విమర్శలు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్.. ఎవరి హయాంలో సింగరేణికి నష్టం జరిగిందో బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు.
సింగరేణికి కేంద్రం సంపూర్ణ సహకారం
తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే సింగరేణికి మూడో కోల్ బ్లాక్ (మణుగూరు పీకేఓసీ–2 డిప్‌సైడ్ బ్లాక్) దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనలో సింగరేణిని దోచుకునేందుకు యత్నించారని, కేసీఆర్, రేవంత్‌రెడ్డిల హయాంలోనే రూ.54 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని విమర్శించారు. మోదీ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే వేలంలో కొత్త బ్లాక్‌లు పొందుతూ సంస్థ భవిష్యత్‌కు ఊపిరి అందుతోందన్నారు.
ప్రధానిపై పోస్టులు.. డీసీపీ బదిలీపై ఆగ్రహం
పీఎం మోదీ, ఆయన తల్లిపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై బీజేపీ నేత సాయికిరణ్ ఫిర్యాదు చేయగా, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. అయితే, ఈ కేసులో ‘మెటా’ఇండియా హెడ్‌కు నోటీసులు ఇచ్చారన్న కారణంతో కేసు నమోదు చేసిన డీసీపీ అరవింద్ బాబును రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసి వేధింపులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ నుంచి రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే ఈ బదిలీ జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారుల బదిలీలు ‘మ్యూజికల్ చైర్’ఆటలా మారాయని, రెండేళ్లలో 44 సార్లు అధికారులను మార్చడం వల్ల వారిలో ఆందోళన నెలకొందన్నారు.


