భార్యను దారుణంగా హత్య చేసిన భర్త
దర్గాలో మృతదేహాన్ని పడేసిన వైనం
సంగారెడ్డి జిల్లాలో ఘటన
నారాయణఖేడ్: కుటుంబ కలహాలు, అనుమానం పెనుభూతంలా మారి కట్టుకున్న భార్యను ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం ఇరక్‌పల్లిలో చోటుచేసు కుంది. ఖేడ్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సయ్యద్ ముల్తాన్ (35)కు 13 ఏళ్ల క్రితం మనూరు మండలం అతి మ్యాల్ గ్రామానికి చెందిన పర్వీన్ (32)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కాగా సయ్యద్ ముల్తాన్ దర్గాలో పూజలు చేస్తూ, ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తు న్నాడు.
అయితే భార్యపై అనుమానంతో తరచూ ఆమెతో ఘర్షణపడేవాడు. దీంతో ఆరు నెలల క్రితం పర్వీన్ పుట్టింటికి వెళ్లింది. పెద్దలు సర్దిచెప్పడంతో 11 రోజుల క్రితం తిరిగి ఇంటికి వచ్చింది. సోమవా రం అర్ధ రాత్రి కూడా భార్య తో గొడవపడిన ముల్తాన్ రాయితో ఆమెపై దాడి చేశాడు. అనంతరం కత్తితో గొంతు కోసి మృతదేహాన్ని దర్గాలోకి తీసుకెళ్లి పడేశాడు. అక్కడి నుంచి సమీపంలోని గిరిజన తండాకు వెళ్లి విషయం చెప్పడంతో తండావాసులు పోలీసులకు సమాచారం అందించారు.
నాగల్‌గిద్ద పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించారు. ఘటనా స్థలాన్ని ఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌రెడ్డి సందర్శించారు. మంగళవారం మధ్యాహ్నం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించి, మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.


