111 జీవో ప్రాంతంలో సరికొత్త గ్రీన్‌సిటీ
1,32,600 ఎకరాల్లో రూపుదిద్దుకోనున్న హరిత నగరం
మొత్తం 84 గ్రామాల్లో ఆంక్షల తొలగింపు
తొలివిడత ఔటర్ లోపలి 6–8 గ్రామాల్లోనే అనుమతులు
ముఖ్యంగా వర్షపు నీటిని అడ్డుకోని స్థలాలకే ప్రాధాన్యత
ప్రాజెక్టుల్లో తక్కువ జన సాంద్రత, జీరో డిశ్చార్జ్ వ్యవస్థ
ప్రభుత్వానికి నిపుణుల కమిటీ సిఫారసులు
ఇదీ 111 జీవో
1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలాశయాల క్యాచ్‌మెంట్ ఏరియా 10 కిలోమీటర్ల వ్యాసార్ధంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు, భారీ నిర్మాణాలు, పరిశ్రమలు ఏర్పాటు కాకుండా నిషేధం విధిస్తూ జీవో 111ను తీసుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్ తదితర మండలాల్లోని 84 గ్రామాలు, సుమారు 1,32,600 ఎకరాలు ఈ జీవో పరిధిలోకి వస్తాయి.
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో పచ్చదనానికి పెద్ద పీట వేస్తూ మరో మినీ నగరం రూపుదిద్దుకోనుంది. పర్యావరణహితమైన గ్రీన్ విజన్ లే–అవుట్లు, లో డెన్సిటీ గృహాలు, మురుగు నీటి శుద్ధి కేంద్రాలు, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ (జెడ్‌ఎల్‌డీ) వ్యవస్థలతో సరికొత్త గ్రీన్ సిటీ రూపుదిద్దుకోనుంది. నగరవాసుల దాహార్తిని తీరుస్తున్న ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల పరిరక్షణ కోసం తీసుకొచ్చిన 111 జీవో పరిధిలో ఈ హరిత నగరం నిర్మితం కానుంది. 5 మండలాల్లోని 84 గ్రామాల పరిధిలో ఆంక్షల ఎత్తివేతపై ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఈ మేరకు కీలక అధ్యయనం చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందజేసింది. ఇప్పటివరకు 111 జీవో పరిధిలోని మొత్తం విస్తీర్ణంలో 10 శాతం నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఇచ్చేవారు. ఇకపై దీనికి అదనంగా 30 శాతం మేర నిర్మాణాలు చేపట్టేలా నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మొత్తంగా 40 శాతం కట్టడాలు, 60 శాతం మేర గ్రీనరీ, రోడ్లు, ఖాళీ స్థలాలతో ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది.
ప్రత్యేక జోనింగ్, మాస్టర్ ప్లాన్
గతంతో పోలిస్తే ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి కృష్ణా, గోదావరి నదుల నుంచి పుష్కలంగా తాగునీరు అందుతోంది. ఈ నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లపై ఆధారపడటం గణనీయంగా తగ్గిందని కమిటీ గుర్తించింది. అలాగే పర్యావరణ అధ్యయనాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన ఈ కమిటీ కొన్ని కీలక సిఫారసులు చేసింది. 84 గ్రామాల పరిధిలో ఒకేసారి ఆంక్షలు సడలించకుండా తొలుత ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) సరిహద్దు లోపల ఉన్న 6–8 గ్రామాలలో పరిమితంగా అనుమతులు ఇవ్వాలని కమిటీ ప్రతిపాదించింది. 84 గ్రామాల పరిధిలో ఆంక్షలు తొలగించినప్పటికీ.. జీవోను ఎత్తివేసిన మరుక్షణమే అస్తవ్యస్తంగా నిర్మాణాలు జరగకుండా ప్రత్యేక జోనింగ్ విధానం, సరికొత్త మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయాలని సూచించింది.
కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు
జంట జలాశయాలు చుట్టూ భారీ రింగ్ మెయిన్ పైప్‌లైన్లను నిర్మించి, గ్రామాల నుంచి వచ్చే మురుగు నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువుల్లోకి చేరకుండా దారి మళ్లించడంతో పాటు ఆయకట్టు ఛానళ్లను కాపాడాలని కమిటీ స్పష్టం చేసింది. అలాగే కృష్ణా, గోదావరి జలాలు తాగునీటి అవసరాలకు ఉన్నప్పటికీ ఈ జంట జలాశయాలు ఎండిపోకుండా ఉండటానికి కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని మళ్లించడం ద్వారా రిజర్వాయర్లు నిరంతరం జలకళతో ఉండేలా చూడాలని నిపుణులకు కమిటీ ప్రతిపాదించింది. అలాగే రెడ్, ఆరెంజ్ కేటగిరీకి చెందిన కాలుష్య కారక పరిశ్రమలు, రసాయన ఫ్యాక్టరీలపై నిషేధం కొనసాగించాలని స్పష్టం చేసింది.
వర్షపు నీటి కాల్వల జియో ట్యాగింగ్
పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్‌ఐ) అధ్యయనం ఆధారంగా ప్రతి గ్రామంలో వర్షపు నీరు జలశయాల్లోకి వెళ్లే క్యాచ్‌మెంట్ ప్రాంతాలు, నీరు వెళ్లని నాన్ క్యాచ్‌మెంట్ ప్రాంతాలను స్పష్టంగా డీ మార్కింగ్ చేసి, నాన్ క్యాచ్‌మెంట్ పరిధిలోని స్థలాలకు అత్యంత ప్రాధాన్యతగా అనుమతులు ఇస్తారు. నిర్మాణాలు చేసేటప్పుడు జంట జలాశయాలకు నీటిని తరలించే సహజసిద్ధ వర్షపు నీటి కాల్వలు కనుమరుగవకుండా ఉపగ్రహ చిత్రాల ఆధారంగా వాటిని జియో ట్యాగింగ్ చేస్తారు. భారీ కాంక్రీట్ కాంప్లెక్స్‌లు, హైరైజ్ అపార్ట్‌మెంట్లకు బదులుగా కేవలం హరిత భవనాలు, విల్లా కమ్యూనిటీలు, రిసార్ట్‌లు, లో డెన్సిటీ (తక్కువ జనసాంద్రత ఉండేందుకు అవకాశం ఉన్న) నిర్మాణాలకు మాత్రమే అనుమతులు ఇస్తారు.
మురుగునీరు బయటకు వదలకూడదు
నివాస ప్రాంతంలో నిర్మించే లే అవుట్లలో కనిష్టంగా 60 శాతం విస్తీర్ణాన్ని ఖాళీ ప్రదేశాలు, రోడ్లు, పచ్చదనం కోసం కేటాయించాలనే నిబంధన విధించనున్నారు. అనుమతి పొందే ప్రతి విల్లా ప్రాజెక్ట్, రిసార్ట్, కమర్షియల్ కాంప్లెక్స్‌లు తమ ప్రాజెక్టులోనే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ (జెడ్‌ఎల్‌డీ) వ్యవస్థను కలిగి ఉండాలి. అంటే ఆయా సముదాయాల్లో వాడిన నీటిని శుద్ధి చేసి తిరిగి తమ సొంత గార్డెనింగ్, మరుగుదొడ్లు వంటి అవసరాలకు వాడుకోవాలే తప్ప బయట ప్రవాహాల్లోకి వదలకూడదు.
ఇదీ 111 జీవో ..
1996లో ఉమ్మడి అంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలశయాల క్యాచ్‌మెంట్ ఏరియా 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు, భారీ నిర్మాణాలు, పరిశ్రమలు ఏర్పాటు కాకుండా నిషేధం విధిస్తూ జీవో 111ను తీసుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్ తదితర మండలాల్లోని 84 గ్రామాలు, సుమారు 1,32,600 ఎకరాలు ఈ జీవో పరిధిలోకి వస్తాయి.


